ఈజీ కమ్.. ఈజీ గో

రాజ‌కీయాల‌కు సెంటిమెంటుకు మ‌ధ్య ఎంతో సంబంధం ఉంది. నేత‌లు ఏ విష‌యాన్నయినా.. సెంటి మెంట్‌గానే ఫీల‌వుతున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రతి విష‌యాన్నీ సెంటిమెంట్‌తో ముడి పెట్టి [more]

Update: 2019-08-27 03:30 GMT

రాజ‌కీయాల‌కు సెంటిమెంటుకు మ‌ధ్య ఎంతో సంబంధం ఉంది. నేత‌లు ఏ విష‌యాన్నయినా.. సెంటి మెంట్‌గానే ఫీల‌వుతున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రతి విష‌యాన్నీ సెంటిమెంట్‌తో ముడి పెట్టి ముందుకు సాగుతుంటారు. ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ అయితే, సెంటిమెంట్ రాజ‌కీయాల‌కే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఏ విష‌యాన్నయినా.. త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలో సక్సెస్ అవుతోంది. ఇదే క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ సెంటిమెంట్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. చాలా నియోజ క‌వ‌ర్గాల్లో సెంటిమెంట్ రాజ‌కీయాల‌ను ప్రోత్సహించింది.

వారసులను దించి….

ఈ క్రమంలోనే అమ‌లాపురం నుంచి దివంగ‌త స్పీక‌ర్ జీఎంసీ బాల‌యోగి కుమారుడిని, అర‌కు నుంచి దివంగ‌త స‌ర్వేశ్వరావు కుమారుడిని, రాప్తాడు నుంచి దివంగ‌త ప‌రిటాల ర‌వి కుమారుడిని రంగంలోకి దింపింది టీడీపీ. అదేస‌మ‌యంలో రాజ‌మండ్రి సిటీ నుంచి దివంగ‌త కింజ‌రాపు ఎర్రన్నాయుడు కుమార్తెను కూడా బ‌రిలో నిలిపింది. శ్రీకాళ‌హ‌స్తి నుంచి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి త‌న‌యుడు బొజ్జల సుధీర్‌రెడ్డి, న‌గ‌రి నుంచి దివంగ‌త నేత గాలి ముద్దుకృష్ణమ‌నాయుడు త‌న‌యుడు గాలి భానుప్రకాష్‌నాయుడు వీరంతా యువ తేజాలే.

సానుభూతితో అయినా….

ఈ యువ నేత‌ల‌కు ప్రచారంలో చంద్రబాబు సైతం సాయం చేశారు. ప్రచారానికి భారీ ఎత్తున నిధులు కూడా ఇచ్చారు. బారీ ఎత్తున ఖ‌ర్చు కూడా పెట్టారు. మొత్తానికి ఈ వ్యూహంతో సెంటిమెంట్ ర‌గిలి.. ప్రజ‌లు టీడీపీకి మ‌ద్దతు ప‌లుకుతార‌ని చంద్రబాబు బావించారు. అయితే, అనూహ్యంగా.. వీరిలో దివంగ‌త కింజ‌రాపు కుమార్తె ఆదిరెడ్డి భ‌వానీ మాత్రమే విజయం సాధించా రు. మిగిలిన వార‌సులు అంద‌రూ ఘోరంగా ప‌రాజ‌యం పాల‌య్యారు. నిజానికి దివంత‌గులైన నాయకుల చ‌రిష్మాను వినియోగించుకుని తాను ల‌బ్ధి పొందాల‌ని చంద్రబాబు భావించినా.. ఎందుకో ఇది వ‌ర్క వుట్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

స్వయంకృషి వల్లనే…..

ముఖ్యంగా బాల‌యోగి వంటి వివాద ర‌హిత నాయ‌కుడి కుమారుడిని కూడా ప్రజ‌లు తిర‌స్కరించ‌డం, ప‌ట్టప‌గ‌లు మావోయిస్టులు కాల్చిచంపిన కిడారి స‌ర్వేశ్వర‌రావు కుమారుడి వైపు కూడా ప్రజ‌లు మొగ్గు చూప‌క‌పోవ‌డం వంటి ప‌రిణామాల‌ను బ‌ట్టి సెంటిమెంటును న‌మ్ముకోవ‌డం వ‌ల్ల ఈ యువ నాయ‌కుల‌కు ప్రయోజ‌నం లేద‌నే విష‌యం స్పష్టంగా తెలుస్తోంది. మంచి పేరున్న గాలి త‌న‌యుడు కూడా రోజా చేతిలో ఓడిపోయాడు. ఇలా తండ్రుల తర్వాత సులువుగా రాజకీయాల్లోకి వచ్చిన ఈ నేతలు అంతే వేగంతో ఓటమిపాలయ్యారు. ఈ నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో అయినా స్వయంకృషిని న‌మ్ముకుని ప్రజ‌ల్లోకి వెళ్తేనే భ‌విత‌వ్యం ఉంటుంద‌నే విష‌యం టీడీపీ యువ నేతలుతెలుసుకుంటారో లేదో చూడాలి.

Tags:    

Similar News