‘‘చట్టం ముందు అందరూ సమానులే’’ ఇదో అందమైన సినీ డైలాగ్. పాలకుల నోటి నుంచి తరచూ జాలువారే మాట ఇది. వ్యక్తులు ఎంత గొప్ప వారైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇలాంటి గంభీరమైన వ్యాఖ్యలు కూడా పాలకుల నుంచి వినపడుతుంటాయి. కానీ ఆచరణలో ఇది ఎంతవరకూ వాస్తవం? అధికారులు తు.చ. తప్పకుండా నిబంధనలను పాటిస్తున్నారా? నిష్షక్షపాతంగా వ్యవహరిస్తున్నారా? త్రికరణ శుద్ధితో వ్యవహరిస్తున్నారా? అన్న ప్రశ్నలకు సరైన సమాధానం లభించదు. సగటు పౌరుడు ఎవరిని అడిగినా ఈ విషయాన్ని ఎలాంటి శషభిషలు లేకుండా చెబుతాడు. ఆచరణలో చట్టం ముందు అందరూ సమానులే కాదు. కొందరు అత్యధిక సమానులు. వారిని చట్టాలు ఏమీ చేయలేవు. చట్టం నుంచి తప్పించుకునేందుకు అనేక వెసులుబాట్లు లభిస్తాయి. ఉపశమనాలు ఉంటాయి. చట్టపరమైన ప్రక్రియ చాలా సుదీర్ఘంగా, నిమ్మకు నీరెత్తనిట్లు నత్తనడకన సాగుతుంది. రోజులు గడిచే కొద్దీ విషయం జనం మర్చి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరికొందరి విషయంలో చట్టం చాలా వేగంగా స్పందిస్తుంది. చకచకా పావులు కదుపుతుంది. ఆఘమేఘాలపై హడావిడి చేస్తుంది. సరైన దర్యాప్తు ప్రక్రియ చేపట్టకుండానే, నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ ముందే దోషులుగా నిర్ధారిస్తూ జనం దృష్టిలో అపరాధులన్న భావన కల్గిస్తుంది.
దిగజారుడు రాజకీయాలు......
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి విషయంలో జరుగుతోంది ఇదే. తన మానాన తాను పని చేసుకుంటూ, పలు వ్యాపార సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఒక మహిళను రోడ్డుపైకి లాగే ప్రయత్నం జరుగుతుండటం దురదృష్టకరం. తన ప్రమేయం లేని వ్యవహారాల్లోకి ఆమెను లాగుతూ బురద జల్లేందుకు కొందరు అధికారులు చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఆడుతున్న నాటకాన్నిచూస్తే అసహ్యం వేయకమానదు. మరీ ఇంతగా దిగజారారా? అన్న అనుమానం కలగక మానదు. అనూహ్యంగా ఒక మహిళపై ఏకంగా నిందితురాలన్న ముద్ర వేయడం దిగజారుతున్న విలువలకు దర్పణం పడుతోంది. వై.ఎస్. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ఎలాంటి చడీచప్పుడు లేకుండా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారతిని నిందితురాలిగా చేర్చడం ఇందుకు నిదర్శనం. ఇప్పటిదాకా సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాల్లో కానీ, ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదుల్లో కానీ ఎక్కడా భారతి ప్రస్తావన లేనేలేదు. కానీ భారతి (రఘురామ్ సిమెంట్స్) వ్యవహారంలో ఈడీ ఆమెను ఏకంగా నిందితురాలిగా పేర్కొనడం ఆశ్చర్యం కల్గిస్తోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం లోని మూడో సెక్షన్ ప్రకారం ఆమె నేరానికి పాల్పడ్డారని, ఈ మేరకు సమన్లు జారీ చేసి చట్ట ప్రకరాం శిక్షించాలని న్యాయస్థానాన్ని ఈడీ అభ్యర్థించింది. ప్రత్యేక కోర్టు హోదా గల సీబీఐ న్యాయస్థానంలో ఈ మేరకు అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది.
వారిద్దరి పాత్రే కారణమా?
