ఈయన అందుకే అలాగా…?

కర్ణాటకలో ఆపరేషన్ కమల్ చాపకింద నీరులా సాగుతుందా? గతంలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించి విఫలమైన యడ్యూరప్ప ఈసారి నెమ్మదిగా పని ముగించేయాలని చూస్తున్నారా? ఎవరూ ఊహించని విధంగా [more]

Update: 2019-07-05 17:30 GMT

కర్ణాటకలో ఆపరేషన్ కమల్ చాపకింద నీరులా సాగుతుందా? గతంలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించి విఫలమైన యడ్యూరప్ప ఈసారి నెమ్మదిగా పని ముగించేయాలని చూస్తున్నారా? ఎవరూ ఊహించని విధంగా ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న యడ్యూరప్ప ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలన్న యోచనలో ఉన్నదన్నది మాత్రం వాస్తవం. అయితే ఆయనకు టైం కలసి రావడం లేదు.

మరోసారి ఫెయిలవుతామనా….?

అన్నీ అనుకూలించినా స్పీకర్ చేతిలో మరోసారి భంగపాటు ఎదురవుతుందన్న భయం యడ్యూరప్పను వెంటాడుతుంది. శాసనసభ్యుల రాజీనామాలు చేసినా దానిని ఆమోదించాల్సింది స్పీకర్ రమేష్ కుమార్. ఆయన ఆమోదించకపోతే అనుకున్న టార్గెట్ యడ్యూరప్ప రీచ్ కాలేరు. ఇప్పటికీ ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు ఆనంద్ సింగ్, రమేష్ జార్ఖిహోళిలు రాజీనామా సమర్పించినా అవి ఆమోదం పొందలేదు. అందుకే శాసనసభ్యుల రాజీనామాలను గవర్నర్ కు కూడా పంపారంటున్నారు. స్పీకర్ పరిధిలో ఉన్న రాజీనామా అంశాన్ని గవర్నర్ తమ వారైనా ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అనుమానిస్తున్న కాంగ్రెస్…..

మరోవైపు ఆనంద్ సింగ్ రాజీనామా మాత్రమే తన వద్దకు వచ్చిందని స్పీకర్ చెబుతుండటం విశేషం. రమేష్ జార్ఖిహోళి రాజీనామా తన వద్దకు చేరలేదంటున్నారు. వీరిద్దరితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారని తొలుత విన్పించినా తర్వాత ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. కానీ కాంగ్రెస్ అగ్రనేతలు సిద్ధరామయ్య, పరమేశ్వర్ లు మాత్రం యడ్డీ తీరును అనుమానిస్తున్నారు. యడ్యూరప్ప గత కొద్దిరోజులుగా ఎటువంటి హడావిడి చేయకపోవడమే వారి అనుమానాలకు కారణమని చెబుతున్నారు.

హడావిడి లేకుండా…..

యడ్యూరప్ప వాస్తవానికి రెండు రోజుల క్రితమే రాష్ట్ర పర్యటన చేయాల్సి ఉంది. యడ్యూరప్ప పార్టీ నేతలతో కలసి కరవు ప్రాంతాలైన హసాన్, మాండ్య జిల్లాల్లో పర్యటిస్తారని షెడ్యూల్ ను కూడా పార్టీ విడుదల చేసింది. అయితే ఈ పర్యటనను యడ్యూరప్ప అర్థాంతరంగా తన కరవు జిల్లాల పర్యటన రద్దు చేసుకోవడంపై కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పటిలాగా యడ్యూరప్ప హడావిడి చేయకపోవడంతో కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు ఎప్పటికప్పుడు తమకు అనుమానమున్న ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News