జగన్ కన్ను హోదా పైనేనా?

హోదా అంటే జగన్ కి మోజే. దాన్ని ఆయన అసలు వదిలిపెట్టలేదు అంటున్నారు వైసీపీ నేతలు. అవును అయిదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ ప్రత్యేక హోదా గురించి [more]

Update: 2019-11-27 11:00 GMT

హోదా అంటే జగన్ కి మోజే. దాన్ని ఆయన అసలు వదిలిపెట్టలేదు అంటున్నారు వైసీపీ నేతలు. అవును అయిదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ ప్రత్యేక హోదా గురించి బాగానే పోరాటాలు చేశారు. యువభేరీలు నిర్వహించారు. ధర్నాలు, దీక్షలు, బందులూ కూడా చేశారు. సరే హోదా రాకపోయినా జగన్ కి సీఎం హోదా వచ్చింది. ఇక ఆరు నెలల ముఖ్యమంత్రిగా జగన్ హోదా గురించి సమయం వచ్చినపుడల్లా కేంద్రానికి వినిపిస్తున్నారు. ఇక ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి గట్టిగా నినదించమని ఆదేశిస్తున్నారు కూడా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇపుడు జగన్ కి మరో హోదా మీద చూపు పడిందని అంటున్నారు. అదే తన రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబు ప్రతిపక్ష హోదా మీద దృష్టి మళ్ళిందని అంటున్నారు. ప్రత్యేక హోదా తేవడం సంగతి ఎలా ఉన్నా బాబు హోదాను ఊడగొట్టడమే టార్గెట్ గా జగన్ పదునైన వ్యూహాలనే రూపొందించారని అంటున్నారు.

జగన్ దయేనా…?

అసెంబ్లీ తొలి సమావేశాలోనే జగన్ చంద్రబాబును ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. మేము తలచుకుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని కూడా అన్నారు మేము మీలా ఎమ్మెల్యేలను మా వైపు ఫిరాయించమని ప్రలోభపెట్టమని కూడా జగన్ అన్నారు, లేకపోతే మీకు ప్రతిపక్ష స్థానం కూడా ఉండదు అని జగన్ తెగేసి చెప్పారు. ఇది నిజమే కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయాలు అలా ఉన్నాయి. అధికార పార్టీ వైపుగానే నేతలు క్యూ కడుతున్నారు. గెలిచినదే పార్టీ. అందులోనే రాజకీయం చేయాలన్న కొత్త కల్చర్ పుట్టుకొచ్చింది. బాబుకి ఈ నిజాలు తెలియనివి కావు. కానీ అందరిలాగానే ఆయన కూడా జగన్ మాటలు నమ్మారు, జగన్ మాట మీద ఉంటారు కాబట్టి తన పదవికి వచ్చిన ముప్పు లేదని, హోదా అయిదేళ్ళ పాటు పదిలంగా ఉంటుందని కూడా బాబు ధీమాగా ఉన్నారు. అయితే బాబు గత ఆరు నెలలుగా ఒంటికాలి మీద లేవడంతో పాటు, అయిన దానికి కాని దానికీ జగన్ మీద విరుచుకుపడడంతో పాటు, వ్యక్తిగత దూషణలకు దిగుతూండడంతో జగన్ సైతం ఓ విధంగా ఆగ్రహంగా ఉన్నారని టాక్. మరో వైపు జగన్, జైలూ కలుపుతూ చేస్తున్న హాట్ కామెంట్స్ కూడా ఆయన్ని బాధిస్తున్నాయి. దీంతో జగన్ ఆలోచనలు కూడా మారుతున్నాయని అంటున్నారు.

హోదా హుళక్కేనా…?

దీంతో జగన్ పట్టుదలగా బాబు హోదా మీదనే పనిచేస్తున్నారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాబుకు ప్రతిపక్ష హోదా ఉండరాదన్నది జగన్ ఆలోచన‌గా కనిపిస్తోంది. దీంతో ఆయన ఉప ఎన్నికలు జరిగినా జరగకపోయినా కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను లాగేయాలనుకుంటున్నారుట. ఇప్పటికే వల్లభనేని వంశీ బయటకు వెళ్ళడంతో 22 వరకూ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలలో కనీసంగా అయిదుగురుని లాగేస్తే బాబు హోదా పోయినట్లే. దీంతో జగన్ బాబుని టార్గెట్ చేశారని అంటున్నారు. ఉప ఎన్నికలు వస్తే గెలిపించుకోవచ్చు కానీ ముందు బాబుకు మాత్రం హోదా ఉండరాదన్నది జగన్ పంతంగా కనిపిస్తోందని చెబుతున్నారు. మరి బాబు కూడా తన హోదా గురించి గట్టిగానే ఉన్నారని టాక్. ఇది ప్రజలు ఇచ్చిన గౌరవం. జగన్ దయతో నాకు హోదా రాలేదు. అందువల్ల లాగేసుకోవడానికి ఆయన ఎవరు అంటున్నారుట బాబు. తనకు హోదా ఎలా కాపాడుకోవాలో తెలుసు అంటున్నారుట. మొత్తానికి ఏపీలో అధికార ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా వదిలేసి ప్రతిపక్ష హోదా మీద యుధ్ధం చేస్తున్నట్లుగా సీన్ చూస్తే కనిపిస్తోంది. మరి ఇందులో విజేతలు ఎవరు అవుతారో, రాజకీయంగా ఎవరిది పై చేయిగా ఉంటుందో చూడాల్సిందే.

Tags:    

Similar News