ఉండవల్లి మాటలు జనంలోకి వెళ్తాయి ?

రాజకీయాల్లో విమర్శలు సహజం. అయితే విమర్శలే రాజకీయంగా వర్తమానంలో పరిస్థితులు తయారయ్యాయి. దీంతో ఏది సరైన విమర్శో ఏది కడుపు మంటతో చేసినదో కూడా జనాలకు అర్ధం [more]

Update: 2020-12-30 12:30 GMT

రాజకీయాల్లో విమర్శలు సహజం. అయితే విమర్శలే రాజకీయంగా వర్తమానంలో పరిస్థితులు తయారయ్యాయి. దీంతో ఏది సరైన విమర్శో ఏది కడుపు మంటతో చేసినదో కూడా జనాలకు అర్ధం కాక అన్నీ ఒకే గాటకు కట్టేస్తున్నారు. అయితే ఇప్పటికీ కొందరు నాయకుల మాటలను జనం నమ్ముతారు. అలా నమ్మడానికి కారణం వారిని ఉన్న ట్రాక్ రికార్డ్. అలా జనంలో నిజాయతీపరుడిగా, అవినీతి మకిలి లేని నేతగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిరూపించుకున్నారు. అందువల్ల ఆయన మాటలకు పదునెక్కువ. జనంలోనూ విలువెక్కువ.

పట్టించుకోవాల్సిందే …?

ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు చేసే విమర్శలు పదవుల కోసం కాదు. నా జీవితానికి రెండు సార్లు ఎంపీ కావడమే ఎక్కువ అని ఉండవల్లి చెప్పేసి ఎన్నికల రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చేశాక ఆయన్ని ఎవరైనా ఆడిపోసుకుంటే తప్పే అవుతుంది. ఉండవల్లి నిబద్ధత ఏంటో జనాలకు తెలుసు. ఆయన ఏది మాట్లాడినా తర్కం ఉంటుందని కూడా జనం భావిస్తారు. అటువంటి ఉండవల్లి జగన్ సర్కార్ మీద పదే పదే చేస్తున్న విమర్శలు మాత్రం కచ్చితంగా ప్రభుత్వాధినేతలు పట్టించుకోవాల్సిందే. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ అనో, ఆయనేం చేస్తాడనో ఉదాశీన వైఖరి ఇక్కడ అసలు పనికి రానేరాదు మరి.

జనం నమ్ముతారు…..

ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన తీరుని జనం హర్షిస్తారు. ఆయన మాటలను కూడా నమ్ముతారు. దీనికి చాలా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటి అంటే వైఎస్సార్ కి ఉండవల్లి అత్యంత సన్నిహితుడు. అలాగే జగన్ మీద కూడా గతంలో ఉండవల్లి ప్రశంసలు కురిపించారు. ఆయన అవినీతి కేసుల వల్ల జైలుకు వెళ్ళడు అని ఒక న్యాయవాదిగా తనకున్న అనుభవాన్ని జోడించి మరీ చెప్పారు. ఇలా ఆయన జగన్ విషయంలో మంచిని చెప్పినప్పుడు ఇపుడు చేసే విమర్శలకు కూడా విలువ స్థాయి ఉంటాయి కదా. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలంటే జనం కచ్చితంగా వింటారు అనే చెప్పాలి.

నిజమైన విశ్లేషకుడే…..

ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ మిగిలిన వారి మాదిరిగా ఏకపక్షంగా ఒకే పార్టీని పట్టుకుని విశ్లేషణలు అసలు చేయరు. ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దాని వల్ల వచ్చే పరిణామాలను కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారు. అందుకే ఉండవల్లి విశ్లేషణ చక్కగా ఉంటుంది. ఆయన జగన్ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చేస్తున్న నిర్లక్ష్యాన్ని సభ్య సమాజానికి కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. కేంద్రాన్ని గట్టిగా నిలదీయకపోవడాన్ని ప్రశ్నించారు. పొరుగున ఉన్న కేసీయార్ తెలంగాణాలో గోదావరి నది మీద వరసపెట్టి కడుతున్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ జగన్ ఎందుకు అడగడంలేదని నిలదీశారు. ఇవన్నీ పక్కన పెడితే పోలవరం విషయంలో తేడా వచ్చిందో జనం మాత్రం వైసీపీని జగన్ ని అసలు క్షమించరంటూ భవిష్యత్తు రాజకీయాన్ని కూడా చదివి వినిపించారు. మరి జగన్ లైట్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్ తీసుకోకుండా తగిన కార్యాచరణతో పోలవరం విషయంలో ముందుకు సాగితే మంచిదేమో.

Tags:    

Similar News