టీడీపీ మైండ్ గేమ్…వైసీపీకి ట్రాప్ ?

ప్రజాస్వామ్యంలో ప్రజలకే బుర్రలు ఉండవని కచ్చితమైన లెక్కలు వేసుకుని మరీ తమ రాజకీయ రధాన్ని అధినేతలు పరుగులు పెట్టిస్తారు. తాము ఏమి చెబితే మంద జనం గుడ్డినా [more]

Update: 2020-10-24 08:00 GMT

ప్రజాస్వామ్యంలో ప్రజలకే బుర్రలు ఉండవని కచ్చితమైన లెక్కలు వేసుకుని మరీ తమ రాజకీయ రధాన్ని అధినేతలు పరుగులు పెట్టిస్తారు. తాము ఏమి చెబితే మంద జనం గుడ్డినా నమ్ముతుందని కూడా భ్రమిస్తారు. అలా ఊహల లోకంలో తిరుగుతూనే ఎన్నికల వేళ తాయిలాలు ఇచ్చేసి ఓట్లు పట్టేయాలనుకుంటారు. మరో అయిదేళ్లకు పవర్ రెన్యూవల్ చేయించు కోవాలనుకుంటారు. సరే ఇదంతా గతంలో సాగింది. సోషల్ మీడియా కాలంలో చెల్లుతుందా అంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమి సాక్షిగా ఎవరి పప్పులూ ఉడకవని అదే జనం తేల్చేశారు. అయినా సరే పాతకాలం రాజకీయాలకు అలవాటు పడిన దేహాలకు ఆ దాహాలు తీరడంలేదు.

పని అయిపోయిందిట …..

జగన్ సర్కార్ మీద ఇపుడు టీడీపీ చేస్తున్న కామెంట్స్ ఇవి. ఏపేలో జగన్ సర్కార్ పని అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని తమ్ముళ్ళు అందరూ కోరస్ గా అదే మాట మాట్లాడుతున్నారు. నిజానికి 151 సీట్ల మెజారిటీతో పాటు విపక్ష ఎమ్మెల్యేల మద్దతు కూడా పుష్కలంగా కలిగిన జగన్ సర్కార్ పని ఎందుకు అయిపోతుంది. అంటే సీబీఐ రోజు వారీ విచారణల వల్ల అతి త్వరలోనే జగన్ జైలుకు వెళ్తాడట. అందువల్ల వైసీపీ సర్కార్ ఇక ఇంటికే అంటున్నారు తమ్ముళ్ళు. చంద్రబాబు అయితే ఏకంగా మరో ముప్పయ్యేళ్ళ పాటు జగన్ జైలు జీవితం అంటూ శిక్షను కూడా ఖరార్ చేసేశాడు. జగన్ మీద మరి ఎంత కసి మీద ఉన్నా ఇలాగేనా మాట్లాడేది అన్న మాట కూడా వినిపిస్తోంది. నిజానికి ఈ దేశంలో అంత సుదీర్ఘమైన శిక్షలు ఎవరికీ పడిన దాఖలాలు అయితే వర్తమాన భారతంలో లేవు. అందునా రాజకీయ జీవుల మీద అసలు లేవు.

కసి పుట్టించాలనే …….

ఎలాగోలా వైసీపీలో ముసలం పుట్టించాలి. వైసీపీ ఎమ్మెల్యేలలో భయం కలిగించాలి. తామున్నది సేఫ్ జోన్ కాదని, డేంజర్ లో పడిపోతున్నామని వారిలో వారే కలవరపడాలి. అసలు కోర్టు వ్యవహారాలు ఎలా ఉన్నా కూడా వైసీపీలో అలజడి రేగి తుఫాన్ గా మారితే ఆ పార్టీలో అసలైన రాజకీయ సంక్షోభం వస్తుందని టీడీపీ అంచనా కడుతోంది. అపుడు తమ పని సులువు అవుతుందని కూడా భావిస్తోంది. మరి జనాలకే బుర్రలు లేవు అనుకుని రాజకీయం చేస్తున్న టీడీపీ నేతలు ఇపుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ మైండ్ ని ఉపయోగించరు అని ఎలా అనుకుంటోందో.

ఎవరికి తెలియదని……

జగన్ మీద సీబీఐ కేసులు ఉన్నాయన్న సంగతి ఏపీలోనే కాదు దేశం మొత్తం మీద అందరికీ తెలుసు. జగన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇంకా బాగా తెలుసు. అన్నీ తెలిసే జగన్ పార్టీలో ఉన్న వారికి ఇపుడు కొత్తగా భయం బెదురు ఎందుకు ఉంటాయన్నదే కదా ప్రశ్న. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళే సీన్ ఉంటే దానికి తగిన ఆల్టర్నేషన్ జగన్ రెడీ చేసి పెట్టుకోకుండా ఉంటాడా. ఆయనే ఏదో తోవ వైసీపీకి చూపిస్తాడు. అంతే తప్ప మధ్యలో టీడీపీకి చాన్స్ ఇచ్చేటంత సీన్ ఉండదు కదా. ఇవన్నీ ఎమ్మెల్యేలకు బాగా అవగాహన ఉంది. కానీ వారిలో కంగారు పుట్టించి ఇవాళో రేపో వైసీపీ సర్కార్ పుట్టె ముంచాలని టీడీపీ ఆడుతున్నా ఈ రాజకీయ డ్రామా పాతికేళ్ళ క్రితం నాటి చూసేసిన సినిమా అన్నది తమ్ముళ్ళకు తప్ప అందరికీ తెలుసు అంటున్నారు.

Tags:    

Similar News