ఈ వ్యవహారంలో ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు బలమైన ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే ఇద్దరు ఉన్నతాధికారులు ఉద్దేశ్యపూర్వకంగా, వేధించే ప్రక్రియలో భాగంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది. వారి వేధింపులపై 2017 ఫిబ్రవరిలో అంటే దాదాపు 17 నెలలక్రితం వైసీపీ అధినేత జగన్ ప్రధానికి లేఖరాసినా ఫలితం లేకపోయింది. ఈ అధికారులిద్దరికీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సన్నిహిత సంబంధాలున్నాయన్న వాదన ఉంది. గాంధీ అనే అధికారి బదిలీ అయినా రిలీవ్ కాలేదు. అంతేకాక మూడుసార్లు పొడిగింపును తెచ్చుకున్నారు. తనకున్న పలుకుబడితోనే ఈ పొడిగింపు సాధ్యమైంది. కొందరు తెలుగుదేశం నాయకులతో ఈ ఇద్దరు నిత్యం అందుబాటులో ఉంటారు. సంప్రదింపులు జరుపుతుంటారు. ఈడీ కేసుల విషయంలో వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్న వాదనను తోసిపుచ్చడం కష్టమే. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మాజీ కేంద్ర మంత్రితో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది.
ఏడేళ్లు పట్టిందా?
ఒక్కసారి జగన్ కేసుల పూర్వాపరాల్లోకి వెళితే..... వాస్తవం బోధపడుతుంది. 2011 ఆగస్టు 10న జగన్ పై కేసులు ప్రారంభమయ్యాయి. అంటే ఇప్పటికి ఏడేళ్లయింది. ఇంతకాలం గుర్తుకురాని కేసులు, నిబంధనల ఉల్లంఘన, మనీలాండరింగ్ చట్టాలు ఒక్కసారిగా ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చాయి? అసలు వైఎస్ భారతి ఏనాడూ క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనలేదే? భర్తను అరెస్ట్ చేసి 16 నెలలు బెయిల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినా ఏనాడూ ఆమె నోరు మెదపలేదే? మామ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు కాని, ఆ తర్వత కానీ ప్రభుత్వం నుంచి లబ్దిపొందిన దాఖలాలు లేవు. గత ఏడేళ్లలో తాను సారథ్యం వహిస్తున్న వ్యాపార సంస్థల్లో చిన్న పాటి లొసుగులను ఏ అధికారీ గుర్తించలేదు. ఈడీ అటాచ్ మెంట్లు, నోటీసులపై ఏనాడూ ఆమె ప్రతిస్పందించలేదు. చట్టపరమైన ప్రక్రియలో జోక్యం చేసుకోలేదు. అంతేకాక తనకు సంబంధించినంత వరకూ దర్యాప్తు ప్రక్రియకు పూర్తిగా సహకరించారు. ఇంత పారదర్శకంగా ఉన్నప్పుడు, పనిగట్టుకుని కేసులు నమోదు చేయడం వెనక అసూయ, ధ్వేషం తప్ప మరో కారణం కన్పించడం లేదు.
న్యాయపరీక్షకు నిలబడతాయా?
జగన్ పై నమోదయిన కేసుల్లోనే పట్టులేదని, అవి న్యాయపరీక్షకు నిలబడవని ఎందరో న్యాయనిపుణులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం భారతిపై ఈడీ పెట్టిన కేసు కూడా ఇలాంటిదేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన వ్యాపారసంస్థల్లో డైరెక్టర్ పదవి నుంచి జగన్ తప్పుకున్న తర్వాత భారతి ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారని, అందువల్ల ఆమె ప్రమేయం ఉందన్న ఈడీ వాదన నిలబడటం కష్టమే. ఒక డైరెక్టర్ గా కంపెనీల కార్యకలాపాల్లో క్రియాశాల పాత్ర పోషించడాన్ని ఏ చట్టమూ తప్పుపట్టలేదు. బాధ్యతల్లో భాగంగా నిధుల బదిలీ, ఆస్తి అప్పుల పట్టిక, చెక్ లపై సంతకాలు చేయడం నేరం ఎలా అవుతుందో ఈడీకే తెలియాలి. కంపెనీ డైరెక్టర్, ప్రధాన వాటాదారుగా అత్యధిక వేతనం పొందడం చట్ట విరుద్ధమేమీ కాదు. సిమెంట్ పరిశ్రమపై భారతికి ఎలాంటి అవగాహన లేదన్న ఈడీ వాదన అసంబద్ధం. ఒక ప్రధాన వ్యాపార సంస్థ అనుబంధ వ్యాపారాలను నిర్వహించడం తప్పేమీ కాదు. ఈ ప్రాధమిక సూత్రాలు సామాన్యుడికే తెలుస్తాయి. అలాంటిది ఈడీకి తెలయదని ఎలా అనుకోవాలి? ఇదంులో రాజకీయం ఉంది కాబట్టే తెలియదనుకోవాలి.
-ఎడిటోరియల్ డెస్క్