వంశీని ఎదిరించే నేత లేరా?

కృష్ణా జిల్లా అంటేనే తెలుగుదేశంకు కంచుకోట‌.. ఇందులోనూ గ‌న్నవ‌రం అంటే ఆ పార్టీకి ఎంత స్పెష‌లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ‌తంలో గ‌ద్దె రామ్మోహ‌న్‌, ఆ త‌ర్వాత ప్రముఖ [more]

Update: 2021-06-03 09:30 GMT

కృష్ణా జిల్లా అంటేనే తెలుగుదేశంకు కంచుకోట‌.. ఇందులోనూ గ‌న్నవ‌రం అంటే ఆ పార్టీకి ఎంత స్పెష‌లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ‌తంలో గ‌ద్దె రామ్మోహ‌న్‌, ఆ త‌ర్వాత ప్రముఖ పారిశ్రామిక‌వత్త‌లు అయిన దాస‌రి సోద‌రులు, ఇప్పుడు వల్లభనేని వంశీ ఇలా బ‌ల‌మైన నాయ‌కులు ఇక్కడ కేడ‌ర్‌ను చెక్కు చెద‌ర‌కుండా కాపాడుకుంటూ వ‌చ్చారు. అయితే అదంతా గ‌తం అయిపోయింది. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో కార్యక‌ర్తల‌కు తానున్నానంటూ భ‌రోసా ఇచ్చే నాయ‌కుడే లేడు. చివ‌ర‌కు వ‌ల‌స నాయ‌కులు గ‌న్నవ‌రం టీడీపీ జెండాను భుజాన కెత్తుకుంటార‌ని అక్కడ కేడ‌ర్ ఎప్పుడూ క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌రు. అలాంటి దుస్థితిలో గ‌న్నవ‌రం టీడీపీ ఉంది.

బలమైన నేతలు లేక…?

గ‌ద్దె ఎలాగూ విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌నకు ఇక్కడ కేడ‌ర్ ఉన్నా ఆయ‌న ఇప్పుడు గ‌న్నవ‌రంను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. దాస‌రి సోద‌రులు ఎన్నిక‌ల‌కు ముందే వల్లభనేని వంశీతో విబేధించి వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ఇక వంశీ ఎన్నిక‌ల్లో అత్తెస‌రు మెజార్టీతో గెలిచి ఆ త‌ర్వాత చంద్రబాబును తీవ్రంగా విబేధిస్తూ జ‌గ‌న్ చెంత చేరిపోయారు. నాడు టీడీపీలో చ‌క్రం తిప్పిన కీల‌క నేత‌లు అందరూ ఇప్పుడు టీడీపీకి దూరం అయిపోయారు. ఇక ద్వితీయ శ్రేణి కేడ‌ర్లో చాలా మంది టీడీపీలో ఉంటే ప‌నులు కావ‌ని.. వల్లభనేని వంశీతో పాటే వైసీపీ చెంత చేరిపోయారు.

ఏమాత్రం సరిపోని….?

ఇక వైసీపీలో గ‌త రెండు ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన దుట్టా రామాచంద్రరావు, యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుకు కూడా ఎంతో కొంత కేడ‌ర్ ఉంది. వల్లభనేని వంశీ పార్టీని వీడిన తర్వాత బలమైన ఇన్ ఛార్జిని నియమించలేదు. వైసీపీలో ఉన్న ఈ నేత‌ల‌ను ఢీకొట్టి పార్టీని నిల‌బెట్టాలంటే అంతే బ‌ల‌మైన నాయ‌కుడికి ఇక్కడ పార్టీ ప‌గ్గాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే చంద్రబాబు ఎంత వెదికిని ఏ ఒక్కరు ఇక్కడ ప‌గ్గాలు తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో చివ‌రికి బంద‌రుకు చెందిన ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడికి ఇక్కడ నియోజ‌క‌వ‌ర్గ బాధ్యత‌లు ఇచ్చారు. సామాజిక , ప్రాంతీయ స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా ఈ ఎంపిక ఏ మాత్రం క‌రెక్ట్ కాద‌ని టీడీపీ వాళ్లు చెప్పినా బాబుకు అంత‌కు మించి నాయ‌కుడు దొర‌క్క పోవ‌డంతో అర్జునుడికే ఇక్కడ ఇన్‌చార్జ్ ప‌ద‌వి ఇచ్చారు.

వంశీ వెంటనే?

ఆ ప‌ద‌వి చేప‌ట్టాక గ‌న్నవ‌రంలో ఆయ‌న ఎన్నిసార్లు ప‌ర్యటించి చూస్తే వేళ్లమీద లెక్క పెట్టవ‌చ్చు. వల్లభనేని వంశీ పార్టీని వీడిన‌ప్పుడు వంశీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ పుట్టిన‌ప్పటి నుంచి ఉన్న కేడ‌ర్ అయితే వంశీపై ఊగిపోయారు. అయితే రాను రాను ఇది చ‌ల్లబ‌డిపోయింది. స్థానిక నేత‌, సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా స‌రైన నేత‌ను బాబు ఎంపిక చేయ‌క‌పోవ‌డంతో వంశీని తిట్టిన వాళ్లే ఇప్పుడు ఆయ‌న చెంత‌కో లేదా యార్ల‌గ‌డ్డ చెంత‌కో చెక్కేస్తున్నారు. గ‌న్నవ‌రం టీడీపీకి బాబు ఇంత‌కు మించి చేసే ఆప‌రేష‌న్ అయితే ఇప్పట్లో ఏం ఉండ‌ద‌నే అర్థమ‌వుతోంది.

Tags:    

Similar News