యడ్డీని వదులుకుంటారా….?

ఏడు పదులు వయసు దాటిన యడ్యూరప్పను భారతీయ జనతా పార్టీ తన నిబంధనలను సయితం పక్కన పెట్టి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, [more]

Update: 2019-02-12 17:30 GMT

ఏడు పదులు వయసు దాటిన యడ్యూరప్పను భారతీయ జనతా పార్టీ తన నిబంధనలను సయితం పక్కన పెట్టి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, యడ్యూరప్పకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న క్రేజ్ కూడా ఆయన పట్ల పార్టీ అధిష్టానం సానుకూలతగా నిన్న మొన్నటి వరకూ ఉంది. ఇటీవల జరిగిన విధానసభ ఎన్నికల్లోనూ అతి పెద్ద పార్టీగా అవతరించడంలో యడ్యూరప్ప పాత్ర కీలకమనే చెప్పాలి. మోదీ ఇమేజ్ తరుగుతున్న వేళ కూడా కర్ణాటకలో వందకు పైగా స్థానాలను సాధించి యడ్డీ తన పట్టును నిరూపించుకున్నారు.

గత ఎన్నికల్లో……

అందుకే యడ్డీ అంటే కేంద్రనాయకత్వానికి కూడా గురికుదిరింది. వచ్చే లోక్ సభ ఎన్నికలను కూడా యడ్యూరప్ప నేతృత్వంలోనే ఎదుర్కొనాలని నిర్ణయించింది. ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినా ఆయనపై ఉన్న నమ్మకం కేంద్రనాయకత్వానికి చెక్కు చెదరలేదు. పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా యడ్యూరప్పకే అప్పగించారు. అత్యధిక పార్లమెంటు స్థానాల్లో గెలవాలంటే యడ్యూరప్ప నాయకత్వమే మేలన్న అభిప్రాయంలో కేంద్రనాయకత్వం నిన్న మొన్నటి వరకూ ఉంది. కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు యడ్డీ నాయకత్వంపై అనుమానాలు తలెత్తేలా చేశాయి.

తాజా పరిణామాలతో…..

ఆడియో టేపుల్లో ఇరుక్కున్న యడ్యూరప్ప తాను వ్యక్తిగతంగానే కాకుండా పార్టీని కూడా లోక్ సభ ఎన్నికల వేళ డ్యామేజ్ చేశారన్న అభిప్రాయంలో కేంద్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారాన్ని వెంటనే చెపట్టాలన్న తపనతో తప్పటడుగులు వేసిన యడ్యూరప్పపై కేంద్ర నాయకత్వం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రధాని మోదీ సయితం యడ్యూరప్ప వ్యవహారాన్ని ఒకింత సీరియస్ గానే తీసుకున్నట్లు కనపడుతోంది. అందుకే ఆయన కర్ణాటక పర్యటనలో కూడా యడ్యూరప్పను కనీసం పలుకరించకపోవడంపై రాష్ట్ర పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది.

కేంద్ర నాయకత్వం సీరియస్….

కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సంకీర్ణ సర్కారును కూలదోయాలన్న తొందరలో యడ్యూరప్ప జాతీయ స్థాయిలో పార్టీ పరువును మంట కలిగారన్న అభిప్రాయంలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఆయనను లోక్ సభ ఎన్నికలకు పక్కనపెట్టాలన్న యోచనలో కూడా కమలనాధులు ఉన్నట్లు సమాచారం. అమిత్ షా కూడా ఈ ఆడియో టేపుల కలకలంపై సీరియస్ గానే ఉన్నట్లు చెబుతున్నారు. మరి యడ్డీని పక్కన పెడితే లోక్ సభ ఎన్నికల వేళ పార్టీని నడిపించేది ఎవరన్న ప్రశ్న పార్టీలో తలెత్తుతోంది. మరి కొద్ది రోజుల్లోనే యడ్డీపై ఒక నిర్ణయానికి అధిష్టానం వచ్చే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News