తుమ్మల ఆ టీఆర్ఎస్ నేత‌ల‌కు మ‌ళ్లీ టార్గెట్టేనా?

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర‌రావు గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా చ‌క్రం తిప్పడంతో పాటు జిల్లా రాజ‌కీయాల‌ను [more]

Update: 2021-01-11 00:30 GMT

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర‌రావు గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా చ‌క్రం తిప్పడంతో పాటు జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన ఆయ‌న ఇప్పుడు పార్టీ వ‌రుస‌గా రెండోసారి అధికారంలో ఉన్నా ఆయ‌న మంత్రి కాదు క‌దా.. క‌నీసం ఎమ్మెల్యేగా కూడా లేరు. 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో పాలేరులో తుమ్మల నాగేశ్వర‌రావు ఓడిపోవ‌డం.. రాజ‌కీయంగా తాను ద‌శాబ్దాల పాటు చ‌క్రం తిప్పిన ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలోనే వెన‌క‌ప‌డిపోవ‌డం జ‌రిగిపోయాయి. మంత్రి పువ్వాడ అజ‌య్ దూకుడుతో తుమ్మల చివ‌ర‌కు ద‌మ్మపేట మండ‌లంలోని త‌న వ్యవ‌సాయ క్షేత్రంలో వ్యవ‌సాయ ప‌నులు చూసుకుంటూ వ‌స్తున్నారు.

కేసీఆర్ తోనే…..

తుమ్మల నాగేశ్వర‌రావు పూర్తిగా సైలెంట్ అయిపోవ‌డంతో ఆయన అనుచ‌రులు కూడా ఏం చేయాలో తెలియ‌క డోలాయామానంలో ప‌డిపోయారు. చివ‌ర‌కు తుమ్మల పార్టీ మారిపోతార‌న్న ప్రచారం ఎక్కువైంది. ఆయ‌నపై బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్రయోగిస్తోంద‌న్న వార్త‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. తాజాగా ఈ గంద‌ర‌గోళానికి తెర‌దించేందుకు తుమ్మల త‌న కంచుకోట అయిన స‌త్తుప‌ల్లిలో కార్యక‌ర్తల స‌మావేశం నిర్వహించారు. తాను పార్టీ మార‌డం జ‌రిగే ప‌నికాద‌ని.. తెలంగాణ‌లో మ‌రి కొంత కాలం మ‌న‌మంద‌రం కేసీఆర్‌కు అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో కొంద‌రు స్వార్థప‌రులు కావాల‌నే మ‌న‌ల‌ను ప‌నిగ‌ట్టుకుని ఓడించార‌ని ఆయ‌న ఆవేద‌న వ్యక్తం చేయ‌డంతో పాటు త‌న‌కు ప‌ద‌వి ఉన్నా.. లేక‌పోయినా కార్యక‌ర్తల‌ను క‌డుపులో పెట్టుకుని చూసుకుంటానని తుమ్మల నాగేశ్వర‌రావు తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. ఈ క్రమంలోనే తానేంటో త్వర‌లోనే చూపిస్తాన‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్యలు కూడా సంచ‌ల‌నం రేపాయి.

పాలేరులో యాక్టివ్ అయిన తుమ్మల‌…

2018 ఎన్నిక‌ల్లో తుమ్మల నాగేశ్వర‌రావుపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన కందాళ ఉపేంద‌ర్ రెడ్డి ఆ వెంట‌నే టీఆర్ఎస్‌లోకి రావ‌డంతో పాటు స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల వ‌ర్గాన్ని పూర్తిగా ప‌క్కన పెట్టేసి త‌న అనుచ‌రుల‌కే టిక్కెట్లు ఇప్పించుకున్నారు. చివ‌ర‌కు తుమ్మల హ‌యాంలో నామినేటెడ్ ప‌ద‌వులు వ‌చ్చిన వారిని కూడా సైడ్ చేసేయ‌డంతో వ్యవ‌సాయం చేసుకుంటోన్న తుమ్మల నాగేశ్వర‌రావులో క‌ద‌లిక మొద‌లైంది. త‌న వ‌ర్గం పూర్తిగా చెల్లాచెదురు కాకూడ‌ద‌ని ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు.

ప్రత్యర్థి వర్గం మాత్రం…..

చాలా మంది పాత కేడ‌ర్‌తో పాటు తుమ్మల నాగేశ్వర‌రావు అనుచ‌రులు ఆయన వెంట ఉంటున్నారు. దీంతో ఉపేంద‌ర్ రెడ్డి సైతం తుమ్మల స్పీడ్ ఎక్కువైతే త‌న చాప‌కింద‌కు నీరు వ‌స్తాయ‌న్న టెన్షన్‌తో భారీ కాన్వాయ్‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యట‌న‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడ అజ‌య్ సైతం ఉపేంద‌ర్‌రెడ్డికి ప‌రోక్షంగా సాయం చేస్తూ.. తుమ్మల‌ను తొక్కేందుకు మెల్లగా ప్రయ‌త్నాలు చేస్తున్నార‌న్న చ‌ర్చలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా తుమ్మల త‌న వ‌ర్గాన్ని కాపాడుకునేందుకు.. తాను ఇంకా రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని ప్రూవ్ చేసుకునేందుకు యాక్టివ్ అయితే ఆయ‌న ప్రత్యర్థి వ‌ర్గం కూడా చాలా వ్యూహాత్మకంగా యాక్టివ్ అవుతూ ఆయ‌న్ను టార్గెట్ చేస్తున్నట్టే క‌నిపిస్తోంది.

Tags:    

Similar News