వంశీకి రూట్ మ‌రింత క్లియ‌ర్‌ ?

కృష్ణా జిల్లా గ‌న్నవ‌రం రాజ‌కీయాలు ఎప్పుడూ గ‌రంగ‌రంగానే ఉంటాయి. పార్టీ ఏదైనా, ఎన్నిక ఏదైనా కూడా గ‌న్నవ‌రం ఎప్పుడు హాట్ హాట్ రాజ‌కీయంతో వార్తల్లో ఉంటుంది. 1989 [more]

Update: 2021-07-16 00:30 GMT

కృష్ణా జిల్లా గ‌న్నవ‌రం రాజ‌కీయాలు ఎప్పుడూ గ‌రంగ‌రంగానే ఉంటాయి. పార్టీ ఏదైనా, ఎన్నిక ఏదైనా కూడా గ‌న్నవ‌రం ఎప్పుడు హాట్ హాట్ రాజ‌కీయంతో వార్తల్లో ఉంటుంది. 1989 నుంచి ఇక్కడ ఇదే తంతు న‌డుస్తోంది. ఇక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా.. ఆ ఎమ్మెల్యేకు ఆ పార్టీలో సొంత నేత‌ల నుంచే పొస‌గ‌దు. 1989లో కాంగ్రెస్‌లో ర‌త్నబోస్‌తో మొద‌లైన వివాదాలు ఇప్పటికీ ఆగ‌లేదు. టీడీపీలో 1994, 1999లో గ‌ద్దే రామ్మోహ‌న్‌కు దాస‌రి సోద‌రుల‌కు, 2004, 2009లో దాస‌రి సోద‌రుల‌కు, వల్లభనేని వంశీకి మ‌ధ్య పొస‌గ‌లేదు. ఇక 2014లో వంశీ గెలిచాక దాస‌రి సోద‌రుల‌తో తీవ్రమైన గ్యాప్ వ‌చ్చేసింది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో వల్లభనేని వంశీ గెలిచి వైసీపీ చెంత చేరిపోయారు. ఇప్పుడు వైసీపీలో వంశీ, దాస‌రి సోద‌రులు, యార్లగ‌డ్డ, దుట్టా ఇలా ర‌క‌ర‌కాల గ్రూపులు ఏర్పడిపోయాయి.

ఎక్కువగానే ప్రయారిటీ…..

వల్లభనేని వంశీ – జ‌గ‌న్ మ‌ధ్య పార్టీల‌కు అతీతంగానే సంబంధాలు ఉన్నాయి. 2012లోనే వంశీ విజ‌య‌వాడ‌లో జ‌గ‌న్‌ను బ‌హిరంగంగా ఆలింగనం చేసుకోవ‌డంతో పెద్ద ర‌గ‌డే జ‌రిగింది. ఆ త‌ర్వాత టీడీపీలోనే వల్లభనేని వంశీ విష‌యంలోనే అనేకానేక సందేహాలు కూడా ఏర్పడ్డాయి. చివ‌రకు వంశీ వైసీపీలోకి వెళ‌తార‌ని ఎన్ని రూమ‌ర్లు వ‌చ్చినా 2014లో టీడీపీ నుంచే పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో రెండోసారి గెలిచినా పార్టీ ఓడిపోవ‌డంతో వల్లభనేని వంశీ వైసీపీ చెంత చేరిపోయారు. కార‌ణం ఏదైనా వంశీకి జ‌గ‌న్ మాత్రం ఎందుకో ఎక్కువ ప్రయార్టీ ఇస్తూనే ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వంశీపై ఓడిన యార్లగ‌డ్డ వెంక‌ట్రావుకు డీసీసీబీ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చి ఆయ‌న్ను సైలెంట్ చేసేశారు.

యార్లగడ్డ సైలెంట్ అయి…..

కొద్ది రోజుల క్రితం గ‌న్నవ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో అమ్మఒడి కార్యక్రమంలో యార్లగ‌డ్డ వల్లభనేని వంశీపై కంప్లెంట్ చేసేందుకు ప్రయ‌త్నించినా కూడా జ‌గ‌న్ ఇద్దరి చేతులు క‌లిపి వంశీకి ప్రాధాన్యత ఉంటుంద‌ని చెప్పక‌నే చెప్పారు. యార్లగ‌డ్డకు ఐదేళ్ల పాటు డీసీసీబీ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చేలా ఒప్పందం కుద‌ర‌డంతోనే ఆయ‌న గ‌న్నవ‌రం వ‌దిలేసి విజ‌య‌వాడ‌లోనే క్యాంప్ కార్యాల‌యం ఏర్పాటు చేసుకున్నార‌ని అంటున్నారు. ఇక దాస‌రి సోద‌రుల్లో జై ర‌మేష్‌కు విజ‌య‌వాడ ఎంపీ సీటుపై హామీ వ‌చ్చింద‌నే అంటున్నారు. అందుక‌నే కొద్ది రోజులుగా యార్ల‌గ‌డ్డ, దాస‌రి సోద‌రులు ఇద్దరూ కూడా వల్లభనేని వంశీ విష‌యంలో సైలెంట్‌గానే ఉంటున్నారు.

దుట్టా కొంత….

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో వల్లభనేని వంశీపై గ‌రంగ‌రం లాడుతోన్న మ‌రో నేత దుట్టా రామ‌చంద్రరావు. 2014 ఎన్నిక‌ల్లో దుట్టా వంశీపై పోటీ చేసి ఓడిపోయారు. వంశీని ఇప్పుడు ఇబ్బంది పెట్టే విష‌యంలో యార్ల‌గ‌డ్డ, దాస‌రి సోద‌రులు సైలెంట్ అయిపోగా దుట్టా వ‌ర్గం మాత్రం గ్రామాల్లో అల‌జ‌డి చేస్తోంది. దుట్టా జ‌గ‌న్ తండ్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు. వీరిద్దరు క‌ర్నాక‌ట‌లో వైద్య విద్య అభ్యసించిన‌ప్పటి నుంచి మంచి స్నేహితులు. పైగా ఆయ‌న వివాద ర‌హితుడు. ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఈ చ‌నువుతోనే ఇటీవ‌ల దుట్టా జ‌గ‌న్‌ను క‌లిసి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వాల‌ని అడిగారు.

శత్రువులు సెట్ చేస్తూ….

అయితే జ‌గ‌న్ నుంచి స్పష్ట‌మైన హామీ రాక‌పోయినా.. దుట్టాకు ఎమ్మెల్సీ కాదు కాని.. రాష్ట్ర స్థాయిలో మంచి నామినేటెడ్ ప‌ద‌వి అయితే ఖచ్చితంగా వ‌స్తుంద‌ని పార్టీ రాష్ట్ర నేత‌ల నుంచి ఆయ‌న‌కు స‌మాచారం వ‌చ్చింది. దీనిపై ఆయ‌న అసంతృప్తిగా ఉన్నా చేసేదేమి లేదు. ఏదేమైనా జ‌గ‌న్‌ గ‌న్నవ‌రంలో వల్లభనేని వంశీకి సొంత పార్టీలో శ‌త్రువులుగా ఉన్నవారిని సెట్ చేస్తూ వంశీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో రూట్ మ‌రింత క్లీయ‌ర్ చేస్తున్నారు.

Tags:    

Similar News