స్ట్రాటజీ మార్చారు

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు ఎప్పుడు పార్టీని వీడి వెళతారో తెలియని పరిస్థితి. మొన్న వల్లభనేని వంశీ నిన్న మద్దాలి గిరిలు పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఇదే ఆలోచనలో [more]

Update: 2020-01-02 08:00 GMT

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు ఎప్పుడు పార్టీని వీడి వెళతారో తెలియని పరిస్థితి. మొన్న వల్లభనేని వంశీ నిన్న మద్దాలి గిరిలు పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఇదే ఆలోచనలో మరికొంత మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు టీడీపీ అధినాయకత్వం పసిగట్టింది. అందుకే ఇక బతిమాలాల్సిన పనిలేదని టీడీపీ అధినాయకత్వం భావిస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోయినా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని, అది సానుభూతి కొని తెస్తుందని చంద్రబాబు నమ్ముతున్నారు. అందుకే గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరి జగన ను కలసినా పెద్దగా రాద్ధాంతం చేయడానికి టీడీపీ ఇష్టపడటం లేదు.

వంశీ విషయంలో….

వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్ ను కలసి వచ్చిన తర్వాత పార్టీపైనా, అధినాయకత్వంపైనా విమర్శలు చేయడంతో ఆయనపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. వంశీని బతిమాలడానికి రాయబారాలు కూడా నడిపారు. చంద్రబాబు సయితం లేఖలు రాశారు. పై స్థాయి నుంచి కిందిస్థాయి వరకూ వల్లభనేని వంశీపై విరుచుకుపడ్డారు. చివరకు చంద్రబాబు కూడా వల్లభనేని వంశీని భయపెట్టి లొంగదీసుకున్నారని ప్రతి సభలోనూ వెల్లడించారు. అయితే వల్లభనేని వంశీని శాసనసభలో స్వతంత్ర సభ్యుడిగా ప్రకటించడంతో ఇక టీడీపీ ఆయనపై ఎటువంటి విమర్శలకు దిగడం లేదు.

బుజ్జగించే ప్రయత్నం…..

ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి జగన్ ను కలసి, పార్టీపై విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోనట్లే ఉంది. మద్దాలి గిరిపై ఎదురు దాడి దిగేందుకు ఏ టీడీపీ నేత ముందుకు రాలేదు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. ఇది పార్టీ అనుసరిస్తున్న వ్యూహమేనని చెబుతున్నారు. ఒక మాట అని నాలుగు మాటలు అనిపించుకోవడం కంటే పార్టీకి సానుభూతి ప్రజల్లో రావాలంటే మాట్లాడకుండా ఉండటమే మంచిదని టీడీపీ అధినాయకత్వం భావిస్తుంది. అందుకే వల్లభనేని వంశీ విషయంలో చూపించిన దూకుడు మద్దాలిగిరి విషయంలో చూపలేదు.

వెంటనే నియామకం….

ఇక వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసినా ఇంతవరకూ గన్న వరం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ ఛార్జిని నియమించలేదు. కానీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మద్దాలి గిరి పార్టీకి రాజీనామా చేయకున్నా వెంటనే టీడీపీ ఇన్ ఛార్జి ని నియమించడం గమనార్హం. పశ్చిమ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కోవెలమూడి రవీంద్రను వెంటనే టీడీపీ అధిష్టానం నియమించింది. మద్దాలిగిరిపై సస్పెన్షన్ వేటు వేయకుండానే ఇన్ ఛార్జిని నియమించి కొత్త ఎత్తుగడకు టీడీపీ ప్రయత్నించింది. భవిష్యత్తులో పార్టీని వీడే వారికి కూడా ఒక సంకేతం ఇవ్వాలనే వెంటనే ఇన్ ఛార్జిని నియమించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద టీడీపీలో బతిమాలి, బుజ్జగించి ఉంచుకోవడానికి ఇష్టపడే పరిస్థితి కన్పించడం లేదు.

Tags:    

Similar News