ఫైర్ బ్రాండ్లు ప‌క్కకు త‌ప్పుకొన్నట్టేనా… టీడీపీలో చ‌ర్చ

రాజ‌కీయాల్లో ఏ పార్టీకైనా.. కొంత మంది ఆలోచ‌నాత్మకంగా మాట్లాడేవారు.. గ‌ట్టిగా పార్టీ వాయిస్ వినిపించే వారు.. అదే స‌మ‌యంలో ప్రత్యర్థుల‌పై వ్యూహాత్మకంగా విరుచుకుప‌డే ఫైర్ బ్రాండ్లు.. చాలా [more]

Update: 2020-10-18 14:30 GMT

రాజ‌కీయాల్లో ఏ పార్టీకైనా.. కొంత మంది ఆలోచ‌నాత్మకంగా మాట్లాడేవారు.. గ‌ట్టిగా పార్టీ వాయిస్ వినిపించే వారు.. అదే స‌మ‌యంలో ప్రత్యర్థుల‌పై వ్యూహాత్మకంగా విరుచుకుప‌డే ఫైర్ బ్రాండ్లు.. చాలా అవ‌స‌రం. ఈ విష‌యంలో ఇప్పుడు వైసీపీలో ఉన్నంత మంది ఫైర్ బ్రాండ్ నాయ‌కులు టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన వంటి పార్టీల్లో ఎక్కడా క‌నిపించ‌డం లేదు. అయితే, ఈ విష‌యంలో టీడీపీ నిన్న మొన్నటి వ‌ర‌కు ఒకింత ఫ‌ర్వాలేదు.. అనుకునేవారు. దీనికి కార‌ణం.. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌, అనంత‌పురం మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి, విజ‌య‌వాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.. వంటివారు ఫైర్ బ్రాండ్లుగా ఉన్నారు.

బలమైన వాయిస్ ను…..

వీరితోపాటు.. ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, బీటెక్ ర‌వి, మ‌హిళా నేత‌ల్లో పంచుమ‌ర్తి అనురాధ‌, గిడ్డి ఈశ్వరి వంటివారు ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు పొందారు. వీరి కార‌ణంగా.. ఒక్కొక్కసారి కొన్ని వివాదాలు చుట్టుముట్టినా.. చాలా సార్లు పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించ‌డంలో వీరు స‌క్సెస్ అయ్యారు. నిజానికి ఇలా వ్యవ‌హ‌రించే ఫైర్ బ్రాండ్లకు పార్టీల్లో గుర్తింపు ల‌భించ‌డం ఖాయ‌మ‌నే మాట కూడా రాజ‌కీయాల్లో త‌ర‌చుగా వినిపిస్తూ ఉంటుంది. త‌మ బ‌ల‌మైన వాయిస్‌తో వారు మీడియాలో హైలెట్ అవ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ అవుతూ ఉంటారు.

ఎక్కడా చోటు లేకపోవడంతో……

టీడీపీలో ఉన్న ఈ ఫైర్ బ్రాండ్లు అంద‌రూ పార్టీపైనా పార్టీ అధినేత చంద్రబాబుపైనా మ‌ర‌క‌లు ప‌డ‌కుండా విమ‌ర్శలు కూడా రాకుండా వీరు కాచుకునేవారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పైన చెప్పుకున్న ఫైర్ బ్రాండ్లు ఏ రేంజ్‌లో విరుచుకు ప‌డ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీడియాలోనూ, చ‌ర్చల్లోనూ ఎక్కడ చూసినా వీరే ఉండేవారు. అయితే, ఇలాంటి ఫైర్ బ్రాండ్లకు ఇప్పుడు పార్టీలో గుర్తింపు ల‌భించ‌లేద‌ని అంటున్నారు. మ‌రీ ముఖ్యంగా చంద్రబాబు తాజాగా నియ‌మించిన పార్లమెంట‌రీ జిల్లా క‌మిటీల్లోనూ మ‌హిళా క‌మిటీల్లోనూ.. కొత్తగా ఏర్పాటు చేసిన‌ రెండు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల సంయుక్త క‌మిటీల్లోనూ చోటు ల‌భించ‌లేదు.

ఉపయోగం లేదని అనుకున్నారా?

మ‌రి చంద్రబాబు వీరిని ఉద్దేశ పూర్వకంగానే ప‌క్కన పెట్టారా? లేక తెర‌వెనుక ఏమైనా జ‌రిగిందా? అనే చ‌ర్చ త‌మ్ముళ్ల మ‌ధ్య విస్తృతంగా జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. పోనీ.. ఇప్పటికే వీరిలో కొంద‌రిని ప‌ద‌వులు ఉన్నాయి క‌దా.. అనుకుంటే.. జ‌రిగిన నియామ‌కాల‌ను ప‌రిశీలిస్తే.. ఎమ్మెల్యేల‌కు, మాజీ ఎమ్మెల్యేల‌కు కూడా అవ‌కాశం ఇచ్చారు. కాబ‌ట్టి ప‌ద‌వులు అడ్డంకి కాదు.. మ‌రి ఏం జ‌రిగింది? ఫైర్ బ్రాండ్ల వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని బాబు అనుకున్నారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌ర‌కు వీరిని ఎలా సంతృప్తి ప‌రుస్తారో ? చూడాలి.

Tags:    

Similar News