మళ్ళీ మసకబారనున్న వెండితెర

కొత్త ఏడాది జనవరి నుంచి కోటి ఆశలతో అడుగుపెట్టిన టాలీవుడ్ ఇప్పుడు మరోసారి కరోనా రక్కసి దెబ్బకు విలవిల్లాడనుంది. క్రాక్, జాతి రత్నాలు, వకీల్ సాబ్ వంటి [more]

Update: 2021-04-17 18:29 GMT

కొత్త ఏడాది జనవరి నుంచి కోటి ఆశలతో అడుగుపెట్టిన టాలీవుడ్ ఇప్పుడు మరోసారి కరోనా రక్కసి దెబ్బకు విలవిల్లాడనుంది. క్రాక్, జాతి రత్నాలు, వకీల్ సాబ్ వంటి సినిమాల హిట్స్ తో ఇక రొటీన్ లో పడ్డం అనుకున్న దశలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో సినీ జనం ఆశలపై నీళ్ళు చల్లేస్తుంది. దాంతో తిరిగి చాలామంది నిర్మాతలు ఓటిటీలతో సంప్రదింపులు మొదలు పెట్టారు. టక్ జగదీశ్ వంటి చిత్రాల విడుదల సందిగ్ధంలో పడింది. వచ్చేనెలలో విడుదలకు సిద్ధమైన భారీ చిత్రాలు ఆచార్య, నారప్ప వంటివి వాయిదా వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి.

50 శాతానికి సిద్ధం అవుతున్న…..

కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న నేపథ్యంలో 50 శాతం ఆక్యుపెన్సీ విధానానికి తిరిగి ప్రభుత్వాలు శ్రీకారం చుట్టనున్నాయి. దాంతో కలెక్షన్ లు దారుణంగా పడిపోనున్నాయి. దీనికి తోడు పాత జీవో ప్రకారం కొత్త సినిమాలకు, భారీ చిత్రాలకు ధరలు పెంచుకునే అవకాశం లేకుండా ఎపి లో నిబంధనలు రానుండటంతో అగ్రహీరోల చిత్రాల రికార్డ్ కలెక్షన్లు భవిష్యత్తులో కనిపించే అవకాశాలు లేకుండా పోయేలా ఉన్నాయి. టికెట్ ధర తగ్గింపు విషయంలో ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుండగా ఆయా హీరోల అభిమానుల్లో మాత్రం నిరసన వ్యక్తం అవుతుండటం గమనార్హం.

షూటింగ్ లకు బ్రేక్ లు …

ముఖ్యమైన తారా గణం కరోనా బారిన పడుతుండటంతో నిన్న మొన్నటివరకు శరవేగంగా నడిచిన షూటింగ్ లకు బ్రేక్ లు పడుతున్నాయి. సహ నటులతో ఉండే సన్నివేశాల చిత్రీకరణలో ఒక్క పాత్రధారుడు డుమ్మా కొట్టినా కాలిషీట్లు అందరివి వృధా అవుతున్నాయి. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ మరింత తీవ్ర రూపం దాల్చనున్న నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకు కరోనా కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. తిరిగి ఓ టి టి ల రాజ్యం పెద్దఎత్తునే మొదలుకానుంది. మరోపక్క టివి సీరియల్స్ కి వైరస్ తాకిడి తీవ్రంగానే ఉంది. పలు సీరియల్స్ షూటింగ్స్ సైతం అరకొరగానే నడుస్తుండటంతో ఈ రంగంపై ఆధారపడిన లక్షలాదిమంది వెతలు అన్ని ఇన్నీకావు.

Tags:    

Similar News