బంధం తెగితేనే బెటరట…శత్రువులైతేనే మేలట

అగ్నికి ఆజ్యం పోయడం అంటే ఇదే. ఇంతకాలం ఏ గొడవా లేకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండేవారు. అటు కేసీఆర్, ఇటు జగన్ ఒకరితో ఒకరు సామరస్యంగా [more]

Update: 2020-05-13 08:00 GMT

అగ్నికి ఆజ్యం పోయడం అంటే ఇదే. ఇంతకాలం ఏ గొడవా లేకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండేవారు. అటు కేసీఆర్, ఇటు జగన్ ఒకరితో ఒకరు సామరస్యంగా ఉంటూ వచ్చారు. అయితే ఇపుడు జల జగడం ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టేలా ఉంది. నిజానికి జగన్ చెబుతున్నట్లుగా ఏపీకి ప్రాణావసరం. పైగా కృష్ణా నది బోర్డుకు కట్టుబడి మాత్రమే ఏపీ తన నీటి వాటాను వాడుకుంటోంది. కానీ అనవసరంగా తెలంగాణా బీజేపీ కెలికింది. దానికి అక్కడ కాంగ్రెస్ సహా వామపక్షాలు మద్దతుగా నిలిచాయి. ఈ పరిణామంతో ఇపుడు ఏపీలోని రాజకీయ పక్షాల‌ వైపు అందరి చూపు నిలిచి ఉంది.

బాబు ఉలకరా..?

ఏపీకి తొలి సీఎం గా పనిచేసిన నాయకుడు, నిన్నటి దాకా పాలించిన నేత చంద్రబాబు ఈ నీటి జగడాలపైన కనీసం పెదవి విప్పకపోవడంపైన సర్వత్రా చర్చ సాగుతోంది. నిజానికి చంద్రబాబు రాయలసీమకు చెందిన వారు. అక్కడ నీటి కష్టాలు ఎలా ఉంటాయో కూడా చంద్రబాబుకు తెలియనిది కాదు. పైగా పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకం గురించి కూడా చంద్రబాబుకు తెలుసు. ఏపీ పక్షాన‌ చంద్రబాబు ఈ కీలకమైన సమయంలో నోరు మెదుపుతారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ చంద్రబాబు ప్రతీ రోజు ఏపీలోని వైసీపీ మీద అన్ని విషయాలు మాట్లడేసి ఈ విషయం మాత్రం దాటేస్తున్నారు. ఓ విధంగా ఇది చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ అనుకోవాలన్న మాట కూడా ఉంది.

మౌనమేనా..?

మరో వైపు చూసుకుంటే తెలంగాణాలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక్క తాటిపైకి వస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు కూడా ఏపీ తీసుకోకూడదని అంటున్నాయి. దీని మీద అక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ తేడా లేకుండా ఒక్కటిగా ఉన్నాయి. మరి ఏపీలో చూసుకుంటే జనసేన అధినేత కూడా ఏమీ మాట్లాడడంలేదు. పవన్ కళ్యాణ్ రాయలసీమ వాసులకు తన అండ ఉంటుందని ఎపుడూ చెబుతారు. అలాటిది వారి దాహార్తి తీర్చడం కోసం జగన్ సర్కార్ ఒక జీవో జారీ చేస్తే దాన్ని మీద పెద్ద ఎత్తున రాధ్ధాంతం అవుతూంటే కనీసంగా కూడా స్పందించడం లేదు. ఇంకో వైపు ఏపీలోని వామపక్షాలు సైతం సైలెంట్ గానే ఉన్నాయి. కాంగ్రెస్ సరే సరి. మరి దీన్ని ఏ విధంగా చూడాలన్నది కూడా చర్చగానే ఉంది.

వేడి రాజేశారా…?

ఇపుడున్న పరిస్థితుల్లో జగన్ రాజకీయంగా బలంగా ఉన్నారు. ఆయనకు రాజకీయ చాణక్యుడు, వ్యూహకర్త కేసీఆర్ మద్దతు గట్టిగా ఉంది. వారిద్దరూ కలిస్తే విపక్షాలు ఇబ్బందే. అందుకే తెలంగాణాలో చిచ్చు రాజేశారు. నిజానికి దీని మీద కృష్ణా బోర్డు ఏదో డెసిషన్ చెబుతుంది. పైగా సుప్రీం కోర్టుకు కూడా వెళ్లాలని కేసీఆర్ సర్కార్ చూస్తోంది. కానీ రాజకీయం చేసి ప్రయోజనం పొందుదామని తెలంగాణాలోకి విపక్షాలు చూస్తున్నాయి. వాస్తవానికి ఈ జీవో ఈ నెల 5న విడుదల అయింది. రెండు రోజుల క్రితం వరకూ దీని మీద వేడి లేదు.

విడిపోతేనే..?

హఠాత్తుగా విపక్షాలు ఈ అంశం ఎత్తుకోవడం వల్లనే కేసీఆర్ సర్కార్ కూడా మాటల యుధ్ధం మొదలుపెట్టింది. అంటే ఇందులో తెలంగాణా ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయమే ఉందని కేసీఆర్ సర్కార్ కి కూడా తెలుసు. ఇక జగన్ మీద బాణాలు దూసే పరిస్థితి రావడం అంటే ఇబ్బందే. మరో వైపు జగన్ పరిస్థితి కూడా అంతే. అయితే తెలంగాణాలో అన్ని పార్టీలు కలిస్తే ఏపీలో మాత్రం జగన్ ని కార్నర్ చేస్తున్న విపక్షాలు వ్యూహాత్మకమైన మౌనం పాటిస్తున్నాయి. జగన్, కేసీఆర్ బంధం తెగితే అది తమకు గరిష్ట లాభమన్న ఆలోచనలో ఉన్నాయా అన్న డౌట్లు వస్తున్నాయి.

Tags:    

Similar News