వెలగపూడి ఇక ఇంటికే… ?

విశాఖ తూర్పులో హ్యాట్రిక్ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుని ఓడించడానికి వైసీపీ పక్కా స్కెచ్ వేసుకుని మరీ ముందుకు వెళ్తోంది అంటున్నారు. వెలగపూడి మీద గట్టి సామాజిక [more]

Update: 2021-07-19 00:30 GMT

విశాఖ తూర్పులో హ్యాట్రిక్ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుని ఓడించడానికి వైసీపీ పక్కా స్కెచ్ వేసుకుని మరీ ముందుకు వెళ్తోంది అంటున్నారు. వెలగపూడి మీద గట్టి సామాజిక అస్త్రమే ప్రయోగించారు. యాదవ సామాజికవర్గానికి చెందిన అక్రమాని విజయనిర్మలను 2019 ఎన్నికలలో చివరి క్షణాన అక్కడ పోటీకి దింపి వెలగపూడి రామకృష్ణ మెజారిటీని సగానికి సగం తగ్గించిన వైసీపీ ఈసారి మాజీని చేయడం ఖాయమని అంటున్నారు. విజయనిర్మలకు ఏకంగా అతి పెద్ద పదవిని ఇచ్చి జగన్ వెలగపూడి మీదకు వదిలారు. దాదాపుగా అయిదు జిల్లాలకు విస్తరించి ఉన్న వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ గా ఆమెను నియమించి అందరికీ ఆశ్చర్యపరచారు. ఈ పదవిలో రెండేళ్ల పాటు ఆమె కొనసాగనున్నారు.

భారీ మార్పుకే ..?

విశాఖ పాలనా రాజధాని కాబోతోంది. దాంతో పాటు విశాఖ మేయర్ పీఠాన్ని యాదవ సామాజిక వర్గానికి జగన్ ఇచ్చారు. ఇపుదు వీఎమ్మార్డీయే పదవిని కూడా అదే సామాజిక వర్గానికి ఇచ్చారు. ఆ విధంగా అతి పెద్ద సామాజికవర్గాన్ని జగన్ బాగానే దువ్వుతున్నారు. విశాఖ అంతటా ఈ సామాజికవర్గమే ఉంది. తూర్పులో అయితే నూటికి ఎనభై శాతం వారే ఉంటారు. కమ్మ సామాజిక వర్గానికి చెందినవెలగపూడి రామకృష్ణ వారిలో అనైక్యతను ఆసరాగా చేసుకుని ఇప్పటిదాకా గెలుస్తూ వస్తున్నారు. ఇపుడు మాత్రం అలా కాదు. జగన్ తూర్పునే టార్గెట్ చేశారు. మేయర్, వీఎమ్మార్డీయే పదవులు రెందూ కూడా తూర్పుకే ఇచ్చి అక్కడ భారీ రాజకీయ మార్పును ఆయన కోరుతున్నారు.

పవర్ ఫుల్ గా…?

భీమిలీ మునిసిపాలిటీకి వైఎస్ చైర్మన్ గా గతంలో పనిచేసిన అక్రమానికి పరిపాలనా అనుభవం ఉంది. పైగా మంచి వక్త. ఆమె దూకుడుగా రాజకీయం చేస్తారు. ఈ మధ్య జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో తూర్పులో మొత్తం పదిహేను వార్డులకు గానూ ఏకంగా పదకొండు వైసీపీకి గెలిపించి ఆమె రికార్డు బద్ధలు కొట్టారు. వెలగపూడి రామకృష్ణ హవాకు అలా బ్రేకులు వేశారు. దానికి బహుమానంగానే ఆమెకు ఈ సమున్నత పదవి వరించింది అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ పదవితో విజయనిర్మల జోరు చేస్తే విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ అసలు తట్టుకోలేరు అన్న మాట అయితే ఉంది.

కాబోయే ఎమ్మెల్యేగా…?

ఇప్పటికే క్యాడర్ అక్రమానిని కాబోయే ఎమ్మెల్యే అని కీర్తిస్తున్నారు. ఆమె పట్ల జగన్ కూడా పూర్తి నమ్మకం ఉంచుతున్నారు. ఆయన ఇచ్చిన టార్గెట్లను సక్సెస్ ఫుల్ గా ఛేదిస్తూ విజయనిర్మల కూడా పార్టీలో మంచి జనాదరణ పొందుతున్నారు. ఆమెకు విజయసాయిరెడ్డి అండదండలతో పాటు, జగన్ ఆశీస్సులు కూడా ఉన్నాయని వైసీపీ పెద్ద నాయకులు కూడా భావిస్తున్నారు. మరి విశాఖలో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేయడమే కాదు, మహిళలకు పదవులు ఇవ్వడం ద్వారా జగన్ తనదైన సోషల్ ఇంజనీరింగ్ తో టీడీపీ కంచుకోటలను చిత్తు చేస్తున్నారు. దాంతో వెలగపూడి రామకృష్ణ లాంటి వారు ఈసారి ఈ సమీకరణల దెబ్బకు బలి కాక తప్పదని అంటున్నారు. విశేషమేంటి అంటే విఎమ్మార్డీయే తొలి మహిళా చైర్ పర్సన్ గా విజయనిర్మలని ఎంపిక చేయడం. మొత్తానికి జగన్ మార్క్ పాలిట్రిక్స్ తో టీడీపీ బిగ్ ట్రబుల్ ఫేస్ చేస్తోంది.

Tags:    

Similar News