వంశీతో మొదలవుతుందా?

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 23 మంది గెలిచారు. ఇంత ఘోర ఓటమిని ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ చవి చూడలేదు. అయితే తాను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని [more]

Update: 2019-10-26 03:30 GMT

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 23 మంది గెలిచారు. ఇంత ఘోర ఓటమిని ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ చవి చూడలేదు. అయితే తాను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని జగన్ అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పారు. ఎమ్మెల్యేలు తన పార్టీలోకి రావాలనుకుంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని జగన్ అప్పట్లో కుండ బద్దలు కొట్టేశారు. దీంతో తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు జారిపోరన్న ధీమాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యేలనే…..

ఇప్పటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను, ద్వితీయ శ్రేణి నేతలనే పార్టీలోకి చేర్చుకుంది. వారు కేవలం పార్టీకి రాజీనామా చేసి రావడంతో ఇప్పటి వరకూ ఎలాంటి సమస్య తలెత్తలేదు. తాజాగా ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ఇటీవల ఎన్నికల్లో అతి కొద్ది మెజారిటీతో గన్నవరం నుంచి గెలుపొందారు. ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

రాజీనామా చేసి…..

ఈ మేరకు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు కూడా. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే తనకు అభ్యంతరం లేదని జగన్ చెప్పారని తెలుస్తోంది. దీంతో వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో గెలుపొంది అధికార పార్టీలో ఉండాలన్నది వల్లభనేని వంశీ ఆలోచనగా ఉంది. జగన్ తో తన రాజకీయ భవిష‌్యత్ కు సంబంధించి అన్ని విషయాలు చర్చించారు.

వంశీ తర్వాత….

అయితే పార్టీ మారే విషయాన్ని దీపావళి తర్వాత చెబుతానని వల్లభనేని వంశీ అంటున్నారు. అమావాస్య ఉండటంతో ఇప్పుడు పార్టీ మార్పుపై ప్రకటన చేయలేనన్నారు. వల్లభనేని వంశీ నిజంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళితే టీడీపీ తొలి ఎమ్మెల్యే అవుతారు. వల్లభనేని వంశీ బాటలో మరికొందరు కూడా ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఇన్నాళ్లూ ఎమ్మెల్యేల జోలికి పోని వైసీపీ తాజాగా వల్లభనేని వంశీతో చేరికలను మొదలుపెట్టినట్లే కన్పిస్తుంది. మరికొంత మంది ఎమ్మెల్యేలు ఇదే బాటన పడితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందన్నది వైసీపీ ఆలోచన.

Tags:    

Similar News