ఇన్నాళ్లూ భ్రమల్లో ఉన్నామా….?

ఇప్పటి వరకూ తాము భ్రమించామా? తాము బలవంతులమని భావించామా? వేవ్ లేనిదే వ్యక్తిగతంగా ఎంత మంచి పేరున్నా గెలవడం కష్టమేనా? అవును… అన్ని పార్టీల్లో ఇదే చర్చ [more]

Update: 2019-08-04 12:30 GMT

ఇప్పటి వరకూ తాము భ్రమించామా? తాము బలవంతులమని భావించామా? వేవ్ లేనిదే వ్యక్తిగతంగా ఎంత మంచి పేరున్నా గెలవడం కష్టమేనా? అవును… అన్ని పార్టీల్లో ఇదే చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ తమ నియోజకవర్గాల్లో తిరుగులేదని భావించిన నేతలు సయితం మొన్నటి ఎన్నికల్లో ధమ్కీ తిన్నారు. ఎంత చేసినా… ఎంత కష్టపడినా ప్రయోజనం లేదని, చివరకు ప్రజల నాడిని బట్టే గెలుస్తామని వారు డిసైడ్ అయ్యారు. అందుకే నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు.

పేరున్న నేతలు సయితం…..

ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఈ తరహా నాయకులు కన్పిస్తున్నారు. ఇప్పుడు నియోజకవర్గాలను కూడా వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికల నాటికి చూసుకోవచ్చులే అన్న నిర్లిప్తతతో అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలున్నారు. అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ నేతలు, జిల్లా అభివృద్ధికి దశాబ్దాల కాలం నుంచి పాటుపడుతున్న వారు సయితం ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం జీర్ణించుకోలేకపోతున్నారు.

నియోజకవర్గాలకు దూరంగా….

అందుకే తెలుగుదేశం పార్టీ నేతల్లో నిర్లిప్తత నెలకొంది. ఎన్నికల సమయంలోనే నియోజకవర్గంలోకి వచ్చి గెలిచిన తమ ప్రత్యర్థులను చూసి వారు అవాక్కవుతున్నారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ ఇదే ఫీలింగ్ లో ఉన్నారు. ఆయన ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో అభివృద్ధి చేసినా అప్పుడే నియోజకవర్గంలోకి వచ్చిన బాలినేని శ్రీనివాసులురెడ్డి విజయం సాధించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు పోతుల రామారావు, బిసి జనార్థన్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, అఖిలప్రియ, ప్రభాకర్ చౌదరి లాంటి లీడర్లు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు.

వేవ్ ఎటు ఉంటే….

వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత వస్తే వచ్చే ఎన్నికలలో తాము గెలిచి తీరుతామని, జగన్ కు వేవ్ మళ్లీ వస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టపడినా గెలవలేమని వారికి వారు సర్ది చెప్పుకుంటున్నారు. అందుకే పార్టీ కార్యక్రమాలు చేపట్టాలన్నా వెనకంజ వేస్తున్నారు. కార్యకర్తలు పీక్కు తింటారేమోనన్న ఆందోళనతో వారు పార్టీ కార్యక్రమాలకు కూడా గుడ్ బై చెబుతున్నారు. ఎన్నికల నాటికి వచ్చి చేతులూపితే సరిపోతుందన్న ధీమాగా ఉన్నారు. తాము ఎంత కష్టపడినా, ప్రజల కోసం పనిచేసినా ఎన్నికల నాటికి వేవ్ లేకపోతే గెలవలేమన్న నిర్ణయానికి వచ్చారు.

Tags:    

Similar News