ఈ ఇద్దరి గేమ్ .. యమ డేంజర్

నాయకుడంటే ఒక ఆశ. సరైన నాయకత్వం దేశానికి, రాష్ట్రానికి , రానున్న తరాలకు దిశానిర్దేశం చేస్తుంది. అదే నాయకత్వం విధ్వంసకరమైతే అంధకార బంధురమే. స్వార్థ ప్రయోజనాలు, విచ్ఛిన్నతే [more]

Update: 2021-02-14 15:30 GMT

నాయకుడంటే ఒక ఆశ. సరైన నాయకత్వం దేశానికి, రాష్ట్రానికి , రానున్న తరాలకు దిశానిర్దేశం చేస్తుంది. అదే నాయకత్వం విధ్వంసకరమైతే అంధకార బంధురమే. స్వార్థ ప్రయోజనాలు, విచ్ఛిన్నతే అజెండాగా నాయకత్వం పావులు కదిపితే భవిష్యత్ భయానకమే. ప్రజాస్వామ్యంలో నాయకత్వమంటే ఒన్ మేన్ షో కాదు. నాయకుడు , ప్రతిపక్ష నాయకుడు ఉండే తీరతారు. ఒకరిపై ఒకరు చెక్ పాయింట్. అధికారం ఒకరిచేతిలో ఉంటే , ప్రతిపక్షం మరొకరి చేతిలో ఉంటుంది. నిర్ణయాలు చేసే అధికారం పాలకులకు ఉంటే దారి తప్పకుండా పర్యవేక్షించే నియంత్రణ ప్రతిపక్షం చేతిలో ఉంటుంది. కానీ రెండింటి అజెండా వక్రమార్గం పడితే ఆ దేశానికి, రాష్ట్రానికి పురోగతి శూన్యం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దుస్థితి అదే. అధికార ,ప్రతిపక్ష నేతల చేతిలో వ్యవస్థీకృత విద్వేష అజెండా కార్యరూపంలో కనిపిస్తోంది. కనుచూపు మేరలో ఏపీకి ఉజ్జ్వల భవిష్యత్ కానరావడం లేదు.

బలమా, బలహీనతా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి బలమా? బలహీనతా? అన్న ప్రశ్న తాజాగా ఉదయిస్తోంది. మోడీ కంటే సీనియర్ గా , జాతీయ నేతగా తనను తాను అభివర్ణించుకుంటారు చంద్రబాబు నాయుడు, అప్రతిహత విజయంతో మరో ముప్ఫై ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా తానే ఉంటానంటారు జగన్ మోహన్ రెడ్డి. కానీ వారిరువురూ తమ వాదనలకు బలం చేకూర్చేవిధంగా వ్యవహరించడం లేదు. అందుకు పూర్తి విరుద్ధంగా తమ అజెండాను అమలు చేస్తున్నారు. దాంతో గతంలో ఎన్నడూ లేని బలహీన రాజకీయ ముఖచిత్రం ఏపీలో ఆవిష్కృతమవుతోంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కేంద్రం అణిగిమణిగి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ను తమిళనాడు తరహాలోనే తమ చేతిలోని ఒక సామంత పాలనగా చూస్తోంది కేంద్రం. తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ వాటిని రాష్ట్రంపై రుద్దుతోంది. ముఖ్యమంత్రి జీ హుజూర్ అంటుంటే, చంద్రబాబు పరోక్షంగా జై కొడుతున్నారు. ఇద్దరూ తమ రాజకీయ, వ్యక్తిగత అజెండాతో ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కిమ్మనడం లేదు. పోరు సలపడం లేదు. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్, ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వంటి విషయాల్లో ఈ ఇద్దరు నేతలు చేతులెత్తేశారు. ఇరుపార్టీలు మొక్కుబడి ప్రకటనలు చేస్తున్నాయి. ఉద్యమం ,ఆందోళన, కేంద్ర ప్రభుత్వాన్ని స్తంభింపచేయడం, పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించడం వంటి ప్రజాస్వామిక విధానాలవైపు కన్నెత్తి చూడటం లేదు. పేరు గొప్ప నేతలిద్దరూ కేంద్రం ముందు సాగిలపడటమే ఈ దురవస్థకు ప్రధాన కారణం.

