ఉండవల్లి అప్పుడే వస్తారట
జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశంపై తెలుగురాష్ట్రాల్లో చర్చలు, రచ్చలు దాదాపు నెలరోజులుగా సాగుతూనే వున్నాయి. రాజకీయ విశ్లేషకులు, మేధావులు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వారంతా చంద్రబాబు [more]
జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశంపై తెలుగురాష్ట్రాల్లో చర్చలు, రచ్చలు దాదాపు నెలరోజులుగా సాగుతూనే వున్నాయి. రాజకీయ విశ్లేషకులు, మేధావులు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వారంతా చంద్రబాబు [more]
జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశంపై తెలుగురాష్ట్రాల్లో చర్చలు, రచ్చలు దాదాపు నెలరోజులుగా సాగుతూనే వున్నాయి. రాజకీయ విశ్లేషకులు, మేధావులు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వారంతా చంద్రబాబు నిర్ణయాన్ని, జగన్ నిర్ణయాన్నో సమర్ధించడమో విమర్శించడమో పూర్తి అయిపోయాయి. ఒక పక్క అమరావతి అనుకూల మరోపక్క అమరావతి వ్యతిరేక ఉద్యమాలు కొనసాగుతూనే వున్నాయి. కానీ ఒకే ఒక్క పొలిటికల్ స్టార్ ఇంకా మౌనముద్ర వీడటం లేదు. ఆయనే మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్. ఎపి అభివృద్ధికి తన విలువైన సలహాలు సూచనలు ఇస్తూ విభజన రాజ్యాంగ విరుద్ధమని ఇప్పటికి సుప్రీం కోర్టు లో పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ రాజధాని అంశంపై నోరు విప్పకపోవడంతో విమర్శల పాలౌతున్నారు.
నాడు అమరావతిని భ్రమరావతి అని తేల్చి …
చంద్రబాబు రాజధాని గా అమరావతిని ప్రకటించిన వెంటనే గతంలో రంగంలోకి దిగి అది భ్రమరావతి అని తేల్చిన మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ ఇప్పుడు మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చాకా మౌనవ్రతం పాటించడం చర్చనీయాంశం అయ్యింది. ఈ కీలక అంశంపై ఉండవల్లి విశ్లేషణ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయినా ఆయన బయటకు వచ్చి దీనిపై మాట్లాడేందుకు సిద్ధం కాకపోవడమే అందరికి అర్ధం కాకుండా పోతుంది. అరటిపండు వలచినట్లు క్లిష్టమైన అంశాలను కూడా వివరించే వాక్పటిమ వున్న ఉండవల్లి రాజధానులపై తనదైన శైలిలో విశ్లేషణ అందిస్తారని చూసినవారికి ఇప్పుడు నిరాశే మిగిలింది.
శివరామకృష్ణన్ నివేదికను ….
యూపీఏ ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సూచనలను ఏవీ చంద్రబాబు సర్కార్ నాడు పరిగణలోనికి తీసుకోకపోవడంపై గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర ఆగ్రహాన్ని ఆవేదనను వ్యక్తం చేశారు. అమరావతి కేవలం ప్రభుత్వం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారమని తేల్చేశారు. గ్రాఫిక్స్ తో ప్రజలను మభ్యపెట్టి పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని హక్కులను చంద్రబాబు తాకట్టుపెట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ప్రశ్నర్ధకం గా మార్చి చారిత్రక తప్పిదం చేశారన్నారు గతంలో ఉండవల్లి. అమరావతి ప్రాంతం లో 33 వేలఎకరాల మూడు పంటల భూములను ల్యాండ్ పూలింగ్ లో సేకరించడం దేశానికే తీరని నష్టం చేకూరుస్తుందని భవిష్యత్తులో అనేక సమస్యలకు కారణం అవుతుందన్నారు నాడు అరుణ కుమార్.
వేడి చల్లారాక వస్తారా …
ప్రస్తుతం అమరావతిపై అనుకూలం లేదా ప్రతికూలంగా ఎవరు మాట్లాడినా విమర్శల పాలు అవుతున్నారు. ప్రభుత్వం జి ఎన్ రావు, కమిటీ, బోస్టన్ కమిటీ, మంత్రులతో హైపవర్ కమిటీ అంటూ ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఈ కమిటీల రిపోర్ట్స్ పై ఇప్పటికే మంత్రివర్గం పలు దఫాలు చర్చలు సాగిస్తుంది. దాంతో బాటు అసెంబ్లీలో సైతం రాజధాని మార్పుపై సుదీర్ఘ చర్చ ప్రత్యేకంగా వైసిపి ప్రభుత్వం నిర్వహించేందుకు సిద్ధమౌతోంది. ఈ వ్యవహారాలన్నిటిపై క్లారిటీ వచ్చిన తరువాతే ఉండవల్లి అరుణకుమార్ నోరు విప్పే ఆలోచన చేస్తున్నట్లు ఆయన సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. సరైన ఆధారాలు లేకుండా ఎలా బడితే అలా మాట్లాడటం ఉండవల్లికి అలవాటు లేదు. అధికారిక లెక్కలతో కాగితాలతోనే ఆయన సాధికారిక వివరణలు ఇస్తారు. ఏ నిర్ణయం తో ఏది లాభం నష్టం స్పష్టంగా చెప్పే అలవాటు ఆయనది. జగన్ అధికారికంగా నిర్ణయం ప్రకటించిన వెంటనే దీనిపై ఉండవల్లి మాట్లాడతారని తెలుస్తుంది.
ప్రస్తుతం బుక్ బ్యాంక్ నిర్మాణం పైన …
ఉండవల్లి అరుణ కుమార్ ప్రస్తుతం పుస్తక పఠనం, రచనా వ్యాసంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. వాటితో బాటు భావితరాలకు ప్రయోజనం కలిగేలా ఒక బుక్ బ్యాంక్ ఏర్పాటుకు భవన నిర్మాణం పై ఆయన కాలం గడుపుతున్నారు. రాజ్యాంగ సంక్షోభ అంశాలపై, దేశానికి, రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే సూచనలు, సలహాలను తన మిత్రులతో చర్చించి అందించేందుకు ఒక వేదికను రూపొందించే పనిలో బిజీ అయిపోయారు. దీనికోసం ఆయన సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ఎంపి ల్యాడ్స్ నుంచి 30 లక్షల రూపాయలను ఇటీవల మంజూరు చేశారు కూడా. ఈ బుక్ బ్యాంక్ ఏర్పాటు పూర్తి అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ అందరికి అందుబాటులోకి రానున్నారని తెలుస్తుంది.