రాజీ కుదిరిందా? రాజకీయం మొదలయిందా?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, బీజేపీల మధ్య బంధం మరింత గట్టిపడే సూచనలు కన్పిస్తున్నాయి, రెండు పార్టీల నేతల మధ్య కొంత పాజిటివ్ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్ర [more]

Update: 2020-04-21 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, బీజేపీల మధ్య బంధం మరింత గట్టిపడే సూచనలు కన్పిస్తున్నాయి, రెండు పార్టీల నేతల మధ్య కొంత పాజిటివ్ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేసిన తర్వాతనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నది వాస్తవం. గతం కంటే భిన్నంగా బీజేపీ, టీడీపీ నేతలు వ్యవహరిస్తుండటం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమైంది. ఇది భవిష్యత్ మైత్రికి దారితీసే అవకాశముందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫోన్ కాల్ తర్వాత…..

ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబుకు కరోనా సమయంలో ఫోన్ చేశారు. వీరద్దరి మధ్య ఎటువంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదు. కేవలం కరోనాపైనే కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. అయినా ఈ పరిణామం తెలుగుదేశం పార్టీలో జోష్ నింపిందనే చెప్పాలి. అంతేకాదు బీజేపీ నేతల్లోనూ సిగ్నల్స్ పాజిటివ్ గానే వెళ్లినట్లు కనపడుతుంది. ఇందుకు ఉదాహరణ చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే సోము వీర్రాజు లాంటి నేతలు ఆయన పట్ల సానుకూలంగా స్పందించడమే కారణం. చంద్రబాబుతో కరోనా విషయంలో చర్చించాలని సోము వీర్రాజు చేసిన కామెంట్స్ ను టీడీపీ నేతలు కూడా స్వాగతిస్తున్నారు.

సానుకూల వాతావరణం….

2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి బీజేపీ నేతలు టీడీపీని టార్గెట్ చేసుకున్నారు. ప్రధానంగా చంద్రబాబు తమకు మరోసారి థోకా ఇవ్వడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే జగన్ ప్రభుత్వం ఏర్పడటం, మూడు రాజధానుల అంశం బయటకు వచ్చిన తర్వాత జీవీఎల్ నరసింహారావు లాంటి నేతలు మినహాయించి మిగిలిన నేతలందరూ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. శాసనమండలి రద్దు అంశంలోనూ టీడీపీ వాయిస్ కు బీజేపీ నేతలు జత కలిశారు.

కేంద్ర నాయకత్వం మాత్రం….

టీడీపీతో పొత్తు కారణంగా 2014 ఎన్నికల్లో బీజేపీకి ఐదు అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలు దక్కాయి. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి నోటా కంటే ఓట్లు తక్కువ వచ్చాయి. వైసీపీ ఇతర పార్టీలను కలుపుకుని వెళ్లేందుకు అంగీకరించదు. చంద్రబాబు బీజేపీతో పొత్తుకు రెడీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా పవన్ కల్యాణ‌్, టీడీపీతో జత కలిస్తేనే కొన్ని స్థానాల్లోనైనా విజయం సాధించగలుగుతామన్నది బీజేపీ రాష్ట్ర నేతల ఆలోచనగా ఉంది. అందుకే రెండు పార్టీల మధ్య కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందంటున్నారు. అయితే కేంద్రం స్థాయిలో నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.

Tags:    

Similar News