రజనీ రగడ ఆగదా?

రాజ‌కీయాల్లో ఎక్కడ త‌గ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వారే ప‌ది కాలాలు నిల‌బ‌డుతున్నార‌ని చ‌రిత్ర చెబుతోంది. అయితే ఈ సూత్రానికి భిన్నంగా అంతా నేనే.. అంతా నాదే [more]

Update: 2020-02-24 12:30 GMT

రాజ‌కీయాల్లో ఎక్కడ త‌గ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వారే ప‌ది కాలాలు నిల‌బ‌డుతున్నార‌ని చ‌రిత్ర చెబుతోంది. అయితే ఈ సూత్రానికి భిన్నంగా అంతా నేనే.. అంతా నాదే అనే సూత్రాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న అనేక మంది రాజ‌కీయ ర‌ణ‌రంగంలో చేష్టలుడిగి చ‌రిత్రలో క‌లిసిపోయారు. అయినా నేటి చాలా మంది నాయ‌కులు, నాయ‌కురాళ్లు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌క‌పోవ‌డం రాజ‌కీయంగా వారిచుట్టూ అనేక విమ‌ర్శల‌కు తావిస్తోంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ వ్యవ‌హారం కూడా ఇలానే ఉంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆరు నెలల ముందే చేరి…..

గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన విడ‌ద‌ల ర‌జ‌నీ ముందు టీడీపీ, త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చి చిల‌క‌లూరిపేట నుంచి విజ‌యం సాధించారు. అయితే ఈ విజ‌యం వెనుక ఓ వ్యక్తి త్యాగంతోపాటు అనేక మంది పార్టీ నేత‌ల కృషి, క‌ష్టం, తెలివి తేట‌లు, వ్యూహాలు ఉన్నాయి. కానీ విడ‌ద‌ల ర‌జ‌నీ మాత్రం ఆయా విష‌యాల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండానే త‌న స్వయం శ‌క్తితోనే గెలిచిన‌ట్టు ఫీల‌వుతున్నార‌నే భావ‌న క‌నిపిస్తోందని అంటున్నారు రాజ‌కీయ‌ ప‌రిశీల‌కులు.

అందరితోనూ వైరమే….

వాస్తవానికి ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం లేని విడ‌ద‌ల ర‌జ‌నీ గెలుపు వెన‌క పైన చెప్పుకున్న అంశాల‌కు తోడు జ‌గ‌న్ వేవ్ కూడా క‌లిసి వ‌చ్చింది. విడ‌ద‌ల ర‌జ‌నీ ఎమ్మెల్యే అయిన త‌ర్వాత ఆమె చాలా మందిని దూరం చేసుకుంటున్నారు. ముఖ్యంగా త‌నకు సీటు ఇచ్చేందుకు కార‌ణ‌మైన బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌తోను, త‌న‌ను గెలిపించేందుకు కృషి చేసిన అనుచ‌రుల‌ను కొన్ని సామాజిక వ‌ర్గాల‌ను కూడా ఆమె ప‌క్కన పెట్టారంటున్నారు. దీనికితోడు స్థానికంగా జిల్లాలోని ఎంపీలు, స‌హ‌చ‌ర‌ ఎమ్మెల్యేల‌తో క‌లిసి ముందుకు సాగాల్సిన విడ‌ద‌ల ర‌జ‌నీ దీనికి విరుద్ధంగా ప్రతి ఒక్కరితోనూ ర‌గ‌డ‌కు దిగుతున్నారు. తాడికొండ ఎమ్మెల్యే వుండ‌వ‌ల్లి శ్రీదేవి, న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు స‌హా అనేక మందితో విడ‌ద‌ల ర‌జ‌నీ రాజ‌కీయంగా వైరం పెట్టుకున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కుటుంబ జోక్యం కూడా…..

దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలో త‌న కుటుంబం జోక్యం పెరిగిపోయింద‌ని త‌న మ‌రిది గోపీనాథ్ దూకుడు పెరిగినా విడ‌ద‌ల ర‌జ‌నీ చూస్తూ ఊరుకుంటున్నార‌ని విమ‌ర్శలు వ‌స్తున్నాయి. తాజాగా ఎంపీ లావు విష‌యంలో జ‌రిగిన విష‌యాన్ని తెర‌మీద‌కి తెస్తున్నారు. మొత్తంగా చూస్తే.. అనేక మంది సాయం, కృషితో గెలిచిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఇప్పుడు మాత్రం త‌నే గ్రేట్ అనుకుంటున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ, ఇదే జిల్లాలో అనేక మంది ఇలానే వ్యవ‌హ‌రించి కింద ప‌డ్డవారు ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయంగా త‌ల పండిన నేత‌లే ఎన్నోసార్లు ఓడి గెలిచారు. అయితే ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం లేకుండా గాలి వాటంలో గెలిచిన విడ‌ద‌ల ర‌జ‌నీ నేల విడిచి చేస్తున్న సామును ప‌క్కన పెట్టి ప్రజ‌లు, నాయ‌కుల‌తో మ‌మేకం కావాల‌ని సూచిస్తున్నారు.

Tags:    

Similar News