`మిల్క్ మేన్‌`ల మ‌ధ్య పొలిటిక‌ల్ ఫైట్.. ఏం జ‌రుగుతుంది..?

గుంటూరు జిల్లాలో ప్ర‌ముఖ పాల వ్యాపారులుగా గుర్తింపు పొందిన వైసీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుత ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడుకు, టీడీపీ నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌కు [more]

Update: 2021-08-11 03:30 GMT

గుంటూరు జిల్లాలో ప్ర‌ముఖ పాల వ్యాపారులుగా గుర్తింపు పొందిన వైసీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుత ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడుకు, టీడీపీ నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌కు మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. ఇరువురు నేత‌లు ఒక‌రిపై ఒక‌రు విరుచుకుప‌డుతున్నారు. మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు. నువ్వు.. అవినీతి ప‌రుడ‌వంటే.. నువ్వే అవినీతి ప‌రుడ‌వంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. మ‌రి దీనికి రీజ‌నేంటి? అనేది ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి ఇద్ద‌రూ పాల వ్యాపారులే అయినా.. ఏనాడూ వ్యాపార ప‌రంగా ఇరువురు మ‌ధ్య విభేదాలు చోటు చేసుకోలేదు.

ఇద్దరి మధ్య….?

అదే స‌మ‌యంలో రాజ‌కీయాల్లో ఉన్న‌ప్ప‌టికీ.. ఇద్ద‌రివీ వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాలు కావ‌డంతో .. రాజ‌కీయంగా కూడా ఇద్ద‌రి మ‌ధ్య శ‌త్రుత్వం లేదు. అయినా కూడా ఇద్ద‌రూ ఇప్పుడు.. మాట‌ల దాడులు చేసుకుంటూ.. ఒక‌రినొక‌రు విమ‌ర్శించుకుంటున్నారు. బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు 'తిరుమ‌ల' బ్రాండ్ పేరుతో పాల వ్యాపారం చేయ‌గా దానిని అమ్మేశారు. ఇక ఇప్పుడు ఆయ‌న వ‌ల్ల‌భ బ్రాండ్‌కు అధినేత‌గా ఉన్నారు. ఇక‌, త‌న తండ్రి వార‌స‌త్వంగా వ‌చ్చిన సంగం డెయిరీకి చైర్మ‌న్‌గా ధూళిపాళ్ల కొన‌సాగుతున్నారు. అయితే.. ఇటీవ‌ల ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అమూల్ నేప‌థ్యంలో ధూళిపాళ్ల‌కు చెందిన సంగం డెయిరీపై ప్ర‌భుత్వం కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే.

సంబంధం లేకపోయినా?

దీంతో న‌రేంద్ర కొన్నిరోజులు జైల్లో కూడా గ‌డ‌పాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం త‌న‌ను కావాల‌నే జైలుకు పంపింద‌ని.. రాజ‌కీయ కుట్ర ఉంద‌ని.. న‌రేంద్ర ఆరోపిస్తున్నారు. త‌న డైయిరీకి సంబంధించిన అన్ని లావాదేవీలు స‌జావుగానే ఉన్నాయ‌ని.. ఎక్క‌డా అవినీతికి పాల్ప‌డ‌లేద‌నేది ఆయ‌న వాద‌న‌. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం కంపెనీ యాక్టు మేర‌కు సంగం డెయిరీ న‌డ‌వ‌డం లేద‌ని పేర్కొంటూ.. న‌రేంద్ర‌పై చ‌ర్య‌ల‌కు దిగింది. ఈ వివాదానికి.. బొల్లా బ్ర‌హ్మ‌నాయుడుకు ఎలాంటి సంబంధం లేదు. ప్ర‌భుత్వం వ‌ర్సెస్ ధూళిపాళ్ల మ‌ధ్య జ‌రుగుతున్న వివాదంలో బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు వేలు పెట్టారు.

నిజాయితీ ఉంటే?

న‌రేంద్ర కుమార్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. స‌హ‌కార‌ప‌రిధిలో ఉన్న డెయిరీని కంపెనీ చ‌ట్టంలోకి మార్చుకుని డ‌బ్బులు దోచుకుంటున్నార‌ని బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు ఆరోపించారు. సంగంకు న‌రేంద్ర ఛైర్మెన్ గా ఉంటూ ధూళ్లిపాళ్ల ట్ర‌స్టుకు త‌న భార్య‌ను ఛైర్మెన్ గా ఉంచార‌ని, రైతుల సొమ్మును ట్ర‌స్టుకు దారి మ‌ళ్లించి అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని బొల్లా బ్ర‌హ్మ‌నాయుడువ్యాఖ్యానించారు. పాల ఉత్ప‌త్తిదారుల సొమ్ముల‌ను ధూళ్లిపాళ్ల ట్ర‌స్టులోకి ఎలా మ‌ళ్లిస్తార‌ని బొల్లా ప్ర‌శ్నిస్తున్నారు. న‌రేంద్ర‌కు నిజాయితీ ఉంటే సంగం డైరీని కంపెనీ చ‌ట్టం నుంచి స‌హ‌కార సంఘం ప‌రిధిలోకి తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు.

అదే సామాజికవర్గంతో….?

దీనికి ప్ర‌తిగా.. న‌రేంద్ర కూడా ఘాటుగానే కౌంట‌ర్ ఇస్తున్నారు. ఎందుకూ ప‌నికిరాని భూముల‌ను జ‌గ‌న‌న్న ఇళ్ల కోసం ప్ర‌భుత్వానికి అమ్మి కోట్లు గ‌డించారంటూ… న‌రేంద్ర బొల్లా బ్ర‌హ్మ‌నాయుడును దుయ్య‌బ‌ట్టారు. ఇలా.. త‌న‌కు సంబంధం లేని.. త‌న ప్ర‌మేయం లేని.. వివాదంలో బొల్లా క‌లుగ‌జేసుకోవ‌డం చూస్తే.. దీనివెనుక వైసీపీ వ్యూహం ఏదైనా ఉంద‌నే అంటున్నారు. క‌మ్మ వ‌ర్గానికి చెందిన న‌రేంద్ర‌ను అదే క‌మ్మ వ‌ర్గానికి చెందిన బొల్లా బ్ర‌హ్మ‌నాయుడుతో టార్గెట్ చేయిస్తున్నారు. పైగా ఇద్ద‌రూ పాల వ్యాపారంలోనే ఉన్నారు. ఇది కూడా న‌రేంద్ర‌ను బొల్లాతో టార్గెట్ చేయించ‌డానికి మ‌రో కార‌ణం.

Tags:    

Similar News