సైకిల్ కార్ఖానాకు తాళం ప‌డిందా? త‌ప్పుకొంటున్న యువ నేత‌లు

“ టీడీపీ ఒక పార్టీ కాదు.. ఒక పొలిటిక‌ల్ ప‌రిశ్రమ (ఇండ‌స్ట్రీ). ఇక్కడ నాయ‌కులు త‌యారు కాబ‌డ‌తారు. పార్టీ పుట్టిన మూడు ద‌శాబ్దాల్లో ఎంతో మంది నాయ‌కులు [more]

Update: 2020-03-29 06:30 GMT

“ టీడీపీ ఒక పార్టీ కాదు.. ఒక పొలిటిక‌ల్ ప‌రిశ్రమ (ఇండ‌స్ట్రీ). ఇక్కడ నాయ‌కులు త‌యారు కాబ‌డ‌తారు. పార్టీ పుట్టిన మూడు ద‌శాబ్దాల్లో ఎంతో మంది నాయ‌కులు ఇక్కడ రాజ‌కీయాలు నేర్చుకున్నారు. ఎంతో మంది రాజ‌కీయంగా ప‌ద‌వులు అనుభ‌వించారు. ఎంతో మంది జెండా ప‌ట్టుకున్న స్థాయి నుంచి ప‌ద‌వులు ద‌క్కించుకునే స్థాయికి ఎదిగారు. టీడీపీ ఒక రాజ‌కీయ కార్ఖానా !“- గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మయంలో పార్టీ నుంచి అవంతి శ్రీనివాస్‌, పండుల ర‌వీంద్ర వంటివారు వైసీపీలోకి జంప్ చేసిన స‌మయంలో టీడీపీ అధినేతగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి! నిజ‌మే ఆయ‌న అన్న మాట‌ల్లో వాస్తవం ఉంది. టీడీపీలోనే జెండా ప‌ట్టుకుని రాజ‌కీయాలు నేర్చుకున్నవారు చాలా మంది ఉన్నారు.

ఎంతో మంది ఎదిగినా…

దివంగ‌త కోడెల శివ‌ప్రసాద‌రావు నుంచి ప్రస్తుతం జీవించి ఉన్న వ‌డ్డే శోభ‌నాద్రీశ్వర‌రావు వ‌ర‌కు కూడా రాజ‌కీయాలు నేర్చుకున్నది టీడీపీలోనే. ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు వంటి యువ నాయ‌కులు కూడా టీడీపీలోనే రాజ‌కీయాలు నేర్చుకుని ఎదిగారు. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి ? ఇప్పుడు టీడీపీ రాజ‌కీయ కార్ఖానాలో ఎంత‌మంది రాజ‌కీయాలు నేర్చుకుంటున్నారు ? ఎంత‌మంది పార్టీపై విశ్వస‌నీయ‌త‌ను ప్రద‌ర్శిస్తున్నారు ? ఎంత‌మంది అధినేత చంద్రబాబుపై న‌మ్మకం చూపిస్తు న్నారు ? అంటే.. ప్రశ్నలే త‌ప్ప స‌మాధానం క‌నిపించ‌డం లేదు. జ‌రిగిన ప‌రిణామాలు ప‌క్కన పెడితే యువ నాయ‌కులుగా ఉన్నవారు ఇప్పుడు పార్టీలోనే ఉంటున్నారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నగా మారింది.

అనుబంధం ఉన్న వారే…..

పార్టీ పెట్టిన‌ప్పటి నుంచి టీడీపీతోనూ, చంద్రబాబుతోనూ ఎంతో అనుబంధం ఉన్న క‌ర‌ణం బ‌ల‌రాం లాంటి వాళ్లకే పార్టీపై న‌మ్మకం లేదు. క‌ర‌ణం లాంటి వాళ్లు సైతం త‌న రాజ‌కీయ భ‌విష్యత్తు కోసం వైసీపీలో చేరిపోయారు. నిజానికి చంద్రబాబు ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యానికి ముందు, త‌ర్వాత యువ నేత‌ల విష‌యంలో మార్పు చూపించారు. యువ‌త‌కు పార్టీ ప‌ద‌వుల్లో 33 శాతం ఇస్తామ‌ని ప్రక‌టించారు. అయితే ఇది జ‌రిగిన రెండు రోజుల్లోనే తెలుగు యువ‌త అధ్యక్షుడు గా ఉన్న దేవినేని అవినాష్‌ అనూహ్యంగా వైసీపీ బాట ప‌ట్టారు. ఇక‌, ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి, బాబు త‌న‌యుడు లోకేష్ యువ స‌ద‌స్సును ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువ నాయ‌కుల‌కు ఆహ్వానం పంపారు.

యువ నేతలు రెడీ అవుతుండటంతో….

ఈ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్ కూడా వెళ్లారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న ఇప్పుడు వైసీపీలో చేరిపోయారు. అదేవిధంగా గాదె వెంక‌ట రెడ్డి కుమారుడు మ‌ధుసూద‌న‌రెడ్డి కూడా టీడీపీని వీడారు. ఇక‌, త్వర‌లోనే మ‌రో న‌లుగురు యువ‌నేత‌లు సైతం పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. అంతెందుకు పార్టీకి ఎంతో న‌మ్మక‌మైన ముర‌ళీమోహ‌న్ కోడ‌లు రూపాదేవి సైతం పార్టీలో భ‌విష్యత్తు ఉంటుంద‌న్న న‌మ్మకం లేకే రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో టీడీపీ రాజ‌కీయ కార్ఖానా ఏమైన‌ట్టు? యువ‌త‌కు భ‌రోసా ఇవ్వడంలో ఏం చేస్తున్నట్టు? అనే ప్రశ్నలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అస‌లు బాబు యువ‌త‌లో త‌న పట్ల.. పార్టీ ప‌ట్ల న‌మ్మకం క‌లిగించ‌డంలో మ‌ళ్లీ స‌క్సెస్ అవుతారేమో ? చూడాలి.

Tags:    

Similar News