ఇక ఉండలేమంటున్నారే
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఘోరమైన ఓటమి పరాజయంతో కుంగి పోతున్న టీడీపీలో నాయకులు ఉంటారో? జంప్ చేస్తారో?తెలియని ఓ సందిగ్ధమైన వాతావరణం [more]
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఘోరమైన ఓటమి పరాజయంతో కుంగి పోతున్న టీడీపీలో నాయకులు ఉంటారో? జంప్ చేస్తారో?తెలియని ఓ సందిగ్ధమైన వాతావరణం [more]
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఘోరమైన ఓటమి పరాజయంతో కుంగి పోతున్న టీడీపీలో నాయకులు ఉంటారో? జంప్ చేస్తారో?తెలియని ఓ సందిగ్ధమైన వాతావరణం నెలకొంది. ప్రధానంగా విశాఖను రాజధానిగా మార్చేందుకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తీవ్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇక్కడి టీడీపీ నాయకులు వైసీపీలోకి జంప్ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీరిలో కీలకమైన నాయకులు ఉండడంతో పార్టీ నుంచి వీరు జంప్ చేస్తే కనుక ఇక, పార్టీ ఉనికికే ప్రమాదం సంభవించే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు.
బాబు ఫోకస్ అంతా….
ప్రస్తుతం టీడీపీ అధినేత ఫోకస్ అంతా కూడా అమరావతిపైనే ఉంది. దీనిని రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నారు. అదే సమయంలో వైజాగ్ విషయంలో మాత్రం ఆయన తటస్థంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాన్ని విశాఖ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖకు రాజధానిని ఇస్తుంటే.. చంద్రబాబు అడ్డు తగులుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో ఇక్కడి ప్రజలు టీడీపీపై విముఖత పెంచుకుంటే తమ పరిస్థితి ఏంటని ఇక్కడి తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన నాయకుడు దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వైసీపీ జెండా ఊపితే…..
టీడీపీ సీనియర్ నాయకుడు పల్లా శ్రీనివాస్ గాజువాకలో ఓటమి తర్వాత వైసీపీ వైపు చూస్తున్నారు. యాదవ సామాజికవర్గానికి చెందిన పల్లాపై ఆ సామాజికవర్గానికి చెందిన నేతల నుంచి పార్టీ మారాలని ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. ఇటీవలే అదే వర్గానికి చెందిన సీనియర్ నేత బీదా మస్తాన్‌రావు పార్టీ మారడంతో పల్లా కూడా వైసీపీ వైపే చూస్తున్నట్టు టాక్. మాజీ మంత్రి, ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కూడా వైసీపీ పిలిస్తే వెంటనే చేరిపోయేందుకు తట్టా బుట్టా రెడీ చేసు కున్నారు. ఆయన వైసీపీ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా ? అని వెయిట్ చేస్తున్నారు.
మిగిలేది ఆయన ఒక్కరేనా?
అదేవిధంగా పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కూడా వైసీపీ ఆఫర్ ఇస్తే వెళ్లేందుకు రెడీ అవుతున్నా రు. ముఖ్యంగా పార్టీ మారే తమ్ముళ్లలో పల్లా, గణబాబుల పేర్లు భారీ ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు కూడా ఈ దారిలోనే ఉన్నారు. విశాఖ నగర మాజీ అధ్యక్షుడు రెహమాన్ ఇటీవలే పార్టీ మారి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన వారిలో దక్షిణ ఎమ్మెల్యే, నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ మాత్రమే పార్టీలో ఉంటారని ప్రచారం జరుతోంది. అదేవిధంగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడికి పార్టీలో కొనసాగడం ఎలాగూ తప్పదు.
ఏ క్షణంలోనైనా….
ఇక ఏజెన్సీలో పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ వైపు చూస్తున్నా అటు వైపు నుంచి ఆమెకు గ్రీన్‌సిగ్నల్ వచ్చే పరిస్థితి లేదు. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ చుట్టూ అనేక అవినీతి, అక్రమ ఆస్తుల ఆరోపణలు ఉన్నాయి. ఆయన సైతం ఛాన్స్ కోసం వెయిటింగ్‌లోనే ఉన్నారు. వెలగపూడి, గణేష్‌కుమార్ మినహా మిగిలిన కీలక నాయకులు మాత్రం ఏ క్షణంలో అయినా జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. మరి వీరిని కాపాడుకునేందుకు చంద్రబాబు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో చూడాలి.