ఉత్తరాంధ్రను ఉద్ధరించింది ఎవరు?

ఉత్తరాంధ్ర అంటే వెనకబడిన ప్రాంతమని ఏకంగా కేంద్రం ఏడేళ్ల క్రితం నియమించిన శ్రీ కృష్ణ కమిషన్ చెప్పింది. వారు వీరూ చెప్పడం ఎందుకు బట్టతల అలా బ్రహ్మాండంగా [more]

Update: 2021-09-13 03:30 GMT

ఉత్తరాంధ్ర అంటే వెనకబడిన ప్రాంతమని ఏకంగా కేంద్రం ఏడేళ్ల క్రితం నియమించిన శ్రీ కృష్ణ కమిషన్ చెప్పింది. వారు వీరూ చెప్పడం ఎందుకు బట్టతల అలా బ్రహ్మాండంగా కనిపిస్తూంటే అని ఆ ప్రాంతానికి చెందిన మేధావులు కూడా అంటారు. ఇక ఈ మూడు జిల్లాలకు ఏమైనా వైభోగం దక్కిందా? అభివృద్ధి అన్నది చూశాయా? అంటే లేదు అన్న మాట అయితే కచ్చితంగా చెప్పాలి. ఈ మూడు జిల్లాలలో విశాఖ సిటీలో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు, ప్రైవేట్ పరిశ్రమల వల్ల కాస్తా ప్రగతి బాటన ఉన్నట్లు కనిపించినా విశాఖ రూరల్ జిల్లాతో నుంచి మొదలు పెడితే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పూర్తిగా అట్టడుగునే ఉన్నాయని చెప్పాలి.

ఎవరిది తప్పు….?

ఈ మూడు జిల్లాల్లో గత ఏడున్నర దశాబ్దాలుగా మంత్రులు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు. ఎంతో మంది గట్టి నాయకులు కూడా ఇక్కడ నుంచి గెలిచారు. ఇక కేంద్ర క్యాబినెట్ లో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారు ఇక్కడ నుంచి ఉన్నారు. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా ఏలినా కూడా ఉత్తరాంధ్ర ఎందుకు వెనకబడిపోయింది అన్నదే ప్రశ్న. చెప్పాలంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అందరూ ఉత్తరంధ్రకు అందరూ కలసి ఉత్త చేతులే చూపించారు. అధికారంలో ఉన్నపుడు ఒకలా విపక్షంలో ఉన్నపుడు మరోలా కధలు చెబుతూనే పుణ్య కాలం గడిపేశారు. అందువల్ల ఎవరు ఎవరిని అనుకున్నా కూడా జనం మాత్రం మొత్తం ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలదే తప్పు అని డిసైడ్ చేసేశారు.

సవాళ్ళు చేసుకున్నా…?

ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇన్నాళ్ళకు గుర్తుకు వచ్చిందా అని ఎవరికి వారు ప్రశ్నించుకునే స్థితి ఉంది. తెలుగుదేశం ఈ రాష్ట్రాన్ని రెండు దశాబ్దాలకు పైగా ఏలింది. ఆ పార్టీ విశాఖను ఓటు బ్యాంక్ గా మార్చుకుంది అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ అంటున్నారు. నిజమే టీడీపీ అంటే ఈ ప్రాంత వాసులకు బాగా ఇష్టం. అందువల్ల ప్రతీ ఎన్నికలోనూ ఆ పార్టీకే ఓట్లు వేసేవారు. తమ ప్రాంతానికి వచ్చిన వలస నాయకులను సైతం ఆదరించి చట్ట సభలకు దారి చూపించారు. కానీ టీడీపీ ఉత్తరాంధ్రకు సాలిడ్ గా ఏం చేసింది అంటే ఈ రోజుకీ తమ్ముళ్ళు చెప్పెలేరు. అంతే కాదు ఈ ప్రాంతానికి చందమామను తీసుకువస్తామని ఆశలు పెడుతూనే ఈ రోజుకూ పబ్బం గడుపుకుంటున్నారు అనే అంటారు. ఇపుడు తాపీగా మీ సత్తా మా సత్తా చూసుకుందామంటూ వైసీపీకి సవాల్ చేయడమే తమ్ముళ్లకు మిగిలింది అనుకోవాలి.

మార్పు రాదా…?

టీడీపీతో విసిగిపోయే జనాలు 2019 ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ వైసీపీకి ఏకపక్ష విజయాన్ని అందించారు. కానీ పరిస్థితి ఏమీ మారలేదు. తాము రాజకీయాన్ని మార్చుకున్నా అభివృద్ధి రేఖ అన్నది లేకపోవడం ఈ ప్రాంతీయులను బాధిస్తోంది. సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు లేవు, పరిశ్రమలు కొత్తవి లేవు, ఇప్పటికే ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా పడకేశాయి. మరి ఈ పరిస్థితులలో టీడీపీ కంటే మేమే ఉత్తరాంధ్రను అభివృద్ధి చేశామని వైసీపీ నేతలు చెప్పుకున్నా జనాలు నమ్మడం లేదు. మొత్తానికి చూసుకుంటే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని ఫక్తు రాజకీయమే చేస్తున్నాయి తప్ప మరేమీ కాదు అన్నది సగటి జీవుల నిఖార్సు అయిన మాట.

Tags:    

Similar News