వీరంతా సైకిలెక్కేస్తారట…!

ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే వారు వీరు అయిపోతారు. గోడ దూకుళ్ళు ఎక్కువైపోతాయి. టికెట్లు రాని వారు, కోరిన చోట సీటు రాని వారు, అసమ్మతులు, అసంత్రుప్తులు ఇలా [more]

Update: 2019-02-07 11:00 GMT

ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే వారు వీరు అయిపోతారు. గోడ దూకుళ్ళు ఎక్కువైపోతాయి. టికెట్లు రాని వారు, కోరిన చోట సీటు రాని వారు, అసమ్మతులు, అసంత్రుప్తులు ఇలా అందరికీ ఒక్కసారిగా స్వాతంత్రం వచ్చేస్తుంది. దానికి తోడు రాయబేరాలు కూడా జోరుగా సాగుతాయి. మంచి ఆఫర్లు కూడా ఇస్తారు. దాంతో వీలు చూసుకుని జెండా ఎత్తేస్తారు. విషయానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు మూడవ వారంలో విశాఖ పర్యటనకు వస్తున్నారు. మంచి రోజులు ఉండడంతో సీఎం సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడానికి ఉత్తరాంధ్రకు చెందిన నేతలు ఉరకలు వేస్తున్నారు. వారిలో వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉండడం విశేషం.

అరడజన్ కి పైగా

విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో అరడజన్ కి పైగా నాయకులు సైకిలెక్కుతారని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. విశాఖ నుంచి మాజీ మంత్రులు కొణతాల రామక్రిష్ణ, సబ్బం హరి, బీజేపీకి ఇటీవలే రాజీనామా చేసిన చెరువు రామకోటయ్య వంటి వారు పార్టీ తీర్ధం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇక విజయనగరం నుంచి తాజాగా కాంగ్రెస్ కి రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్, వైసీపీలో టికెట్ రానందుకు అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి సాంబశివరాజు సైకిలెక్కుతారని ప్రచారం సాగుతోంది. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిని కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమె కనుక సరేనంటే సీఎం ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకుంటారని అంటున్నారు.

తలుపులు బార్లా తెరచేశారు

టీడీపీలోకి ఎవరు వచ్చినా చేర్చుకోవాలని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఎన్నికలవేళ ప్రతి ఒక్క నాయకుడు ఉపయోగమేనని అంచనా వేస్తోంది. ఈసారి ఎన్నికలు త్రిముఖ పోరుగా ఉండడంతో ప్రతి ఒక్క ఓటు కూడా కీలకమని ఊహిస్తున్నారు. దీంతో అన్ని పార్టీల నుంచి నాయకులను వెతికే పనిలో పార్టీ పెద్దలు పడ్డారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో కూడా మంతనాలు జరుపుతున్నారు. అయితే కొణతాలతో ఆయనకు పడదు. కానీ హైకమాండ్ సరైన హామీ ఇస్తే చేరేందుకు సిధ్ధమేనని అంటున్నారు. దాడి ఒకపుడు టీడీపీ నాయకుడే, దానికి తోడు ఇటీవల బాబు విశాఖ వచ్చినపుడు దాడి తనకు మిత్రుడని అందరి ముందు ప్రకటించారు కూడా. మొత్తానికి ఈనెల మూడవ వారంలో ఉత్తరాంధ్ర రాజకీయాలు మారిపోతాయని అంటున్నారు.

Tags:    

Similar News