జగన్ కు ఉండవల్లి వార్నింగ్ ఇచ్చారా?

ఏపీ రాజకీయాలపై మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల ప్రధాని మోడీ కి రాసిన లేఖ వివరాలను, ఈనాడు రామోజీ [more]

Update: 2020-02-06 12:30 GMT

ఏపీ రాజకీయాలపై మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల ప్రధాని మోడీ కి రాసిన లేఖ వివరాలను, ఈనాడు రామోజీ రావు పై తన కోర్టు వార్ వివరాలను వెల్లడించారు. జగన్ పాలన ఇతర అనేక అంశాలపై తన అభిప్రాయాలు తెలిపారు ఉండవల్లి అరుణ్ కుమార్. పవన్ కళ్యాణ్ పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకు సిద్ధంగా లేనని జనసేన కు తనకు పరస్పర ఒప్పందం ఉండటం వల్ల ఆయన్ను విమర్శించబోనని చెప్పారు. పవన్ ను సినిమాలు చేయాలని ఆయన రాజకీయాల్లోకి వచ్చేముందే తాను చెప్పానని గుర్తు చేశారు. అలాగే బిజెపి తో జనసేన పొత్తు లో తప్పేమీ లేదని తేల్చారు ఉండవల్లి.

వారిద్దరే ఉంటారు …..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ, రెడ్డి ల ఆధిపత్యమే కొనసాగుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు. దీనికి చరిత్రను ఉదహరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రాసిన పుస్తకాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నారు. కులం పై మీడియా వైఖరి ని ఉండవల్లి తప్పుపట్టారు. ఈ దేశంలో కుల ప్రభావాలు ఎక్కువని మత ప్రభావం తక్కువే అని కాన్షిరాం చెప్పారని అదే నిజం అన్నారు.ఏపీ లో బిసి లు అధికమే అని వారిని అందరిని కలిపి రాజకీయం చేసే నాయకుడు ఉంటే తప్ప తాను బతికుండగా మరో కులం కి సీన్ లేకపోవచ్చన్నారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు కలిపితే ఎంత శాతం వున్నారో కాపులు అంతమంది ఉన్నా ఆ ప్రయత్నం లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ వైఫల్యం చెందారని చెప్పుకొచ్చారు.

మూడు రాజధానులు ప్రయోగమే…

మూడు రాజధానుల అంశంపై అంతా అయోమయం గానే ఉందని ఇది జగన్ చేస్తున్న ప్రయోగం కాబట్టి ఫలితాలు వచ్చే వరకు ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు ఉండవల్లి. అయితే చంద్రబాబు చేస్తున్న తప్పే జగన్ చేస్తున్నట్లు కనబడుతుందని వికేంద్రీకరణ చేస్తా అని ప్రకటించిన జగన్ ఇప్పుడు వచ్చే పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరు ఉద్యోగాలకోసం వెళ్లే పని లేకుండా విశాఖ అభివృద్ధి చేస్తా అని చెప్పడం గమనిస్తే ఆయన కూడా ఒకే చోట అభివృద్ధి ని కేంద్రీకరించేలా కనిపిస్తుందన్నారు. హై కోర్టరు విడిగా వున్నా పాలన, శాసన రాజధానులు ఒకే చోట దేశంలో ఉండటం చూశాం కానీ ఈ తరహా చూడలేదని చెప్పారు ఉండవల్లి అరుణ కుమార్. అమరావతి లో రాజధాని రియల్ వ్యాపారం అని ఎప్పుడో చెప్పానని రైతులు త్యాగం చేశారంటే ప్రమాదంలో పడతారని హెచ్చరించారు. వారు ప్రభుత్వంతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారని వారికి ఏమి కావాలో చెప్పుకుని అవి పొందకపోతే బాబు చెప్పినట్లే త్యాగమే అయిపోతుందని వ్యాఖ్యానించారు ఉండవల్లి. ఇంటి నుంచే ఉద్యోగాలు చేస్తున్న ఈ రోజుల్లో ఎక్కడ రాజధాని అన్నది సమస్య కానే కాదన్నారు ఉండవల్లి. కేంద్రంపై వత్తిడి చేసి టాక్స్ మినహాయింపులు తీసుకుని పారిశ్రామలను రాష్ట్రం అంతా విస్తరించాలని సూచించారు. హైదరాబాద్ తరహా అభివృద్ధి అమరావతిని చేసినా విశాఖను చేసినా అనేక సమస్యలు భవిష్యత్తులో తప్పవన్నారు.

