పూర్తిగా చెడినట్లేగా? ఇక అతుక్కోవడం కష్టమేనా?

ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారివే. ఎవరి రాజకీయ అవసరాలు వారివే. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మైత్రికి గండిపడిందనే చెప్పాలి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం [more]

Update: 2020-10-07 05:00 GMT

ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారివే. ఎవరి రాజకీయ అవసరాలు వారివే. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మైత్రికి గండిపడిందనే చెప్పాలి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు ఇక కలుసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. పోతిరెడ్డి పాడు విస్తరణ పనులు ఈ వివాదాన్ని తెచ్చిపెట్టాయనే చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం జగన్ తో కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను గండికొట్టడమే కాకుండా, తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందని కేసీఆర్ అనుమానిస్తున్నారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత…..

అందుకే అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత ఏపీ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పోతిరెడ్డి పాడు తదితర ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే అలంపూర్ – పెద్ద మరూర్ దగ్గర ప్రాజెక్టును నిర్మించి తీరతామని కేసీఆర్ తెలిపారు. రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ఖాయమని తెలిపారు. అంటే కేసీఆర్ నదీజలాల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ధీటుగా మరిన్ని అడుగులు వేయడం ఖాయమని తెలుస్తోంది.

పోతిరెడ్డి పాడు వివాదంతో….

దీంతో ఇన్నాళ్లూ సయోధ్యగా ఉన్న రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు దెబ్బతినే అవకాశాలున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ సంతోషించారు. రెండు, మూడు సార్లు తన ఇంటికి జగన్ ను ఆహ్వానించారు. తాను జగన్ ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చారు. కేసీఆర్ కు కూడా జగన్ అన్ని విషయాల్లో గౌరవం ఇస్తూ వచ్చారు. కానీ రాయలసీమ ఎత్తిపోతల పధకం మాత్రం వీరిద్దరూ భవిష్యత్ లో కలుసుకోలేని విధంగా పరిస్థితులు వచ్చాయన్నది మాత్రం వాస్తవం.

గత ఆరేళ్లలో….

రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పెద్దగా చోటు చేసుకోలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పట్టిసీమపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినా అంత సీరియస్ గా పట్టించుకోలేదు. కానీ జగన్ విషయంలో ఇక కేసీఆర్ వెనక్కు తగ్గరని అంటున్నారు. బీజేపీతో జగన్ అంటకాగుతుండటం, బీజేపీ ట్రాప్ లో జగన్ పడిపోయారని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మొత్తం మీద ఇద్దరి ముఖ్యమంత్రులకు పూర్తిగా చెడిందనేది పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న టాక్.

Tags:    

Similar News