ట్రెండ్ సెట్టర్ మీరే కదా…?

తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ నే ఇప్పుడు నేతలు తమ ఫార్ములా గా మార్చేసుకున్నారు. ఏ పార్టీ అయితే మాకేంటి అవకాశం, అవసరాన్ని బట్టి వ్యవహారం [more]

Update: 2019-08-21 03:30 GMT

తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ నే ఇప్పుడు నేతలు తమ ఫార్ములా గా మార్చేసుకున్నారు. ఏ పార్టీ అయితే మాకేంటి అవకాశం, అవసరాన్ని బట్టి వ్యవహారం సాగించాలి. అధికార పార్టీ ల తలుపులు తట్టి లోపలకు సేఫ్టీగా వెళ్లాలన్న ధోరణి తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయింది. ఈ ధోరణి ఇప్పుడు టిడిపి నే ఆందోళనకు గురిచేస్తుంది. ఆపరేషన్ ఆకర్ష్ కి కమలదళం పెద్ద ఎత్తునే తెరతీసింది. ఈ ఆకర్ష్ లో ఇప్పుడు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అంతా క్యూ కట్టేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, టిడిపి, జనసేన పార్టీలు బాధితులుగా మారిపోయారు.

టిడిపి నే ఆదర్శంగా ….

రాజకీయ అవసరాలకు గతంలో టిడిపి అధినేత చంద్రబాబు చేసిన రాజకీయాలు అన్ని ఇన్ని కావు. కామ్రేడ్ లతో గతంలో కలిసిన బాబు వాజ్ పేయి గాలి గమనించి ఎర్రజెండా వదిలి కాషాయ కండువాను సైకిల్ కి కప్పేశారు. ఆ తరువాత ఆ పార్టీ అవసరం లేదనుకుని 2004 లో తమ ప్రభుత్వ లోపాలు అన్ని బిజెపి పై తోసి స్వతంత్రంగా రణగంలోకి దిగి దెబ్బయిపోయారు. ఆ తరువాత 2009 లో కెసిఆర్ తో చేతులు కలిపి మహాకూటమి టైటిల్ తో జనంలోకి వెళ్ళి ఆ ఫార్ములా బెడిసి కొట్టడంతో వైఎస్ మరణం తరువాత తన బద్ధ శత్రువు కాంగ్రెస్ కి లోపాయికారి మద్దతిచ్చి వైఎస్ జగన్ సిఎం కాకుండా చేయడానికి, ఆయనపై కేసుల నమోదుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వెన్ను దన్నుగా నిలిచారు చంద్రబాబు. ఇక ఆ తరువాత 2014 లో మోడీ గాలి గమనించారు పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ను క్యాచ్ చేశారు. ఇద్దరితో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చేశారు.

మరోసారి బిజెపితో ఆడుకుని …

ఈక్వేషన్స్ ఫలించి పవర్ లోకి వచ్చిన చంద్రబాబు వారి అవసరం తీరాకా ఇద్దరిని దూరంపెట్టి 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళి మళ్ళీ ఓటమి ని ఘోరంగా చవిచూశారు. ఆ క్రమంలోనే తన తప్పులు మోడీ సర్కార్ పై నెట్టేందుకు ఎన్డీయే లో చివరిదశలో బయటకు వచ్చి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పై పోరాటానికి పిలుపునిచ్చారు చంద్రబాబు. అందుకోసం ఆయన తమపార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో చేతులు కలిపేశారు. ఎపి ప్రజల మూడ్ గమనించి తెలంగాణ లో కలిసి వెళ్లి సొంత రాష్ట్రంలో ఆ పార్టీని దూరం పెట్టి భూమిలో మరింతగా హస్తాన్ని పాతిపెట్టేశారు చంద్రబాబు. అయితే తాను అనుసరించిన ట్రెండ్ నే నేడు తమ్ముళ్లు అనుసరిస్తుండటంతో ఒకరకంగా చంద్రబాబు అవాక్కవుతూ నిస్సహాయంగా చూస్తున్నారు.

ఇప్పుడు ఆ పార్టీ నేతలు అదే స్టైల్ …

చంద్రబాబు తరహా రాజకీయమే నేటి తరానికి కరెక్ట్ అనే రీతిలో తమ వ్యాపార అవసరాలకు రాజకీయాల్లోకి వస్తున్న వారు డిసైడ్ అయిపోయారు. నెగ్గినా ఓడినా అధికారంలో వుండే పార్టీలకు జై కొడితే తమ కు రక్షణ లభిస్తుంది అన్న ఆలోచన బాగా వ్యాప్తి చెందుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు పార్టీలు మారుతున్న వారంతా ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. జనం ఏమనుకుంటే మాకేమిటి ఒకే పార్టీలో జీవితకాలం ఉండి పీకేది ఏముందన్న ధోరణి ప్రబలి పోయింది. నేతల ఆలోచన విధానానికి తగిన విధంగానే అధికార పార్టీలోకి వచ్చేవారికి సొంత పార్టీని నమ్ముకుని పల్లకీలు మోసిన వారికన్నా ఎక్కువ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముందే తమ పొజిషన్ పై క్లారిటీ తీసుకున్నాకే తీర్ధం పుచ్చుకుని నేతలు దూకేస్తున్నారు. ఇన్ స్టెంట్ పాలిటిక్స్ నేటి నేతలకు శ్రీరామ రక్షగా సాగుతున్న ఈ ట్రెండ్ ఎప్పటికి మారుతుందో కాలమే చెప్పాలి.

Tags:    

Similar News