ఫోకస్ దీనిమీద పెట్టాలి …

ముఖ్యమంత్రి జగన్ తన దృష్టిని పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం పై పెట్టాలని కోరారు ఉండవల్లి. నిర్వాసితులకు 30 వేల కోట్ల రూపాయల ఖర్చు పై ఇంకా కేంద్రానికి రాష్ట్రానికి స్పష్టత లేదని ఎపి అభివృద్ధికి ఆ ప్రాజెక్ట్ కీలకమని పేర్కొన్నారు. రాజధాని అంశం అన్నది అంత ప్రాధాన్యత లేనిదని దీనిపై కన్నా స్పెషల్ స్టేటస్ పై ఫోకస్ పెట్టాలని కోరారు. కేంద్రం ఆ పేరుతో ఇచ్చేందుకు ఇష్టపడకపోతే మరో పేరుతో రాయితీలు పొందాలని చెప్పారు. ఏపీకి అన్యాయం చేశారు అంటూ పదేపదే ప్రకటించే మోడీ, షా లు ఎందుకు న్యాయం చేసే ప్రయత్నం చేయడం లేదని దీనిపై గట్టిగా పోరాడాలని ఉండవల్లి కోరారు. ఈ రెండు అంశాలే రాష్ట్రానికి ప్రయోజనకరమని వైసిపి గుర్తించాలన్నారు.

మోడీ ఆలోచన మారాలి …

దేశంలో పౌరసత్వ సవరణ బిల్లు పై జరుగుతున్న ఆందోళనలు ప్రధాని పరిగణలోకి తీసుకుని ప్రజల్లో వున్న అభద్రతా భావాన్ని తొలగించాలని కోరుతూ మోడీ కి లేఖను ఈ మెయిల్ ద్వారా పంపడం జరిగిందన్నారు అరుణ కుమార్. గతంలో మన వల్ల ఏర్పాటైన బంగ్లాదేశ్ నేడు జిడిపి లో భారత్ కన్నా ముందుకు దూసుకుపోతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని దేశ ఆర్ధిక దుస్థితికి కారణాలు వెతికి నివారణ చర్యలు చేపట్టకపోతే ప్రమాదమని హెచ్చరించారు ఉండవల్లి. మనం ముష్టి వేస్తే బతికిన దేశం నేడు ఎలా వుంది మనం ఎలా దిగజారి పోతున్నామో గుర్తు పెట్టుకోవాలని అన్నారు. వివేకానందుడు, మహాత్మా గాంధీ ల వారసులమని ప్రకటించుకుంటున్న బిజెపి నాయకత్వం దేశంలో ముస్లిం లను వేరుగా చూడాలనుకోవడం మంచి పరిణామం కాదని గురూజీ గోల్వాల్కర్ వంటి వారి సిద్దాంతాలు చదివిన తరువాత ఆరెస్సెస్ నుంచి ఆ భావజాలం నుంచి నచ్చక బయటకు వచ్చానన్నారు ఉండవల్లి.

ప్రమాదంలో పడతారు జాగ్రత్త …

జగన్ సర్కార్ పెన్షన్ లు రద్దు చేస్తున్న తీరును తప్పుపట్టారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇలాంటివి ప్రజలను ఒప్పించి చేయాలి తప్ప మరోలా చేస్తే సర్కార్ నిండా మునుగుతుందని జగన్ ను అరుణ కుమార్ హెచ్చరించారు. డబ్బున్న వారికి పెన్షన్ లు రద్దు చేసినా అవి గ్రామ సభల్లో పెట్టి లేనివారికి ఇస్తున్నామని చెప్పి ఎందుకు రద్దు చేస్తున్నారో వివరించకపోతే తప్పుడు ప్రచారాలు కొంప ముంచుతాయి చూసుకోండని గతంలో చెన్నారెడ్డి రేషన్ కార్డు ల ఏరివేత నిర్ణయాన్ని ఉదాహరణగా చెప్పారు మాజీ ఎంపీ. 1989 లో చెన్నారెడ్డి ఇలాగే దొంగ కార్డు ల ఏరివేతకు చేసిన ప్రయత్నం తప్పుడు ప్రచారంతో ప్రభుత్వాన్నే కూల్చిందని గుర్తు చేశారు.

రామోజీ పై పోరాటం …

రామోజీ రావు నేరం చేసి ఆ డబ్బు చెల్లించాను కనుక కేసు నుంచి విముక్తి చేయాలని హై కోర్టు లో వ్యవహారం సాగించారని క్రిమినల్ కేసులో దొంగ తనం చేసి డబ్బు తిరిగి ఇస్తే శిక్ష పడకుండా ఎలా అన్నదే తన పాయింట్ అన్నారు అరుణ కుమార్. దీనిపై సుప్రీం కోర్టు లో కేసు రీ ఓపెన్ అయ్యిందని ఎపి ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఈ కేసులో చేర్చామని చెప్పారు. ఈనాడు, ను అడ్డుపెట్టుకుని రామోజీ రావు సాగించిన దారుణాలపై త్వరలో పుస్తకం రాయనున్నట్లు చెప్పారు. డబ్బు పలుకుబడి వున్న వారిదే రాజ్యం అని రామోజీ కేసు ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు ఉండవల్లి.

Tags:    

Similar News