వెలంప‌ల్లి మ‌రీ ఇంత దిగ‌జారారా…? సొంత వ‌ర్గం ఆగ్రహం

మంత్రి అంటే.. ముందు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు పెంచుకోవాలి. అదే స‌మ‌యంలో త‌న సొంత సామాజిక వ‌ర్గంలోనూ ప‌ట్టు సొంతం చేసుకోవాలి. పార్టీలు ఏవైనా కావొచ్చు.. ఈ [more]

Update: 2020-11-30 00:30 GMT

మంత్రి అంటే.. ముందు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు పెంచుకోవాలి. అదే స‌మ‌యంలో త‌న సొంత సామాజిక వ‌ర్గంలోనూ ప‌ట్టు సొంతం చేసుకోవాలి. పార్టీలు ఏవైనా కావొచ్చు.. ఈ రెండు వ్యూహాల విష‌యంలోనూ నాయ‌కులు దూకుడుగా ఉంటే.. సానుభూతి కోణంలో రాజ‌కీయాలు చేస్తే.. భ‌విష్యత్తులో అటు రాజ‌కీయాల్లోనూ.. ఇటు కులంలోనూ తిరుగులేని హీరో అవ్వొచ్చు. గ‌తంలో జ‌రిగిన చ‌రిత్ర, ఇప్పుడు జ‌రుగుతున్న చ‌రిత్ర కూడా నాయ‌కుల విష‌యంలో ఇదే విష‌యాన్ని స్పష్టం చేస్తోంది. పార్టీలు ఏవైనా నాయ‌కుల వెంట ప్రజ‌లు న‌డ‌వ‌డానికి ఇదే హేతువుగా మారుతోంది. అయితే, దీనికి భిన్నంగా వ్యవ‌హ‌రించిన వారిని చ‌రిత్ర కూడా క్షమించ‌డం లేదు. ఫ‌లితంగా అలాంటి నాయ‌కులు చ‌రిత్రలో క‌లిసిపోతున్నారు. బ‌హుశా ఈ విష‌యం తెలిసి చేస్తున్నారో.. తెలియ‌క చేస్తున్నారో.. మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు కూడా దారి త‌ప్పుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

సొంత పార్టీలోనే…..

మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇక్కడ ఆయ‌న ప‌ప్పులు ఉడ‌క‌డం లేద‌ని కొన్నాళ్లుగా ప్రచారం ఉంది. ప్రజ‌ల్లో నిశ్శబ్ద విప్లవం ఏదో రాజుకుంటోంది. స‌రైన నాయ‌కుడు దొరికితే.. త‌క్షణ‌మే ఆయ‌న‌ను ప‌క్కన పెట్టాల‌ని ఇక్కడి ప్రజ‌లు భావిస్తున్నార‌నేది వైసీపీ న‌గ‌ర నేత‌ల్లో వినిపించే టాక్‌. ఆయ‌న మంత్రిగా ఉండి సొంత పార్టీలోనూ గ్రూపు రాజ‌కీయాలు చేస్తున్నార‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. మంత్రిగా ఉన్నా న‌గ‌ర రాజ‌కీయాల్లో ఆయ‌న ముద్ర శూన్యం. ఇదిలావుంటే.. ఇప్పుడు వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు సొంత సామాజిక వ‌ర్గం ఆర్య వైశ్యులు కూడా మంత్రిపై తీవ్ర విమ‌ర్శలు చేస్తున్నారు. ఒక‌ర‌కంగా ఆయ‌నపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీనికి కార‌ణం.. తాజాగా ఆర్య వైశ్యులు త‌మ స‌మ‌స్యల‌పై చ‌ర్చించుకునేందుకు విజ‌య‌వాడ‌లో భేటీ అయ్యారు.

వైశ్య సామాజికవర్గంలో…..

అయితే, పోలీసులు వీరిని అక్కడ నుంచి పంపేశారు. వైశ్య నాయ‌కులు బ‌స చేసిన హోట‌ల్ నుంచి కేవ‌లం గంట వ్యవ‌ధిలోనే వీరిని ఖాళీ చేయించారు. దీంతో వైశ్య నాయ‌కులు వెంట‌నే వెలంప‌ల్లి శ్రీనివాస‌రావుకి ఫోన్ కొట్టారు. త‌మ స‌మ‌స్యలు చ‌ర్చించుకునేందుకు భేటీ అయ్యామ‌ని.. పోలీసులు త‌మ‌ను బ‌య‌ట‌కు త‌రిమేస్తున్నార‌ని చెప్పుకొనేందుకు ప్రయ‌త్నించారు. కానీ, ఆయ‌న ఫోన్ ఎత్తలేదు. పైగా పోలీసుల‌ను పుర‌మాయించింది ఆయ‌నేన‌ని త‌ర్వాత నెమ్మదిగా వైశ్య నాయ‌కుల‌కు తెలిసింది. దీంతో ఈ విష‌యం తెలిసిన టీడీపీ నాయ‌కులు వెంట‌నే రంగంలోకి దిగారు.

టీడీపీ రంగంలోకి దిగి….

ముఖ్యంగా జ‌గ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాత‌య్య.. వెంట‌నే జిల్లా పార్టీ కార్యాల‌యాన్ని వైశ్య సామాజిక వ‌ర్గానికి కేటాయించారు. స‌భ అక్కడ చేసుకోవాల‌ని అనుమ‌తులు ఇచ్చేలా చేశారు. ఈ ఘ‌ట‌న‌తో అప్పటి వ‌ర‌కు వెలంప‌ల్లి శ్రీనివాస‌రావుపై ఉన్న సింప‌తీ వైశ్య సామాజిక వ‌ర్గంలో పోయింది. ఇప్పుడు కేవ‌లం విజ‌య‌వాడ‌, కృష్ణా జిల్లా ఆర్యవైశ్యుల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్యుల్లో ఈ విష‌యం పెద్ద చ‌ర్చనీయాంశం కావ‌డంతో పాటు వెల్లంప‌ల్లిపై ఆ వ‌ర్గం వారే విమ‌ర్శలు చేస్తోన్న ప‌రిస్థితి ఉంది.

ఆ తరహా క్రేజ్ ఏదీ?

గ‌తంలో వైశ్య సామాజిక వ‌ర్గం నుంచి మంత్రులుగా ఉన్న వారిలో రోశ‌య్య, ఆ త‌ర్వాత టీజీ. వెంక‌టేష్‌, టీడీపీ పాల‌న‌లో సిద్ధా రాఘ‌వ‌రావు సైతం వైశ్య సామాజిక వ‌ర్గానికి ప‌నులు చేసే విష‌యంలోనూ, వారికి ఇబ్బంది వ‌చ్చిన‌ప్పుడు ముందు నిల‌బ‌డేవారు. దీంతో వారికి ఆ సామాజిక వ‌ర్గంలో పార్టీల‌తో సంబంధం లేకుండా మంచి క్రేజ్ వ‌చ్చింది. అయితే వెలంప‌ల్లి శ్రీనివాస‌రావుకి మాత్రం ఆ త‌ర‌హా క్రేజ్ క‌న‌ప‌డ‌డం లేదు. ఇది ఆ సామాజిక వ‌ర్గం వారే చ‌ర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News