జ‌గ‌న్ రుణం తీర్చేసుకుందాం.. బీజేపీ నేత‌ల మాట ఇదే

అవును! ఇప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దల మ‌న‌సుల్లో ఇదే ఉంది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ విష‌యంలో `రుణం తీర్చేసుకుందాం` అనే అంటున్నారు. రెండు అత్యంత [more]

Update: 2020-06-26 06:30 GMT

అవును! ఇప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దల మ‌న‌సుల్లో ఇదే ఉంది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ విష‌యంలో 'రుణం తీర్చేసుకుందాం' అనే అంటున్నారు. రెండు అత్యంత కీల‌క విష‌యాల‌ను జ‌గ‌న్ కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టారు. దీనిలో ఒక‌టి ప్రత్యేక హోదా. రెండు శాస‌న మండ‌లి ర‌ద్దు. ఈ రెండు విష‌యాలు కూడా జ‌గ‌న్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. అయితే, మొదటి ప్రత్యేక హోదా విష‌యంలో బీజేపీ విధానం మార్చుకునే అవ‌కాశం లేదు. ఇక‌, రెండోది మండ‌లి ర‌ద్దు విష‌యం. దీనిని పార్లమెంటులో పెట్టి ఆమోదించుకోవాల్సి ఉంది. అయితే.. ఇప్పటి వ‌రకు కూడా కేంద్రం దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు.

కీలక సమయంలో…..

కానీ, ఇప్పుడు అత్యంత కీల‌క స‌మ‌యంలో జ‌గ‌న్ త‌మ‌కు అండ‌గా నిల‌వ‌డంతో బీజేపీ పెద్దలు జ‌గ‌న్‌ను కూడా సంతృప్తి ప‌ర‌చాల‌ని నిర్ణయించుకున్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌ల చైనా విష‌యంలో మోడీ ప్రభుత్వం అనుస‌రించిన వైఖ‌రిపై అన్ని ప్రతిప‌క్షాలూ విమ‌ర్శలు గుప్పిస్తున్నాయి. న‌రేంద్ర మోడీ ప్రభుత్వం ఏదో దాస్తోంద‌ని, ఇది ప్రజ‌ల‌కు హానిక‌ర‌మ‌ని కాంగ్రెస్ స‌హా ఎన్సీపీ, శివ‌సేన పార్టీలు విమ‌ర్శలు చేస్తున్నాయి. అదే స‌మ‌యంలో జాతీయ స్థాయిలో మంచి ప‌ట్టున్న నాయ‌కులు మౌనం పాటిస్తున్నారు. అంటే.. మోడీ ప్రభుత్వం ఏదో దాస్తోంద‌నే భావ‌న వీరి మౌనం కార‌ణంగా తెలుస్తోంద‌ని జాతీయ మీడియాకూడా భావిస్తోంది. ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో స్పందించారు జ‌గ‌న్‌. ఇది విమ‌ర్శలు చేసుకునే స‌మ‌యం కాద‌న్నారు.

బలం కూడా పెరగడంతో….

అంతేకాదు, దేశంలోని ప్రతి ఒక్కరూ మోడీ ప్రభుత్వానికి అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ విష‌యంలో వైసీపీ పార్టీగా, ఏపీ సీఎంగా తాను అన్ని విధాలా మోడీని స‌పోర్టు చేస్తున్నట్టు అధికారికంగా ప్రక‌టించారు. ఇదే విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించారు. పూర్తిగా మ‌ద్దతు ప్ర‌క‌టించ‌లేదు. దీంతో బీజేపీ నేత‌ల‌కు ఇప్పుడు జ‌గ‌న్‌పై అపార‌మైన అభిమానం ఏర్పడింది. ఈ క్లిష్ట స‌మ‌యంలో ఏ ఒక్కరు త‌మ‌కు అండ‌గా నిలిచినా చాల‌నుకుంటున్న స‌మ‌యంలో జ‌గ‌న్ వారికి తురుపుముక్కగా మారారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్‌కు ఇప్పుడు ఆరుగురు రాజ్యస‌భ స‌భ్యులు కూడా ఉన్నారు.

మండలి రద్దును…..

పెద్దల స‌భ‌లోనూ త‌మ నిర్ణయాలకు జ‌గ‌న్ మ‌ద్దతిస్తారు. ఈ నేప‌థ్యంలో అంతో ఇంతో జ‌గ‌న్ కోరుతున్న వాటిపైనా దృష్టిపెట్టాల‌ని, ఆర్థికంగా భారం కానివాటికి జై కొట్టాల‌ని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే త్వర‌లో జ‌రిగే పార్లమెంటు స‌మావేశాల్లో మండ‌లి ర‌ద్దుపై బిల్లు పెట్టడ‌మో.. లేదా దీనికి ముందుగానే ఆర్డినెన్స్ రూపంలో ర‌ద్దు చేయ‌డ‌మో చేయాల‌ని అనుకుంటున్నట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మొత్తానికి జ‌గ‌న్ ఏ ఢిల్లీ నేత‌ల‌(కాంగ్రెస్‌) వ‌ల్ల అవ‌మానం ఎదుర్కొన్నా.. అదే ఢిల్లీ నేత‌ల‌(బీజేపీ)తో శ‌భాష్ అనిపించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News