అప్రమత్తం కాకుంటే …..అపాయమే?

మత పరమైన విభజన సమాజానికి చెడు సంకేతాలు పంపుతుంది. అందులోనూ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం అటువంటి అవకాశం వస్తే వదులుకోవు. సాధారణ ప్రజల్లో [more]

Update: 2020-03-02 17:30 GMT

మత పరమైన విభజన సమాజానికి చెడు సంకేతాలు పంపుతుంది. అందులోనూ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం అటువంటి అవకాశం వస్తే వదులుకోవు. సాధారణ ప్రజల్లో అత్యధికులు మతాలవారీగా తమను విభజించడాన్ని ఇష్టపడరు. లౌకకమైన భావజాలం తో కూడిన పార్టీలు, వ్యక్తులనే అధికారంలోకి తేవడానికి ప్రయత్నిస్తారు. ఆర్థికంగా సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో, సమాజంలో శాంతిసామరస్యాలు కూడా అంతే ముఖ్యం. మైనారిటీలను సంతృప్తి పరచడానికి నాయకులు తమ హక్కులను సైతం పణంగా పెడుతున్నారనే భావన మెజార్టీ ప్రజల్లో నెలకొనడంతోనే ఉత్తరభారతంలో బీజేపీ బలపడింది. అయితే ఇందుకు ఇతర మతాల పట్ల వ్యతిరేకత కంటే తమ మతభావనలకు భంగం వాటిల్లుతోందనే ఆందోళనే ముఖ్యకారణం. కాంగ్రెసు, ప్రాంతీయ పార్టీల హయాంలో తమకు ఈమేరకు అన్యాయం జరుగుతోందనే అసంతృప్తి వారిలో ఏర్పడింది. రామమందిర నిర్మాణం, అయోధ్య వివాదం వంటివి ఇందుకు ప్రాతిపదికలే తప్ప అవే ముఖ్యాంశాలు కావు. మెజార్టీ ప్రజల్లో నెలకొన్న ఈ ఆందోళన, అసంతృప్తులను చల్లబరిచే ప్రత్యామ్నాయం లో తాము ముందుంటామనే సంకేతాలతో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించింది. మైనారిటీలకు అన్యాయం చేస్తామని కాకుండా మెజార్టీకి న్యాయం చేస్తామనే వాదనతోనే బీజేపీ బలపడుతూ వచ్చింది. రెండు వర్గాల పట్ల సమదృష్టి కనబరచగలమని ధీమానివ్వడంలో కాంగ్రెసు వైఫల్యం చెందింది. ఫలితంగా ఆ పార్టీ ప్రాభవం క్రమేపీ క్షీణిస్తూ వచ్చింది.

మతం మత్తు…

మతం భావోద్వేగాలతో ముడిపడిన అంశం. అయితే అది వ్యక్తిగతం. సామాజికంగా అంతా కలిసి జీవించడమనేది కొన్ని శతాబ్దాలుగా భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. స్వాతంత్ర్యానంతరం కూడా దీనిని కాపాడుకుంటూనే వస్తున్నాం. గడచిన రెండు మూడుదశాబ్దాల్లో రాజకీయ అవకాశాలు, అధికారం కోసం సాగే పరుగులో మతాన్ని సైతం తమకు అనుకూలంగా వినియోగించుకోవడం పెరిగిపోయింది. అయినప్పటికీ దక్షిణభారతంలో మాత్రం దీని ప్రభావం తక్కువే. ఒక్క హైదరాబాదు, పరిసరాల్లో మాత్రమే మతపరమైన అంశాన్ని ప్రధానం చేసే ఎంఐఎం వంటి పార్టీలు గెలవగలుగుతున్నాయి. లౌకిక భావనలు కలిగి అన్నివర్గాలను ఆకట్టుకోగలిగిన పార్టీలు మాత్రమే మిగిలినచోట్ల అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటున్నాయి. అయితే ఏదేని అంశం దొరికితే మతపరమైన వాదనను పునాదిగా వాడుకోవాలని, పార్టీని విస్తరించుకోవాలని చూసే శక్తులకు కొదవ లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయమవుతున్న అంశం పౌరసత్వ సవరణ చట్టం. దీని ఆధారంగా దేశంలోని రాజకీయ పార్టీలు రెండు శిబిరాలుగా విడిపోయి కొంతకాలంగా కాట్లాడుకుంటున్నాయి. పార్లమెంటు ఆమోదంతోనే చట్టం రూపుదాల్చింది. రాజకీయ పార్టీలు తమ వాదనలను పార్లమెంటు వేదికపైనే తేల్చి చెప్పాయి. కానీ బహిరంగ ఆందోళనలకు రెండు పార్శ్వాలను పార్టీలు ప్రదర్శిస్తున్నాయి.

