మూడు చుట్టూ టీడీపీ మూడ్

మూడు అంకె మీద ఇపుడు తెలుగుదేశం పార్టీకి మోజు పెరిగిపోయింది. అయిదు అంకె అంటే బొత్తిగా నచ్చడమేలేదు. మూడ్ బాగుండాలంటే మూడు నంబర్నే పదే పదే తలచుకోమని [more]

Update: 2019-09-06 00:30 GMT

మూడు అంకె మీద ఇపుడు తెలుగుదేశం పార్టీకి మోజు పెరిగిపోయింది. అయిదు అంకె అంటే బొత్తిగా నచ్చడమేలేదు. మూడ్ బాగుండాలంటే మూడు నంబర్నే పదే పదే తలచుకోమని చంద్రబాబు కూడా తమ్ముళ్లకు చెబుతున్నారట. ఇంతకీ ఆ మూడు కధేంటి అంటే చాలానే ఉందంటున్నారు. మూడు నెలల జగన్ పాలన మీద తమ్ముళ్ళు అంతా ఒక్కటే వాయిస్ వినిపిస్తున్నారు. ప్రపంచ చరిత్రను వల్లిస్తున్నారు. మూడు నెలల్లో ఇంత దారుణంగా జనంలో వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏదీ లేదని, అది జగన్ ఒక్కడికే సాధ్యమని, వరల్డ్ రికార్డ్ జగన్ బద్దలుకొట్టరని కూడా సంబరపడుతున్నారు. ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే తెలుగుదేశం పార్టీని జనం ఎన్నుకుంటారని సీనియర్ నేతలంతా గొంతు చించుకుంటున్నారు. కానీ ఎన్నికలు అయిదేళ్లకు మాత్రమే వస్తాయి కదా. అందుకే మళ్ళీ మూడు దగ్గరే టీడీపీ తమ్ముళ్లు ఆగిపోతున్నారు.

మూడేళ్ళే గడువు….

మళ్లీ మేమే అధికారంలోకి వచ్చేస్తున్నాం. ఈ బలమైన టీడీపీ గొంతు వింటే ఇపుడు ఆశ్చర్యపోవవడం తమ్ముళ్ల వంతు అవుతోంది. ఎందుకంటే చంద్రబాబే అంత ధైర్యంగా చెప్పడంలేదు. కానీ తమ్ముళ్లు మాత్రం మూడు పాట పాడుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే మరో మూడేళ్ళలో ఎన్నికలు వస్తున్నాయి. నూటికి నూరు శాతం మాదే అధికారం అని గట్టిగా చెప్పుకొచ్చారు. పక్కన జూనియర్ చంద్రబాబును ఉంచుకుని మరీ మూడేళ్ళు ఆగండి మా తడాఖా చూపిస్తామని పోలీసులకు తెగ వార్నింగులు ఇస్తున్నారు. అదేంటి అయిదేళ్లకు కదా ఎన్నికలు, మూడేళ్ళ కధేంటి అని అంతా అనుకున్నా చంద్రబాబుకు, తమ్ముళ్ళకు మూడ్ మార్చే మూడు నంబర్ కధలు చాలానే ఉన్నాయిపుడు.

2022 కోసం వెయింటింగ్ ….

ఏపీలో ఎన్నికలు ఎపుడు జరగాలి అంటే 2024 అని ఠక్కున చెబుతారంతా. కానీ టీడీపీ తమ్ముళ్ళను అడిగితే మాత్రం 2022 అంటున్నారు. ఎందుకంటే మోడీ జమిలి ఎన్నికలు జరిపిస్తారట. అలా తమకు రెండేళ్ల ముందుగానే అధికారం, అందలం దక్కుతాయని తెగ ఆశపడిపోతున్నారు. మోడీ కూడా అప్పటికి అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అవుతుంది. ఆయన దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీకి ఎన్నికలు పెడతారని తమ్ముళ్ళు సంబరపడిపోతున్నారు.

మూడ్ మారడం ఖాయం …

నిజమే వారికి ఆ ఆనందం అలాగే ఉండాలని కాసేపు అనుకున్నా జమిలి ఎన్నికలు ఈ దేశంలో జరుగుతాయా. దానికి అవకాశాలు ఎంతమేర ఉన్నాయని తర్కించుకుంటే మాత్రం గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఈ దేశంలో ఇపుడు ఆర్ధిక మాంద్యం పట్టి పీడిస్తోంది. వచ్చే ఏడాది నుంచి అది ముదిరి కరాళ నృత్యం చేస్తుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. దాని ప్రభావం దారుణంగా జన జీవనంపై ఉంటుంది. అలా కనుక చూసుకుంటే మరో నాలుగేళ్లకు కానీ ఈ దేశం మళ్ళీ ఓ గాడిలో పడదు, ఆ సమయానికి 2024 ఎన్నికలు వస్తాయి. అలా కాదని 2022 లో ఎన్నికలకు వెళ్తే మోడీకే పెద్ద దెబ్బ పడుతుంది. మరి ఇవన్నీ తమ్ముళ్ళు వూహిస్తున్నారా. ఏదో ఎపుడో మోడీ అన్నారని, అనుకుంటున్నారని ఊహించుకుని అపుడే 2022 కి వెళ్ళిపోయారు. మోడీ మూడు కాదని అంటే మాత్రం తమ్ముళ్లకు మూడ్ పాడైపోవడం ఖాయం.

Tags:    

Similar News