అక్కరకు రాని ఆర్డినెన్స్…?

సాధారణంగా ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థతో ఎందుకు తగాదా అనుకుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈవిషయంలో తాడోపేడో తేల్చుకోవాలనుకుంది. ఎన్నికల కమిషనర్ ను నియమించేసింది. ఈ సమయంలో ఎందుకు [more]

Update: 2020-04-14 15:30 GMT

సాధారణంగా ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థతో ఎందుకు తగాదా అనుకుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈవిషయంలో తాడోపేడో తేల్చుకోవాలనుకుంది. ఎన్నికల కమిషనర్ ను నియమించేసింది. ఈ సమయంలో ఎందుకు ఇంత హడావిడి? అని అంతా ఆశ్చర్యపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ నియామకం చేపట్టినట్లుగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాత కమిషనర్ రమేశ్ కుమార్ తో వివాదం సంగతి పక్కనపెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టైమింగ్ పైనే రాజకీయ వర్గాలు తెల్లబోయాయి. ముఖ్యమంత్రి ఉద్దేశాన్ని స్పష్టంగా తెలుసుకున్న తర్వాతనే పంచాయతీరాజ్, న్యాయశాఖలు ఆఘమేఘాల మీద చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. కేంద్రం మరో 19 రోజులపాటు లాక్ డౌన్ పొడిగించడంతో ఉద్దేశం నెరవేరేలా కనిపించడం లేదని పార్టీశ్రేణులు వాపోతున్నాయి. స్థానిక ఎన్నికల ప్రక్రియను మే నెలాఖరులోపుగానే పూర్తి చేయాలనే లక్ష్యంతో కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం జరిగిందనేది పార్టీ శ్రేణుల విశ్వాసం. తాను బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలోపుగానే ఎన్నికలు పెట్టి పంచాయతీ బోర్డు మొదలు సెక్రటేరియట్ వరకూ పరిపాలనలో వైసీపీ ముద్ర కనిపించేలా చూడాలనేది ముఖ్యమంత్రి యోచనగా చెబుతున్నారు. అంటే మే నెల లోపు మొత్తం అంతా వైసీపీ మయం కావాల్సి ఉంటుంది.

మూడు అంశాలే …

ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వైసీపీ మూడు కీలకమైన విషయాలపై దృష్టి పెట్టింది. అటు ప్రజలను, ఇటు యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు యత్నించింది. ఒకటి రాష్ట్రంలో కరోనా తీవ్రత లేదని తొలి నుంచీ చెబుతోంది. ఈ కారణంతోనే ఎన్నికలను వాయిదా వేసిన కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. ఏకగ్రీవాలతో కలిసి తమకు 80శాతం పైచిలుకు స్థానాలు వస్తాయని ఆ పార్టీ విశ్వసిస్తోంది. అందువల్ల ఎన్నికల కమిషనర్ చర్యల కారణంగా తమకు పెద్ద నష్టం వాటిల్లిందని భావించింది. వాయిదా వేయడాన్ని ఇష్టపడలేదు. తాజాగా లాక్ డౌన్ తర్వాత వెంటనే ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆర్డినెన్స్ తెచ్చారు. రాష్ట్రంలోని 676 మండలాలకు గాను కేవలం రెడ్, గ్రీన్ ప్రాంతాలు 80 మండలాలకు మాత్రమే పరిమితమయ్యాయని ప్రభుత్వం లెక్క వేసింది. ఇతర రాష్ట్రాలు జిల్లాలు , పట్టణాల వారీగా జోన్లను నిర్ధరిస్తున్నాయి. మండలాల స్థాయికి దీనిని కుదించడం ద్వారా ప్రభావిత ప్రాంతాలను మినహాయించి మిగిలిన చోట్ల ఎన్నికలకు ఆటంకం లేకుండా చేయాలని ప్రభుత్వ యోచన. ఇందుకు అవసరమైన కసరత్తు ఇప్పటికే పూర్తి చేసింది. కొత్త కమిషనర్ సైతం తొలి సమీక్ష నిర్వహించి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వానిది, ఎన్నికల కమిషన్ ది ఒకటే మాటగా కనిపిస్తోంది.

జోక్యం చేసుకోగలదా..?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై హైకోర్టులో అనేక రకాల వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అన్నిటి సారం ఒకటే. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం పాత కమిషనర్ ను తొలగించిందనేది అభియోగం. కొత్త కమిషనర్ నియామకంలో నిబంధనలు పక్కన పెట్టేశారనేది ఆరోపణ. ఆర్డినెన్స్ ను ఎవరూ తప్పుపట్టడం లేదు. దాని ఉద్దేశం ఏమైనప్పటికీ ప్రభుత్వానికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉన్న విషయాన్ని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి. అయితే ఆర్డినెన్స్ ఆధారంగా జీవో తెచ్చి కొత్త కమిషనర్ నియామకం చేపట్టడాన్ని తప్పుపడుతున్నారు. ఒకసారి పదవిలో నియమించిన తర్వాత అతని నియామక ప్రయోజనాలకు విరుద్దంగా తొలగించడం సాధ్యం కాదనేది వాదన. ఆర్డినెన్స్ సైతం భవిష్యత్ నియామకాలకు వర్తిస్తుంది తప్పితే ప్రస్తుతం పదవిలో ఉన్నవారికి వర్తించదని న్యాయనిపుణులు కొందరు పేర్కొంటున్నారు. ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోగలుగుతుందా? అనేది ధర్మ సందేహం. పాత కమిషనర్ స్థానంలో కొత్త కమిషనర్ నియామకం జరిగి పోయింది. బాధ్యతలు చేపట్టారు. అతనిని తొలగించడం కూడా సాధ్యం కాదు. అతనికి సైతం రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది. పాత కమిషనర్ వర్సెస్ కొత్త కమిషనర్ రాజ్యాంగ బద్ధ రక్షణలు పరస్పర విరుద్దంగా న్యాయ సమీక్షకే పరీక్ష పెడుతున్నాయి.

వ్రతం చెడ్డా…?

కరోనా వంటి ఆపత్సమయంలోనూ సాహసించి అత్యవసర చట్టం చేసి మరీ ఎన్నికల కమిషనర్ ను తెచ్చుకున్నారు. స్థానిక ఎన్నికల తంతు ముగించేయాలని భావించారు. ఇప్పుడు జాతీయస్థాయిలో మరోసారి లాక్ డౌన్ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మేనెల మూడో తేదీ వరకూ అడుగు ముందుకు వేసే అవకాశం లేదు. రెడ్ జోన్లు, ఆరంజ్ జోన్లకు లాక్ డౌన్ ను పరిమితం చేసి మిగిలిన ప్రాంతాలలో సాధారణ పరిస్థితులను పునరుద్దరిస్తారని భావించారు. కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ప్రకటన చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కానీ అది ఫలించలేదు. పైపెచ్చు ఇప్పుడు న్యాయస్థానంలో కేసు దాఖలైంది. నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల ప్రక్రియ మొదలైతే న్యాయస్థానం ఆటంకాలు పెద్దగా ఉండవు. కానీ లాక్ డౌన్ పీరియడ్ లో ఎన్నికల నోటిఫికేషన్ సాధ్యం కాదు. ఈలోపు ఎన్నికల కమిషనర్ నియామకం రాజ్యాంగబద్దతపై హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. మొత్తమ్మీద వ్రతం చెడ్డా ఫలం దక్కదేమోననే అనుమానాలు నెలకొన్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News