నేత.. నేత.. పంతం.. టీడీపీ అంతం.. అంటే ఇదేనేమో?

జోగి జోగి రాసుకుంటే.. బూడిద రాలింద‌న్నట్టుగా ఉంది టీడీపీ ప‌రిస్థితి. సొంత పార్టీలోని నేత‌ల మ‌ధ్య ఒకరిపై ఒక‌రు పంతాల‌కు పోయి పార్టీని ప‌ట్టించుకోవడం మానేయ‌డంతో ఓ [more]

Update: 2020-03-11 06:30 GMT

జోగి జోగి రాసుకుంటే.. బూడిద రాలింద‌న్నట్టుగా ఉంది టీడీపీ ప‌రిస్థితి. సొంత పార్టీలోని నేత‌ల మ‌ధ్య ఒకరిపై ఒక‌రు పంతాల‌కు పోయి పార్టీని ప‌ట్టించుకోవడం మానేయ‌డంతో ఓ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ జెండాను ప‌ట్టుకునే నాథుడు కూడా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. మ‌రి విష‌యంలో కి వెళ్తే కృష్ణాజిల్లా పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి ఇది. పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీల‌కు కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గం.

వర్ల స్థానికుడు కాకపోవడంతో….

2014లో ఇక్కడ నుంచి టీడీపీ త‌ర‌ఫున వ‌ర్ల రామ‌య్య పోటీ చేశారు. ఆయన‌పై అప్పటి ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఉప్పులేటి క‌ల్పన పోటీ చేశారు. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చినా పామ‌ర్రులో మాత్రం వైసీపీ నుంచి పోటీ చేసిన క‌ల్పన 713 ఓట్లతో విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత వ‌ర్ల రామయ్య సీన్ సితార‌ అయిపోయింది. విజ‌య‌వాడ‌కు చెందిన వ‌ర్లకు పామ‌ర్రుతో ప్రత్యేకంగా అనుబంధం అంటూ ఏమీలేదు. చంద్రబాబు ఆయ‌న‌కు అక్కడ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో కేటాయించారు. ఇక‌, ఉప్పులేటి కల్పన స్థానికురాలు. సో.. ఆమె వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి.. బాబు హ‌వా ఉన్నప్పటికీ.. గెలుపు గుర్రం ఎక్కారు.

బెడిసి కొట్టడంతో….

అయితే, 2017లో జ‌రిగిన టీడీపీ ఆక‌ర్ష్ ప్రభావంతో వ‌ర్ల జోక్యం చేసుకుని ఉప్పులేటి క‌ల్పన‌ను ద‌గ్గరుండి మ‌రీ పార్టీలోకి చేర్పించారు. అనంత‌రం గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో తాను టికెట్ త్యాగం చేసి మ‌రీ ఇక్కడ నుంచి ఉప్పులేటి కల్పనకే టీడీపీ టికెట్ ఇప్పించారు. ఆమె గెలుపు కోసం వ‌ర్ల ప్రచారం కూడా నిర్వహించారు. అయితే, ఆమె భారీ తేడాతో ఓడిపోయారు. ఆ త‌ర్వాత టీడీపీ అధికారంలోకి రాక‌పోవ‌డం, క‌ల్పన ఓడిపోవ‌డంతో అప్పటి వ‌ర‌కు వ‌ర్లకు, క‌ల్పన‌కు రాజ‌కీయంగా ఉన్న సంబంధాలు బెడిసి కొట్టాయి.

సఖ్యత కుదిర్చినా…..

మీ వ‌ల్లే నేనే వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాను. లేకుండా ఉంటే.. మ‌ళ్లీ గెలిచేదాన్ని.. అని వ‌ర్లపై కొన్నాళ్ల కింద‌ట క‌ల్పన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విష‌యం చివ‌ర‌కు చంద్రబాబు వ‌ద్ద పంచాయితీ కూడా పెట్టింది. అయితే, ఇద్దరి మ‌ధ్యా స‌ఖ్యత కుదిర్చిన చంద్రబాబు క‌లిసి మెలిసి ఉండాల‌ని హిత‌వు ప‌లికారు. అయితే, ఉప్పులేటి కల్పన మాత్రం వ‌ర్లపై ఆగ్రహంతోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన‌ప్పుడ ల్లా తాను ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోవ‌డం, త‌న అనుచ‌రుల‌ను వ‌ర్ల‌కు స‌హ‌క‌రించ‌కుండా అడ్డుకోవడం చేస్తున్నారు. దీంతో వ‌ర్ల కూడా ఆమెను ప‌ట్టించుకోవ‌డం మానేశారు.

ఇద్దరూ కాడి వదిలేయడంతో….

అదే స‌మ‌యంలో నియోజ‌క‌వర్గంలో పార్టీ కార్యక్రమాల‌కు కూడా హాజ‌రు కావ‌డం మానుకున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో మెంబ‌రైన వ‌ర్ల రామయ్య త‌న‌మాటే చెల్లుబాటు కావాల‌ని అంటుంటే.. తాను ఇక్కడ ఓడినా.. త‌న‌దే పైచేయి కావాల‌ని ఉప్పులేటి కల్పన అంటున్నారు .దీంతో ఇద్దరు నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు నానాటికీ పెరిగి.. ఎవ‌రూ కూడా నియోజ‌క‌వర్గంలో కార్యక్రమాలు నిర్వహించ‌డం లేదు. ఇదే అదునుగా ఇక్కడ నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌.. టీడీపీ కార్యక‌ర్తల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప‌ని ప్రారంభించారు. సో.. ఇదీ.. నేతా నేతా పంతం టీడీపీ అంతానికి దారి తీసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పామ‌ర్రు ఎన్టీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే పార్టీ ప‌రిస్థితి ఇలా ఉండ‌డంతో తెలుగు త‌మ్ముళ్ల ఆవేద‌న‌కు అంతే లేదు.

Tags:    

Similar News