గులాబీ గుయ్యిమనిపించి ఇరవై ఏళ్లు

తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ఇరవై ఏళ్లు అయింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27వ తేదీన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ [more]

Update: 2020-04-27 09:30 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ఇరవై ఏళ్లు అయింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27వ తేదీన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఉద్యమ పార్టీగానే ఆయన ప్రారంభించారు. తెలంగాణ భావ జాలాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. రక్తపు బొట్టు చిందకుండా రాష్ట్నాన్ని సాధిస్తానని కేసీఆర్ తెలిపారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన మాటలను ఎవరూ నమ్మలేదు.

ప్రారంభంలో నలుగురైదుగురే….

తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ వెంట నలుగురైదుగురు మించి నాయకులు లేరు. అయినా ఆయన వెనకడుగు వేయలేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష‌్ట్ర సాధన సాధ్యమవుతుందని ఆయన నమ్మారు. ప్రజల్లో కూడా విశ్వాసాన్ని నింపారు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత నష్టపోయిందీ లెక్కలతో పక్కాగా వివరించారు. తెలంగాణ వాసుల్లో సెంటిమెంట్ ను రగిలించారు. ఇప్పుడు కాకుంటే మరెప్పుడు అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

నీళ్లు.. నిధులు.. నియమకాల నినాదంతో….

నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ ప్రజలకు వివరించి వారిని ఉద్యమం వైపు తిప్పడంలో సక్సెస్ అయ్యారు. ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు రాజకీయ పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయగలిగారు. 2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యునిస్టులతో కలసి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగారు. 42 స్థానాల్లో పోటీ చేసి 26 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో విజయం సాధించారు.

తెగువ.. సంయమనం….

2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కేసీఆర్ జత కట్టారు. పది అసెంబ్లీ స్థానాలను , రెండు పార్లమెంటు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ప్రజారాజ్యం, కాంగ్రెస్ విడిగా పోటీ చేయడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లను కేసీఆర్ ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేలు కొందరు పార్టీని విడిచివెళ్లారు. అయినా మొక్కవోని ధైర్యంతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. 2009 నవంబరు 29న కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ దీక్షకు దిగారు. దీక్ష ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. 2013లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో వెనక్కు తగ్గింది. చివరకు 2013 జులైలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మొత్తం మీద ఇరవైఏళ్ల ప్రస్థానంలో కేసీఆర్ చూపించిన తెగువ, సంయమనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదం చేశాయి. అన్ని రాజకీయ పార్టీలకూ గూబ గుయ్యి మనిపించి నేటికి ఇరవై ఏళ్లు అయింది.

Tags:    

Similar News