దోస్తీ బలపడుతున్నట్లుందే

ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో బలపడటానికి విపక్షాల నుంచి అందరిని ఆకర్షిస్తూ వైసిపి పై విమర్శల దాడికి దిగుతున్న బిజెపి తిరిగి తెలుగుదేశం తో దోస్తీకి సిద్ధం [more]

Update: 2019-08-06 11:00 GMT

ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో బలపడటానికి విపక్షాల నుంచి అందరిని ఆకర్షిస్తూ వైసిపి పై విమర్శల దాడికి దిగుతున్న బిజెపి తిరిగి తెలుగుదేశం తో దోస్తీకి సిద్ధం అవుతుందా ? లేక టిడిపి నే కమలం గూట్లో ఉంటేనే తమకు సేఫ్టీ అని పావులు కదుపుతోందా ? ఈ రెండు అంశాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయంగా మారాయి. ఈ రెండు పార్టీల చర్యలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఒకరి అవసరం మరొకరికి రాబోయే ఎన్నికల్లో ఉందనే లెక్కలతోనే ఇరువురు మరోసారి యుగళగీతం పాడేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. అందుకే ఇటీవల అమరావతి నుంచి పోలవరం వరకు ఎలాంటి అవినీతి లేదు పొమ్మంటూ కేంద్రంలోని బిజెపి సర్కార్ పార్లమెంట్ సాక్షిగా సర్టిఫికెట్లు ఇవ్వడం వెనుక చాలా జరుగుతుందని అంటున్నారు. ఇదే మీఏపీ బిజెపికి ఏ మాత్రం అర్ధం కాకుండానే నడుస్తున్నాయని తెలుస్తుంది.

ఇద్దరు నష్టపోయారుగా …

ప్రత్యేక హోదా పేరు చెప్పి రాజకీయ లబ్ది కోసం టిడిపి ఎన్డీయేనుంచి బయటకు వచ్చిన వ్యూహం మొన్నటి ఎన్నికల్లో దెబ్బకొట్టేసింది. వైసిపి అధికారంలోకి రాకూడదనే పక్కా స్కెచ్ కాస్తా తమ శత్రువుకి చక్కగా ఉపయోగపడటం తో బీజేపీ తో తిరిగి కలిసే ఆలోచనలో టిడిపి పడినట్లు తెలుస్తుంది. అధికారానికి దూరం కావడంతో టిడిపి లోని ముఖ్య నేతలంతా బిజెపి గూటికి ఒక్కోరొక్కరుగా చేరిపోతున్నారు. ఈ పరిణామాలు టిడిపి లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరో పక్క తెలుగు రాష్ట్రాల్లోపార్టీని కిందిస్థాయిని పటిష్టం చేసుకునేందుకు బిజెపి కూడా చేయని ప్రయత్నం లేదన్నట్లు కార్యాచరణలో దూసుకుపోతుంది. దొరికినవారిని దొరికినట్లు తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. రాజ్యసభ సభ్యులు నలుగురు తమ పార్టీనుంచి బిజెపిలోకి చేరిపోయిన తరువాత టిడిపి ఆత్మరక్షణలో పడింది.

వలసలకు చెక్ తో పాటు ….

దీనికి చెక్ పెట్టాలంటే ఎన్డీయే లో చేరిపోవడమే మంచిదని తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి పనిచేస్తే ఒక పక్క జగన్ మరోపక్క కెసిఆర్ లకు పక్కలో బల్లెంలా మారవచ్చని టిడిపి అంచనా వేస్తుంది. కాంగ్రెస్ కలిసి వస్తుందని అనుకుంటే రెండుచోట్లా ఆ పార్టీ తో నష్టమే జరిగిందని గుర్తించిన టిడిపి తెలంగాణాలో తమ బలమైన క్యాడర్ ను ఎరచూపి కమలాన్ని ఆకర్షించాలని చూస్తుంది. తెలంగాణాలో తక్కువ సీట్లు ఎపి లో ఎక్కువ సీట్లలో పోటీ చేసేలా ప్రతిపాదనలు ముందు పెట్టాలని టిడిపిలో చర్చ నడుస్తుంది. ఒక పక్క సిబిఐ మరోపక్క ఈడీ, ఆదాయపుపన్నుశాఖ దాడులతో మోడీ సర్కార్ ఉక్కిరి బిక్కిరి చేస్తుండటంతో పాటు చంద్రబాబు జైలుకు పోతారంటూ ఇప్పటికే బెదిరింపులకు దిగుతుంది. దాంతో ఎన్డీయే లో తిరిగి చేరడం ద్వారా ఎపి తెలంగాణ లో పట్టు కొనసాగించవచ్చన్నది పసుపు దళం ఆలోచనగా ఉందంటున్నారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన సుజనాచౌదరి, సిఎం రమేష్ ల సహకారంతో ఈ ప్రక్రియ సజావుగా వెనుక నుంచి నడిపిస్తున్నట్లు హస్తినవర్గాల్లో సీరియస్ గానే ప్రచారం సాగుతుంది.

Tags:    

Similar News