చక్రం తిప్పిన వాళ్లే..?

టీడీపీ అధికారంలో ఉండ‌గా.. వారంతా చ‌క్రం తిప్పారు. చంద్రబాబును ఆహా ఓహో అంటూ.. అంద‌లం ఎక్కించారు. అయితే, ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయిన త‌ర్వాత ఒక్కరంటే ఒక్కరు [more]

Update: 2019-08-14 13:30 GMT

టీడీపీ అధికారంలో ఉండ‌గా.. వారంతా చ‌క్రం తిప్పారు. చంద్రబాబును ఆహా ఓహో అంటూ.. అంద‌లం ఎక్కించారు. అయితే, ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయిన త‌ర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా టీడీపీ గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశారు. టికెట్ల కోసం చంద్రబాబును కాకా ప‌ట్టేందుకు ప్రయ‌త్నించిన వారు కూడా ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. దీంతో నెల్లూరు జిల్లా టీడీపీ రాజ‌కీయాలు ఒక్కసారిగా తుస్సు మంటున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. ఇక్కడ గ‌త 2014 ఎన్నిక‌ల్లో కొంత మేర‌కు టీడీపీ ప‌రిస్థితి బాగానే ఉంది. వెంక‌ట‌గిరి, కోవూరు వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ముందుకు న‌డించింది. ఆ ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీ మూడు సీట్లతో స‌రిపెట్టుకున్నా చంద్రబాబు టార్గెట్ 2019ని పెట్టుకుని ఇక్కడి నేత‌ల‌ను దిశానిర్దేశం చేశారు.

నేతలను చేర్చుకున్నా…..

అందుకే ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, అస్సలు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని నారాయ‌ణ‌కు ఆయ‌న మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ లోకి చేరుతామ‌ని చెప్పిన నాయ‌కుల‌కు రెడ్ కార్పెట్ ప‌రిచారు. జ‌డ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర రెడ్డి స‌హా వైసీపీ నుంచి వ‌చ్చిన నాయ‌కులకు ప‌సుపు కండువాలు క‌ప్పారు. వీరంతా టీడీపీ ని మ‌రోసారి అధికా రంలోకి తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తార‌ని ఆయ‌న భావించారు. అయితే, అనుకున్నది ఒక్కటి ఇప్పుడు జ‌రుగుతున్నది మ‌రొక‌టి అనే విధంగా ప‌రిస్తితి మారిపోయింది.

బూమ్ రాంగ్ అయింది అందుకే….

కీల‌క‌మైన ఆదాల ప్రభాక‌ర్‌రెడ్డి వంటివారు టికెట్ క‌న్ఫర్మ్ చేసుకుని కూడా వైసీపీలోకి జంప్ చేశారు. అలాంటి వారిని కట్టడి చేయ‌డంలో అప్పటికే చంద్రబాబు విఫ‌ల‌మ‌య్యార‌నే వ్యాఖ్యలు వినిపించాయి. ఇక‌, వ‌రుస ప‌రాజ‌యాలు మూట‌గ‌ట్టుకున్న సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి వంటివారికి టీడీపీలో పెద్ద పీట వేశారు. ఇక ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో అనుభ‌వం లేని నారాయ‌ణ లాంటి వాళ్లకు మంత్రి ప‌ద‌వులు ఇవ్వడం కూడా బూమ‌రాంగ్ అయ్యింది. దీనిని చాలా మంది టీడీపీ నాయ‌కులు విమ‌ర్శించారు. అయినా బాబు మాత్రం ఆయ‌న టికెట్‌ను క‌న్ఫర్మ్ చేశారు. ఇక‌, టికెట్ కోసం వ‌చ్చిన బొమ్మిరెడ్డికి టికెట్ ఇవ్వక‌పోవ‌డంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న కూడా మౌనం వ‌హించారు.

ముఖ్యనేతలకు కూడా…..

క్షేత్రస్థాయిలో నాయ‌కుల‌పై వ‌స్తున్న విమ‌ర్శల‌ను ప‌ట్టించుకోకుండానే బాబు టికెట్ల పందేరం చేశారు. ఇలా ఆయ‌న వేసిన అడుగులు టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించినా.. అప్పట్లో మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు ఓడిపోయిన త‌ర్వాత ఏ ఒక్కరూ టీడీపీ ని బ‌తికించుకునేందుకు ముందుకు రావ‌డం లేదు. టీడీపీ కి అండ‌గా ఉంటార‌ని అనుకున్న బీద సోద‌రులు కూడా అంటీ ముట్టన‌ట్టే వ్యవ‌హ‌రిస్తున్నారు. బీద సోద‌రుల సంస్థల‌పై ఐటీ, ఈడీ దాడుల నేప‌థ్యంలో చంద్రబాబు త‌మ‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని వీరి ఆగ్రహం.

రెండు నెలలు గడుస్తున్నా…..

ప్రస్తుతం బీద ర‌విచంద్ర ఎమ్మెల్సీగా ఉన్నారు. అయినా కూడా వీరు చ‌లాకీగా వ్యవ‌హ‌రించ‌డం లేదు. పైగా జిల్లాలో పార్టీ ప‌ద‌వుల్లో కీల‌క మార్పులు కొరుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంది. కానీ, ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత రెండు నెల‌లైనా చంద్రబాబు ఆదిశ‌గా దృష్టి పెట్టక‌పోవ‌డంతో టీడీపీ నాయ‌కులు స్తబ్దుగా ఉన్నారు. బొల్లినేని వంటివారు ఓట‌మి నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌క‌పోవ‌డంతో పార్టీలో అంత‌ర్గత చ‌ర్చలు, టీడీపీని నిల‌బెట్టుకునేందుకు స‌రైన దిశానిర్దేశం వంటివి ఎక్కడా క‌నిపించ క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News