ఇక్కడ టీడీపీ ప‌రిస్థితి దారుణం.. జెండా మోసేవారే లేరుగా?

కృష్ణాజిల్లా అంటేనే టీడీపీ.. టీడీపీ అంటేనే కృష్ణాజిల్లాగా రాజ‌కీయాల్లో గుర్తింపు పొందిన ఈ జిల్లాలో ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. విజ‌య‌వాడ న‌గ‌రాన్ని ప‌క్కన పెడితే.. [more]

Update: 2020-07-18 12:30 GMT

కృష్ణాజిల్లా అంటేనే టీడీపీ.. టీడీపీ అంటేనే కృష్ణాజిల్లాగా రాజ‌కీయాల్లో గుర్తింపు పొందిన ఈ జిల్లాలో ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. విజ‌య‌వాడ న‌గ‌రాన్ని ప‌క్కన పెడితే.. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు ఈసురోమ‌ని కాలం గ‌డుపుతు న్నారు. గ‌న్నవ‌రంలో గెలిచిన వంశీ టీడీపీకి దూరం కాగా.. గుడివాడ‌లో ఓడిన దేవినేని అవినాష్ వైసీపీలో చేరి విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వయ‌క‌ర్త అయ్యారు. ఇలాంటి ప‌రిస్థితి క‌న్నా దారుణంగా ఉంది పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ప‌రిస్థితి. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన పామ‌ర్రులో టీడీపీ జెండా మోసేవారు ప‌క్కన పెడితే.. అస‌లు ఈ పార్టీ గురించి ప్రస్థావించేవారు కూడా లేక పోవ‌డం మ‌రింత దారుణంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ వ్యవ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ పుట్టి పెరిగిన ప్రాంత‌మైన నిమ్మకూరుకు అత్యంత స‌మీపంలో ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ దారుణ దుస్థితిపై నేత‌లు సైతం ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.

2009 ఎన్నికల నుంచి……

2009లో జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గం పున‌ర్విభ‌జ‌న‌లో పామ‌ర్రు ఏర్పడింది. అయితే.. అప్పటి నుంచి జ‌రిగిన మూడు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ ఊసు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. అప్పటి ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉప్పులేటి క‌ల్పన ప‌రాజ‌యం పాల‌య్యారు. కాంగ్రెస్ ఇక్కడ విజ‌యం సాధించింది. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్ స‌హా.. జ‌గ‌న్ గెలుస్తార‌నే ప్రచారం సాగ‌డంతో 2014 ఎన్నిక‌ల‌కు ముందు క‌ల్పన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. దీంతో టీడీపీ కేడ‌ర్ అంతా కూడా ఆమెతోపాటు వైసీపీ తీర్థం పుచ్చుకుంది. ఆ ఎన్నిక‌ల్లో వ‌ర్ల రామ‌య్యపై కేవ‌లం 700 ఓట్లతో గెలిచిన ఆమె ఆ త‌ర్వాత‌.. చంద్రబాబు పిలుపుతో ఆమె తిరిగి సొంత‌గూటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు.

కేసుల భయంతోనేనా?

ఈ మ‌ధ్యలో క‌ల్పన ప్లేస్‌ను పార్టీ నేత వ‌ర్లరామ‌య్యకు అప్పగించారు చంద్రబాబు. అయితే, ఆయ‌న విజ‌య‌వాడ నేటివ్ కావ‌డం పామ‌ర్రులో చ‌క్రం తిప్పలేక పోవ‌డంతో 2014లో టికెట్ ఇచ్చినా విజ‌యం సాధించ‌లేక పోయారు. పోనీ.. త‌ర్వాత అయినా.. పార్టీ ఎదుగుద‌ల‌కు కృషి చేశారా? అంటే.. అది కూడా లేదు. మొత్తంగా ఉప్పులేటి క‌ల్పన ఎటు తిరిగితే.. సైకిల్ అటు తిరిగింది. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే ఆమె కుటుంబంపై కొన్ని ఆరోప‌ణ‌లు ఉన్ననేప‌థ్యంలో కేసులు ఎదుర్కొనాల్సి వ‌స్తుందేమోన‌న్న భ‌యం ఆమెను వెంటాడుతోంది. ఈ క్రమంలోనే ఆమె టీడీపీ జోలికి రావ‌డం లేదు. పోనీ.. పార్టీకి వ్యవ‌స్థీకృతంగా ఏమైనా బ‌లం ఉందా.. అంటే అది కూడాలేదు.

వైసీపీ వైపు చూస్తున్నారా?

ఇవ‌న్నీ కాదు.. 2014లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ‌ర్ల రామ‌య్య చ‌క్రం తిప్పుతున్నారా? అంటే.. క‌ల్పన వ‌ర్గం ఆయ‌న‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఆయ‌న ఎప్పటి నుంచో అస‌లు ఈ నియోజ‌క‌వ‌ర్గం వైపు కూడా తొంగి చూడ‌డం లేదు. ఇక‌, తాజాగా అందుతున్న స‌మాచారం ప్రకారం.. ఉప్పులేటి క‌ల్పన‌.. వైసీపీవైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది. ఈమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదు. ఒక‌వేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. క‌నుక టీడీపీ భారీగా న‌ష్టపోయే అవ‌కాశం ఉంది. ఇక్కడ నాయ‌కుడు కూడా లేక‌పోవ‌డం, ఉన్నవారిని డెవ‌ల‌ప్ చేసుకోక‌పోవ‌డం వంటివి పార్టీకి శ‌రాఘాతాలుగా ప‌రిణ‌మించాయి. దీంతో టీడీపీలో ఈ విష‌యం చ‌ర్చనీయాంశంగా మారింది. మ‌రి బాబు ఏం చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News