కలసి రాదా? నష్టమేనా? టీడీపీలో అంతర్మధనం

స్థానిక సంస్థల ఎన్నిక ఆంధ్రప్రదేశ్ లో వాయిదా పడింది. కరోనా వైరస్ ఫలితంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆరు వారాల తర్వాత తిరిగి [more]

Update: 2020-03-16 08:00 GMT

స్థానిక సంస్థల ఎన్నిక ఆంధ్రప్రదేశ్ లో వాయిదా పడింది. కరోనా వైరస్ ఫలితంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆరు వారాల తర్వాత తిరిగి షెడ్యూల్ జారీ చేస్తామని చెప్పింది. ఏకగ్రీవమైనవి అలాగే ఉంటాయని పేర్కొంది. ఎన్నికలు జరగాల్సిన చోట మాత్రమే వాయిదా వేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. ఎన్నికలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ టీడీపీ నేతల్లో మాత్రం ఎన్నికల వాయిదా పట్ల భయం పట్టుకుంది.

తొలి దశలోనే డీలా…..

ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన నాటి నుంచే టీడీపీ కొంత డీలా పడింది. అధికార వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని, తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, కొన్నిచోట్ల నామినేషన్ పత్రాలను చించివేశారని, మరికొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల చేత బలవంతంగా విత్ డ్రా చేయించారని ఆరోపణలు చేస్తుంది. రాష్ట్ర గవర్నర్, డీజీపీ, ఎన్నికల కమిషన్ లకు ప్రతిరోజూ టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాస్తూనే ఉన్నారు. స్వయంగా చంద్రబాబు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఎన్ని ఫిర్యాదులు చేసినా…..

ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలు దౌర్యన్యాలకు పాల్పడినట్లు వీడియో ఆధారంగా టీడీపీ నేతలు బయటపెట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరు, శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాలతో పాటు, గుంటూరు జిల్లా మాచర్ల, తెనాలి, అనంతపురం జిల్లాలో తాడిపత్రి, రాయదుర్గం నియోజకవర్గంలో జరిగిన దౌర్యన్యాలపై లిఖితపూర్వకంగా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కనీసం కుల ధృవీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికేట్లు అధికారులు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. ఈ స్థానాల్లో రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

కాపాడుకునేదెలా?

అయితే ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడటంతో అభ్యర్థులను కాపాడుకోవడం టీడీపీకి కత్తిమీద సామే అవుతుందంటున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న తమ పార్టీ అభ్యర్థుతలను అధికార పార్టీ భయభ్రాంతులకు గురి చేసి వారిని పోటీ నుంచి తప్పిస్తుందేమోనన్న ఆందోళన టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. డబ్బులకు కూడా ప్రలోభపెట్టే అవకాశముందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే జరిగితే ఎన్నికల వాయిదా వైసీపీకే లాభమని కొందరు టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. వీరందరినీ కాపాడుకోవడం కష్టమేనని కొందరు నేరుగా కేంద్ర పార్టీ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పినట్లు తెలసింది. అయితే కొన్ని చోట్ల రీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం, అధికారులను బదిలీ చేయడం టీడీపీకి కొంత ఊరటనిచ్చే అంశమే.

Tags:    

Similar News