ఈ చిచ్చు చల్లారదు…

అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకే వేదికమీదకు వచ్చేందుకు అధికార, ప్రతిపక్ష నాయకులు సిద్దంగా ఉండాలి. సైద్దాంతికంగా విభేదించుకున్నప్పటికీ సమస్య వచ్చినప్పుడు ఒకటి కావాలి. ప్రజాజీవితంలో ఎవరి అధికారమూ శాశ్వతము కాదు. వారు చేసిన పనులే చిరస్మరణీయంగా మిగులుతాయి. కేంద్రం ఉదాసీనత, నిర్లక్ష్యం, నిరంకుశత్వాల కారణంగా రాష్ట్రం అథోగతి పాలవుతోంది. ఈ స్థితిలో జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబులు నిజంగానే దార్శనికులైన నేతలైతే ఒకే వేదిక మీదకు వచ్చి కేంద్రాన్ని హెచ్చరించాలి. అందుకు అనువైన సమయం వచ్చింది. ఆంధ్రుల హక్కు- విశాఖ ఉక్కును ప్రయివేటుకు విక్రయించదలిస్తే సహించేది లేదని ఒకే ఒక్క హెచ్చరిక సంయుక్తంగా పంపగలిగితే కేంద్రమే దిగివస్తుంది. ఆంధ్రాకి అన్యాయం జరిగితే అందరూ ఒకటవుతారన్న భయం పుడుతుంది. కానీ ఈ ఇరువురు నేతలు అందుకు సిద్దంగా లేరు. చంద్రబాబు నాయుడి హయాంలోనే ఈ ప్రయివేటీకరణకు బీజాలు పడ్డాయని ఒక పార్టీ ఆరోపిస్తుంటే , జగన్ మోహన్ రెడ్డి అంగీకారంతోనే అంతా అయిపోయిందని మరో పార్టీ చెబుతోంది. దోషిగా చూపాల్సిన కేంద్రాన్ని కాపాడుతూ ఈ రెండు పార్టీలు, అధినేతలు కీచులాడుకోవడంతోనే సరిపోతోంది. దీనిని బట్టి చూస్తే వీరిద్దరికీ రాష్ట్ర్ర ప్రయోజనాల కంటే తమ వ్యక్తిగత రాజకీయ అజెండానే ముఖ్యమన్న విషయం తేటతెల్లమైపోతోంది. కేంద్రంతో , బీజేపీతో సంబంధాలు కాపాడుకోవడమే ఇప్పుడు వీరిద్దరి ప్రధానకర్తవ్యంగా మారింది. దూరమైన కమలాన్ని కౌగిలించుకోవడానికి ఎన్ని అడుగులు వేసేందుకైనా సిద్ధమవుతున్నారు చంద్రబాబు, చేరువగా మసలుతున్న కేంద్రాన్ని దూరం కాకుండా చూసుకునేందుకు రాష్ట్రం ప్రయోజనాలను సైతం త్యాగం చేసేందుకైనా సై అంటున్నారు జగన్ మోహన్ రెడ్డి. వీరిరువురి బలహీనతలు తెలిసిపోవడంతో కేంద్రం చక్రం తిప్పుతోంది. రాష్ట్రంతో సయ్యాటలాడుతోంది.

