ధట్ ఈజ్ భారతి..!!

ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని అంటారు. ఈ నానుడి ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి విషయంలో [more]

Update: 2019-05-29 02:30 GMT

ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని అంటారు. ఈ నానుడి ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి విషయంలో నిజమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ నాయకత్వాన్ని నమ్మి ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఇందుకు ప్రధాన కారణం ఆయన తన పదేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కువ సమయం ప్రజల్లోనే ఉండటం. రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందన్నా అక్కడ వారి పక్షాన నిలబడటం. రాష్ట్రం కోసం దీక్షలు, ధర్నాలు చేయడం. ఆయన ఈ పదేళ్లలో కుటుంబంతో గడిపిన సమయం కంటే పార్టీ నేతలు, ప్రజలతో ఉన్న సమయమే ఎక్కువ. ఈ నేపథ్యంలో జగన్ విజయం వెనుక ఆయన సతీమణి శ్రమ ఎంతో ఉంది. తన భర్త నిత్యం ప్రజల్లోనే ఉంటున్నా, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినా, తన భర్తను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నా ఆమె మనోనిబ్బరంతో ధైర్యంగా ఉంటూ తన భర్తకు అండగా ఉన్నారు. ఆమె ధైర్యంగా ఉంటూ భర్తకు అండగా ఉండబట్టే ఇవాళ జగన్ ముఖ్యమంత్రి అవుతున్నారు. భారతి ముఖ్యమంత్రి భార్య అవుతున్నారు.

కుటుంబ.. వ్యాపార బాధ్యతలు సమర్థంగా…

పదేళ్ల క్రితం వరకు కూడా జగన్ బెంగళూరులో కుటుంబంతో కలిసి మంచి జీవితం గడిపారు. వ్యాపారాలు, కుటుంబం మినహా ఆయనకు ఎటువంటి ప్రాధాన్యతలు లేవు. కుటుంబానికి జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తూ భార్యాపిల్లలతో ఎక్కువ సమయం గడిపేవారు. అయితే, 2009లో రాజకీయాల్లోకి వచ్చి కడప ఎంపీగా పోటీ చేసిన ఆయన వైఎస్సార్ మరణం తర్వాత పూర్తిగా ప్రజల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఓదార్పు యాత్రతో ఆయన కొన్ని నెలల పాటు కుటుంబాన్ని వదిలి ప్రజల్లో గడిపారు. దీంతో మొదటిసారి ఆయన భార్య వైఎస్ భారతి జగన్ వ్యాపార బాధ్యతలను స్వీకరించారు. అప్పటివరకు జగన్ ఛైర్మన్ గా ఉన్న సాక్షి గ్రూప్ బాధ్యతలు భారతి తీసుకున్నారు. జగన్ ఇతర వ్యాపారాలను కూడా ఆమె తలకెత్తుకొని సమర్థంగా నడిపించారు. జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూన్నా ఆమె ఆయనకు పూర్తి సహకారం అందించారు.

ధైర్యం అంటూ… భర్తగా అండగా..

ఇక, వైఎస్ జగన్ పై కేసులు నమోదైనప్పుడు ఆమె ఎంతో మానసిక క్షోభ అనుభవించినా ధైర్యంగా జగన్ కు అండగా ఉన్నారు. జగన్ 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు ఆ బాధను దిగమింగుకుంటూనే ఆమె ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు వ్యాపారాలను చూసుకున్నారు. ఈ పదేళ్ల కాలంలో జగన్ వ్యాపారాలను, కుటుంబ బాధ్యతలను పూర్తిగా భారతిపైనే పెట్టారు. ఆయన ఈ సమయంలో కుటుంబంతో గడిపిన సమయం కంటే ప్రజలతో ఉన్న సమయమే ఎక్కువ. ముఖ్యంగా పాదయాత్ర జరిగిన 14 నెలలు ఆయన పూర్తిగా ప్రజల్లోనే ఉన్నారు. ఈ సమయంలోనూ భారతి ధైర్యంగా భర్తకు సహకరించారు. ఈ దశలో జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సమయంలో ఆమె ఎంత మానసిక క్షోభ అనుభవించారో ఆమె మనస్సుకే తెలుసు. ఇక, ఎన్నికల సమయంలోనూ భారతి భర్త తరపున పులివెందుల నియోజకవర్గంలో పెద్దఎత్తున ప్రచారం చేశారు. జిల్లాలో కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది. తన భర్తపై ఉన్న నమ్మకం, ఆయన లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించడం, భర్త కష్టసుఖాల్లో పాల్పంచుకొని ధైర్యంగా ఉంటూ జగన్ కు అండగా ఉన్నారు. జగన్ రాజకీయంగా విజయవంతం అవ్వడంలో భార్యగా భారతి పాత్ర చాలా కీలకం.

Tags:    

Similar News