చేర్చుకుంటే మేం ఎస్ అంటామా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో గ్రూపులకు తెరలేచే విధంగా ఉంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన తోట త్రిమూర్తులను ఇటీవల [more]

Update: 2019-09-21 02:00 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో గ్రూపులకు తెరలేచే విధంగా ఉంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన తోట త్రిమూర్తులను ఇటీవల జగన్ వైసీపీలో చేర్చుకున్నారు. సీనియర్ లీడర్, ఒక సామాజిక వర్గంలో పట్టున్న నేత కావడంతో జగన్ భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా తోట త్రిమూర్తులకు వైసీపీ కండువా కప్పేశారు. తోట త్రిమూర్తులను చేర్చుకునే ముందే జగన్ ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలతో మాట్లాడారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన చెల్లుబోయిన వేణుగోపాల్, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తో జగన్ మాట్లాడారు.

ఇద్దరికీ నచ్చచెప్పినా…..

తోట త్రిమూర్తులను ఎందుకు చేర్చుకుంటున్నామో వారికి వివరించారు. తోట త్రిమూర్తులను చేర్చుకున్నంత మాత్రాన పార్టీలోనూ, ప్రభుత్వంతోనూ ప్రాధాన్యత ఎవరికీ తగ్గదన ఆయన వారిద్దరికీ హామీ ఇచ్చారు. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్, చెల్లుబోయిన వేణుగోపాల్ లు ఇద్దరూ తోటత్రిమూర్తులు చేరిక సమయంలో నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. ఆ తర్వాత మీడియాతోనూ వారు మాట్లాడారు. కలసి పనిచేస్తామని, పార్టీని మరింత పటిష్టం చేస్తామని చెప్పుకొచ్చారు. నిజంగా తూర్పు గోదావరి జిల్లాలో నిజంగా ఇది శుభపరిణామమేనని అందరూ భావించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం……

ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వ్యక్తులతో పాటు సామాజిక వర్గాలను బేస్ చేసుకుని రాజకీయాలు నడుస్తాయి. కాపు, శెట్టిబలిజలు ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ల నుంచి కాపు సామాజిక వర్గం అభ్యర్థి పోటీ పడ్డారు.కాపు ఓట్లు చీలిపోవడంతోనే తోట త్రిమూర్తులు ఓటమి పాలయ్యారు. నిజానికి తోట త్రిమూర్తులకు ఇప్పటికీ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. అనుచరుల సమావేశం పెడితేనే వేల సంఖ్యలో హాజరయ్యారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం మాత్రం తోట త్రిమూర్తుల రాకను పరోక్షంగా వ్యతిరేకిస్తుంది.

పిల్లి ససేమిరా….

ఇక ప్రస్తుత మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు తోట త్రిమూర్తులు రాజకీయంగా బిగినింగ్ నుంచి శత్రువే. ఆయన మీద అనేక సార్లు పోటీ చేసి ఓడారు. గెలిచారు. అలాంటి త్రిమూర్తులను పార్టీలోకి చేర్చుకోవడం పిల్లికి కూడా ఇష్టం లేదు. జగన్ మాట కాదనలేక తలూపారే కాని ఆయన మనస్ఫూర్తిగా స్వాగతించలేకపోతున్నారు. ఇటవల పిల్లి సుభాష్ చంద్రబోస్ తనకు తోట త్రిమూర్తులు ఎప్పటికీ శత్రువే అని చేసిన వ్యాఖ్యలతో తోట వర్గం భగ్గుమంటోంది. తోట త్రిమూర్తులకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారు. పిల్లి వ్యాఖ్యలతో తోట త్రిమూర్తులకు ఆ పదవి దక్కడం అనుమానమేనంటున్నారు. ఇప్పుడు రామచంద్రాపురంలో మూడు గ్రూపులు తయారయ్యాయి. ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్ ది. మరొకటి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ది. తాజాగా తోట త్రిమూర్తులు చేరికతో మూడో గ్రూపు తయారయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News