ఏపీ వ‌ద్దు.. హైద‌రాబాదే ముద్దంటోన్న ఇద్దరు టీడీపీ కింగ్‌లు

పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిప‌క్షంలో ఉన్నా గ‌త ప‌దేళ్లుగా ఆ ఇద్దరు నేత‌లు కింగ్‌లుగా ఎదిగారు. జిల్లా రాజ‌కీయాల్లో త‌మ‌దైన ముద్ర వేశారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు, [more]

Update: 2020-12-23 06:30 GMT

పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిప‌క్షంలో ఉన్నా గ‌త ప‌దేళ్లుగా ఆ ఇద్దరు నేత‌లు కింగ్‌లుగా ఎదిగారు. జిల్లా రాజ‌కీయాల్లో త‌మ‌దైన ముద్ర వేశారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు, ఆ త‌ర్వాత కూడా పార్టీ జిల్లా అధ్యక్షులిగా ప‌నిచేసి స‌త్తా చాటారు. నిత్యం ప్రజ‌ల్లోనూ ఉంటూ పార్టీని ప‌టిష్టం చేయ‌డంతో పాటు జిల్లాలో పార్టీని గెలిపించ‌డంతో పాటు తాము ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ ఇద్దరు సీనియ‌ర్ నేత‌లు గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గాల్లో కాదు క‌దా క‌నీసం ఏపీలోనే అడ్రస్‌లేకుండా పోయారు. హైద‌రాబాద్‌కే ప‌రిమితం అయి వ్యాపారాలు, ఇత‌ర వ్య‌వ‌హారాల్లో మునిగిపోయారు. పార్టీ ప్రతిప‌క్షంలోకి వ‌చ్చాక త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో చాప చుట్టేశారు. అస‌లు వీళ్లు పార్టీలో ఉన్నారా ? లేదా అన్న సందేహం ఒక‌టి అయితే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ పుంజుకుంద‌న్న ఆశ వ‌చ్చే వ‌ర‌కు కూడా వీరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండేందుకు కూడా ఇష్టప‌డ‌డం లేద‌ని పార్టీ వ‌ర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.

ముఖ్యమైన పాత్ర పోషించి…

ఆ ఇద్దరు నేత‌లు ఎవ‌రో కాదు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్థన్‌. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఈ ఇద్దరు నేత‌లు గుంటూరు, ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ప‌నిచేసి.. పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నా కూడా ఉత్సాహంతో ఉర‌క‌లు పెట్టించారు. జ‌నార్థన్ 2012 ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడినా మొక్కోవ‌ని ధైర్యంతో ఫైట్ చేసి 2014లో ప్రస్తుత మంత్రి బాలినేనిని ఓడించారు. ఇక 2009లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి, ఎమ్మెల్యేగా గెలిచిన పుల్లారావు గుంటూరు జిల్లాలో ప్రతిప‌క్షాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. పార్టీ గెలిచాక మంత్రి అయి మ‌ళ్లీ హ‌వా చెలాయించారు.

ఇద్దరూ ఓటమి పాలయి….

గ‌త ఎన్నిక‌ల్లో ఒంగోలులో మంత్రి బాలినేని చేతిలో జ‌నార్థన్‌, చిల‌క‌లూరిపేట‌లో త‌న శిష్యురాలు విడ‌ద‌ల ర‌జ‌నీ చేతిలో పుల్లారావు ఓడిపోయారు. అప్పటి నుంచి వీరిలో రాజ‌కీయ వైరాగ్యం పుట్టకొచ్చిందో ఏమో గాని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండ‌డం మానేశారు. పుల్లారావు అయితే నియోజ‌క‌వ‌ర్గాన్ని పూర్తిగా మ‌ర్చిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. పేట‌లో టీడీపీ శ్రేణులు బ‌య‌ట‌కు వ‌చ్చి హ‌డావిడి చేస్తున్నా ఇప్పుడే ఎందుకు గుడ్డలు చించుకోవ‌డం అని ఆయ‌నే వారిస్తున్నార‌ట‌. దీంతో స్థానికంగా టీడీపీ కేడ‌ర్ లో నిరుత్సాహం అలుముకుంది. ఓ వైపు విడ‌ద‌ల ర‌జ‌నీ ఫుల్ స్వింగ్‌లో ఉండ‌డంతో పాటు టీడీపీ కేడ‌ర్‌ను ఇబ్బంది పెడుతున్నార‌న్న టాక్ ఉంది.