కులాల కుమ్ములాట…

గడచిన ఏడు సంవత్సరాలుగా నవ్యాంధ్ర కులాల రొంపిలో పూర్తిగా కూరుకుపోయింది. ఎన్టీయార్, వైఎస్సార్ వారసత్వాన్ని క్లెయిం చేసుకునే చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డిలు ఇందుకు పరోక్షంగా కారణభూతులన్న విమర్శలు తోసిపుచ్చలేనివి. ఎన్టీయార్, రాజశేఖరరెడ్డి కూడా ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారే . అయినా వారిని ప్రజలంతా ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. వారు కుల,మత పక్షపాతాలకు అతీతులుగానే పాలనలో ముద్ర వేసుకున్నారు. అటువంటి వారి వారసులుగా ఈ పీఠాలను అధిష్ఠించిన చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిలు తమపై కుల ముద్ర పడకుండా చూసుకోవడంలో విఫలమవుతున్నారు. ఎన్టీయార్, వై.ఎస్ లు ఏ ప్రవర్తనతో , ఏ విధానాలతో ఈ రొంపి లో దిగకుండా తప్పించుకోగలిగారో వీరికి తెలియదు. తెలిసినా దానిని అనుసరించడానికి, ఆచరించడానికి సిద్దంగా లేరు. ఫలితంగానే రాష్ట్రంలో పంచాయతీ పదవులు మొదలు రాజ్యసభ సభ్యత్వాల వరకూ కులాల లెక్కలే తేలుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉంటే ఒక అగ్రవర్ణ సామాజిక వర్గ రాజ్యంగా, వైసీపీ అధికారంలో మరో అగ్రవర్ణ సామాజిక వర్గ రాజ్యంగా ప్రజలు భావిస్తున్నారు. ప్రజలిచ్చిన అధికారంగా కాకుండా కులాల పెత్తనంగా చర్చించుకోవాల్సి రావడమే ప్రజాస్వామ్యానికి తలవంపు. ఎన్టీయార్ పేరు చెబితే కేంద్రానికి వణుకు పుట్టేది. జాతీయంగా విపక్షాలన్నిటినీ ఒకే వేదిక మీదకు తెచ్చిన మహానేత ఆయన. కాంగ్రెసు వంటి జాతీయ పార్టీలో ఉన్నప్పటికీ స్వతంత్ర వ్యవహార శైలితో పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు వై.ఎస్. కేంద్ర విధానాలకు భిన్నంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటివి అమలు చేశారు. రాష్ట్ర విభజనపై ఒక్క అడుగు ముందుకు వేసేందుకు వై.ఎస్. అధికారంలో ఉన్నంత కాలం కేంద్రం సాహసించలేదు. అదీ నాయకత్వ పటిమ. మరిప్పుడు వారి వారసులు విభజనచట్టంలోని హామీలనే అమలు చేయించుకోలేనంతటి దుర్భరస్థితిలో ఉండటాన్నేమనాలి. వీరి నాయకత్వ సత్తా ప్రశ్నార్థకమని ప్రజలు విమర్శిస్తే తప్పేంటి?

తెలంగాణకూ సమస్యే…

తమిళనాట అధికారాన్ని కేంద్రం పరోక్షంగా శాసిస్తోంది. కర్ణాటకలో తానే పవర్ లో ఉంది. హేతుబద్దంగాని వామపక్ష భావజాలం తో కూడిన కేరళ సర్కారు చేసే గడబిడను ఎలాగూ పట్టించుకోదు. ఈ స్థితిలో సమంజసమైన డిమాండ్లతో రాష్ట్ర ప్రయోజనాలు, దక్షిణాది ప్రయోజనాల కోసం పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పై ఉంది. కానీ ఏపీలో అధికార, ప్రతిపక్షాల బలహీన నాయకత్వం ఇతర రాష్ట్రాలకూ వెరపు కలిగిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి సమర్థుడైనప్పటికీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కేంద్రం ముందు సాగిలపడటంతో తాను కూడా తలఒగ్గక తప్పని అనివార్యత ఏర్పడుతోంది. విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ చట్టాలు, రైల్వే ప్రయివేటీకరణ వంటి విషయాలన్నిటికీ ఏపీ ఒకే చెప్పేస్తోంది. తెలంగాణ కొంచెం ప్రతిఘటించి తర్వాత తానూ తలొగ్గుతోంది. మొత్తమ్మీద చంద్రబాబు, జగన్ లు ప్రాంతీయ అధినేతలుగా కాకుండా ఎన్డీఏకు అనధికార బాగస్వాములుగా, రహస్య మిత్రులుగా మారిపోయారు. ఇది కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకే కాదు, దక్షిణాది విశాల హితానికీ చేటు తెస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News