టీడీపీకి కొత్త నేత‌లు.. ఎవ‌రెవ‌రంటే..!

రాష్ట్రంలో జ‌రిగిన సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆశించిన ఫ‌లితాలు రాక‌పోయే స‌రికి  తెలుగుదేశం పార్టీలో  అంత‌ర్మథ‌నం ప్రారంభ‌మైంది. రెండో సారి కూడా వ‌రుస‌గా అధికారంలోకి రావాల‌ని అనుకున్నా [more]

Update: 2019-07-18 08:00 GMT

రాష్ట్రంలో జ‌రిగిన సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆశించిన ఫ‌లితాలు రాక‌పోయే స‌రికి తెలుగుదేశం పార్టీలో అంత‌ర్మథ‌నం ప్రారంభ‌మైంది. రెండో సారి కూడా వ‌రుస‌గా అధికారంలోకి రావాల‌ని అనుకున్నా సాధ్యం కాలేదు. దీనికి గ‌త కార‌ణాల‌పై అనేక స‌మీక్షలు కూడా నిర్వహించారు. ఈ ప‌రిణామం ఇలా కొన‌సాగుతూ ఉండ‌గానే.. తెలుగుదేశం నాయ‌కులు పార్టీ మారిపోతున్నారు. కీల‌క‌మైన బాధ్యత‌ల్లో ఉన్నవారు కూడా పార్టీ నుంచి దూరం కావ‌డంతో త్వర‌లోనే రాష్ట్రంలో తెర‌దీయ‌నున్న స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు సంబంధించి పార్టీని క్షేత్రస్థాయిలో ఎవ‌రు బ‌ల‌ప‌రుస్తారు? అనే ప్రశ్న త‌ర‌మీదికి వ‌చ్చింది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయ‌కులు పార్టీ మారిన నియోజ‌క‌వ‌ర్గాల్లోను, ప్రస్తుతం పార్టీ ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గాల్లోను కూడా నాయ‌క‌త్వాన్ని మార్చేందుకు పెద్ద వ్యూహ‌మే అమ‌లు చేయ‌నున్నారు.

అనేక నియోజకవర్గాల్లో….

ప్రధానంగా రాష్ట్రంలో రెండో పెద్ద జిల్లాగా ఉన్న రాష్ట్ర రాజ‌ధాని న‌గ‌రం గుంటూరులో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఘోరంగా దెబ్బతింది. ఖ‌చ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతార‌ని భావించిన నాయ‌కులు కూడా చ‌తికిల ప‌డ్డారు. దీంతో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మార్పులు చేర్పులు చేపట్టాల‌ని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం బాప‌ట్ల, స‌త్తెన‌ప‌ల్లి, మాచ‌ర్ల, గుంటూరు ఈస్ట్‌, న‌ర‌స‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు చేయాల‌ని నిర్ణయించిన‌ట్టు తెలిసింది. తెలుగుదేశం పార్టీని బ‌లోపేతం చేయ‌డం, త్వర‌లోనే జ‌ర‌గ‌నున్న స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీకి భారీ సంఖ్యలో సీట్లను సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్రబాబు వ్యూహ్యాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బాప‌ట్ల విష‌యానికి వ‌స్తే.. ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అన్నం స‌తీష్ ప్రభాక‌ర్ త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి, పార్టీ ప్రాథ‌మిక స‌భ్యత్వానికి కూడా రాజీనామా చేసి బీజేపీకి జై కొట్టారు.

కోడెల కుటుంబాన్ని పక్కన పెట్టి….

దీంతో బాప‌ట్లలో పార్టీ ఇంచార్జ్ స్థానం ఖాళీ అయింది. దీనిపై దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కృషి చేసిన వేగేశ‌న పౌండేష‌న్ స్థాప‌కుడు వేగేశ‌న న‌రేంద్ర వ‌ర్మకు చంద్రబాబు అవ‌కాశం ఇవ్వనున్నారు. ఈయ‌న ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్ కోసం ఎంతో ప్రయ‌త్నించారు. అయితే, సీనియ‌ర్ అయిన అన్నంకు బాబు టికెట్ కేటాయించారు. ఇక‌, స‌త్తెన‌ప‌ల్లిలో మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద్‌రావు ఘోరంగా ఓడిపోయారు. పైగా ఈయ‌న కుటుంబపై తీవ్రమైన ఆరోప‌ణ‌లు రావ‌డం, ప‌దుల సంఖ్యలో కోడెల కూమారుడు, కుమార్తెపై కేసులు న‌మోద‌య్యాయి. దీంతో స‌త్తెన‌ప‌ల్లిలో కోడెల కుటుంబాన్ని ప‌క్కన‌పెట్టి.. ఇక్కడ సీనియ‌ర్ రాజ‌కీయ దిగ్గజం రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడు రాయ‌పాటి రంగారావుకు తెలుగుదేశం ప‌గ్గాలు అప్పగించాల‌ని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. రంగారావు ఈ ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి లేదా జిల్లాలో ఎక్కడ నుంచి అయినా అసెంబ్లీ సీటు ఆశించారు.

నరసరావుపేటలోనూ…..

అదే విధంగా గుంటూరు తూర్పులో కూడా ఇంచార్జ్‌ను నియ‌మించాల‌ని నిర్ణయించారు. మ‌హ‌మ్మద్ న‌జీర్‌ను ఇక్కడ ఇంచార్జ్‌గా నియ‌మించి పార్టీ బాధ్యత‌లు అప్పగించ‌నున్నారు. ఇక‌, మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌స‌రాపుపేట ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన చ‌ద‌ల‌వాడ అర‌వింద‌బాబును నియ‌మించాల‌ని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. వీరితో ఇప్పటికే చంద్రబాబు ఒక సారి భేటీ అయ్యార‌ని, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్లడంపై ద‌శ‌-దిశ నిర్ధేశం చేశార‌ని స‌మాచారం. అత్యంత కీల‌క‌మైన ఈ స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీని ముందుకు న‌డిపించే బాధ్యత‌ను ముఖ్యంగా గుంటూరు వంటి రాజధాని న‌గ‌రంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత‌ను కూడా వీరికి అప్పగించాల‌ని నిర్ణయించారు.

త్రీమెన్ కమిటీతో……

ఇక తెలుగుదేశం పార్టీ వ‌రుస‌గా ఐదోసారి కూడా ఓడిపోయిన మాచ‌ర్లలో ఎన్నిక‌ల్లో ఓడిన అన్నపురెడ్డి అంజిరెడ్డి తిరిగి హైద‌రాబాద్ వెళ్లిపోవ‌డంతో ఇక్కడ పార్టీ ప‌టిష్టత కోసం త్రీమెన్ క‌మిటి వేసే ఆలోచ‌న‌లో బాబు ఉన్నార‌ట‌. ఈ మార్పుల‌కు సంబంధించిన అధికారిక ఆదేశాలు త్వర‌లోనే రానున్నాయ‌ని స‌మాచారం మ‌రోప‌క్క, అనంత‌పురంలో ఖాళీ అయిన ధ‌ర్మవ‌రం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యతలను ప‌రిటాల కుటుంబానికే చంద్రబాబు అప్పగించారు. దీనిపైనా అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది.

Tags:    

Similar News