ఇద్దరూ ఒకే రూట్లో…..

దీనిపై పోరాటాలు చేస్తోన్న కేడ‌ర్‌కు చిన్నపాటి ఆత్మస్థైర్యం కూడా పుల్ల‌రావు ఇవ్వకుండా మౌన‌వ్రతం కొన‌సాగిస్తున్నార‌ట‌. సార్ మీరు ఇక్కడ ఉండ‌మ‌ని కేడ‌ర్ వేడుకుంటున్నా.. ఇప్పుడు ఎందుక‌మ్మా… స్థానిక సంస్థల ఎన్నిక‌ల మూమెంట్ స్టార్ట్ అయ్యాక స్టార్ట్ చేద్దాంలే అన‌డంతో పేట టీడీపీ కేడ‌ర్ బేజార‌వుతున్నారు. ఇక ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షుడు దామ‌చ‌ర్ల జ‌నార్థన్ సైతం ప్రత్తిపాటి రూట్లోనే న‌డుస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కోట్లాది రూపాయ‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకున్న ఆయ‌న ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గానికి పూర్తి దూరంగా హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు.

పదవుల నుంచి తప్పించి…..

జిల్లాలో పార్టీపై ఆయ‌న‌కు గ్రిప్ పోవ‌డంతోనే చంద్రబాబు ఆయ‌న జిల్లా ప‌ద‌వుల నుంచి త‌ప్పించేసి రాష్ట్ర స్థాయి ప‌ద‌వి క‌ట్టబెట్టి మ‌మః అనిపించేశారు. జ‌నార్థన్ పిల్ల‌ల చ‌ద‌వులు పేరుతో ఫ్యామిలీతో స‌హా హైద‌రాబాద్‌లోనే మ‌కాం వేసి ఒంగోలు వైపే చూడ‌డం లేదు. ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఉద‌యం 12 గంట‌ల‌కు కాని ప్రజ‌ల‌కు ద‌ర్శనం ఇవ్వర‌న్న పేరుంది. ఆయ‌న‌కు ప్రస్తుత ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు స‌మీప బంధువు కావ‌డంతో… ఆయ‌న కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయ‌ల నిధులు తీసుకువ‌చ్చి ఒంగోలును అభివృద్ధి చేశారు. అయినా ప్రజ‌లు ఓడించార‌న్న వేద‌న‌తో పాటు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండ‌డంతో జనార్థన్ ఒంగోలు వ‌చ్చేందుకు ఇష్టప‌డ‌డం లేదు. దీంతో అక్కడ కేడ‌ర్ చెల్లా చెదురైంది. మ‌రోవైపు స్థానికంగా మంత్రిగా ఉన్న బాలినేని టీడీపీ కేడ‌ర్ నిరుత్సాహాన్ని క్యాష్ చేసుకుంటూ త‌న వైపున‌కు తిప్పేసుకుంటున్నారు.

రూటు మార్చుకుంటారా?

ఏదేమైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప‌ద‌వులు ఉన్నప్పుడు అధికారాన్ని అనుభ‌వించిన ఈ టీడీపీ ఇద్దరు సీనియ‌ర్లు ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు దూరంగా ఉండడం క‌రెక్ట్ కాద‌న్న అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. నిన్న మొన్నటి వ‌ర‌కు పార్టీ యువ‌నేత లోకేష్‌, చంద్రబాబు క‌రోనా సాకుతో హైద‌రాబాద్‌లోనే ఉండ‌డంతో పార్టీలోనే స‌ర్వత్రా చ‌ర్చనీయాంశ‌మైంది. ఇప్పుడిప్పుడే వారు ఏపీలోకి వ‌స్తున్నారు. మ‌రి ఈ సీనియ‌ర్లు కూడా రూటు మార్చుకుంటారేమో ? చూడాలి.

Tags:    

Similar News