సీఏఏ సాకుగా…

ప్రజాస్వామ్యంలో పార్టీలు చాలా సున్నితంగా వ్యవహరించాలి. పార్లమెంటు ఆమోదించిన చట్టానికి వ్యతిరేకంగా ఏదేని ఒక వర్గం ఆందోళనలు చేస్తుంటే ఆచితూచి స్పందించాలి. లేదంటే తమ వాదనను నేరుగా ప్రజలకు నివేదించాలి. ఒకవర్గం చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా కానీ, వ్యతిరేకంగా కానీ సహకారాన్ని అందిస్తూ మతపరమైన ముద్ర వేసుకోవడం ఆయా పార్టీల ప్రజాస్వామిక విలువలకే భంగకరం. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెసులు రెండు రకాల వర్గాలను భుజాన వేసుకోవడంతోనే శాంతిభద్రతల సమస్య తలెత్తిందనేది తోసిపుచ్చలేని నిజం. ఫలితంగా ఆయా పార్టీలకు ఓట్లపరంగా లాభనష్టాలు ఉండవచ్చు కానీ రాజకీయంగా దీర్ఘకాలంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ఢిల్లీలో బీజేపీ సర్వశక్తులు ఒడ్డినప్పటికీ గెలవలేకపోవడానికి కారణమదే. సాధారణ చట్టాలకు మెజార్టీ ప్రజల జీవనంతో సంబంధం ఉండదు. పౌరసత్వ సవరణ చట్టం సైతం దేశంలో మెజార్టీ ప్రజల దైనందిన జీవనానికి సంబంధించిన అంశం కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్గనిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రజలలో ఒకవర్గంపై వివక్ష చూపుతారనే సందేహమే ఇందులో దాగి ఉంది. నిజానికి దేశంలో వెయ్యికి ఒక్కరు కూడా ఈ సీఏఏ ప్రభావితులు ఉండరని మేధావులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ సమస్య రగులుతూనే ఉంది. రాజకీయాలు రంగప్రవేశం చేయడమే ఇందుకు ప్రధాన కారణం.

అడకత్తెరలో…

పౌరసత్వ సవరణ చట్టం భవిష్యత్తులో జాతీయ పౌరసత్వ జాబితా ( ఎన్ ఆర్ సీ) కి దారి తీస్తుందేమోననే అనుమానమే ఆందోళనలకు అసలు కారణం. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ప్రజలకు నివేదించాల్సి ఉంది. దానిపైన క్లారిటీ ఇవ్వడానికి బదులు సీఏఏపై వెనక్కి వెళ్లేదే లేదంటూ పదే పదే ప్రకటించడం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా మారుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు పెద్దగా లేవనే చెప్పాలి. అక్కడక్కడ నిరసనలు కొనసాగినా అవి విధానపరంగా తమ భావ ప్రకటనను తెలియచేసేవే. అయితే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వంటి వారి పర్యటనలతో ఇప్పుడిప్పుడే సెగలు రాజుకుంటున్నాయి. ఇవి తీవ్రత దాల్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ముస్తాఫా వంటివారు సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయకపోతే రాజీనామా చేస్తామని ప్రకటించడమంటే ధిక్కార ధోరణిగానే చూడాలి. వైసీపీ అధినాయకత్వానికి ఇది ఒక పరీక్షగానే చెప్పాలి. అలాగే తమ పార్టీకి చెందిన ఎంపీ కేశినేని నాని అసదుద్దీన్ ఓవైసీ సమావేశానికి మద్దతు సమీకరించి ఆయనతోపాటు బహిరంగసభల్లో పాల్గొనడం టీడీపీకీ కూడా ఇబ్బందికరమే. ఆంధ్ర్రప్రదేశ్ లో మతపరమైన విషయాల్లో చాలా సంయమనం కనిపిస్తుంది. కానీ తాత్కాలిక ప్రయోజనాల దృష్టితో అన్నిరకాలుగా యోచించకుండా ముందుకు వెళితే పార్టీల అధినాయకత్వాలే జవాబుదారీగా మారతాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News