జగన్ బాగా నచ్చేస్తున్నారా ?

రాజకీయాలు ఎపుడెలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. ఉప్పూ నిప్పులా ఉన్న పార్టీలే కలసిపోతూంటాయి. రాజకీయ అవసరాలు, అనివార్యతలు అలా కలిపేస్తూ ఉంటాయి. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే శత్రువుకు [more]

Update: 2020-06-14 02:00 GMT

రాజకీయాలు ఎపుడెలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. ఉప్పూ నిప్పులా ఉన్న పార్టీలే కలసిపోతూంటాయి. రాజకీయ అవసరాలు, అనివార్యతలు అలా కలిపేస్తూ ఉంటాయి. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న రాజ‌ నీతి కూడా ఇక్కడ వర్తిస్తుంది. ఏ ముహూర్తాన చిరంజీవి జగన్ ఇంటికి వెళ్ళి విందారగించారో నాటి నుంచి ఆయన పసుపు పార్టీకి టార్గెట్ అయిపోయారు. ఇక ఆయన అటు కేసీఆర్, ఇటు జగన్ ని కలుస్తూ సినిమా సమస్యలు చర్చకు తీసుకువస్తున్నా కూడా ఆయన తమ్ముళ్ళు రాజకీయాల్లో ఉండడంతో ఆయన ప్రభావం వారి మీద పడుతోంది. సినిమాలకు సంబంధించి అయినా కూడా చిరంజీవి జగన్ ని కలవకూడదు అన్న తీరుగా తెలుగుదేశం రాజకీయం ఉంది. అందుకే సినిమా నటుడుగా ఉన్న‌ బాలయ్యని రెచ్చగొట్టి చిరంజీవిని గట్టిగా కార్నర్ చేస్తున్నారు.

మండుతోందిగా…

ఇదే విషయం ఇపుడు సినిమాల నుంచి రాజకీయాలకు మారి ఏకంగా తెలుగుదేశం పార్టీని జనసైనికులు టార్గెట్ చేసే దిశగా సాగుతోంది. జనసేనలో కీలక నేతగా ఉన్న నాగబాబు పూర్తిగా తెలుగుదేశం వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. ఆయనకు ఇపుడు తెలుగు మీడియాలో ఎల్లో మీడియా బాగా కనిపిస్తోంది. నిన్నటిదాకా ఓడ మల్లయ్య అన్న వారే ఇపుడు జనసేనను బోడి మల్లయ్య అంటున్నారని తెలుగుదేశం అనుకూల మీడియా మీద ఘాటుగానే కామెంట్స్ చేసారు. మీలాంటి వారికి జగనే సరైన మందు అంటూ ఇండైరెక్ట్ గా జగన్ కి మద్దతు పలికారు. ఇది నిజంగా ఊహించని పరిణామం. ఇంతకు ముందు కూడా నాగబాబు భూముల వివాదంపై బాలయ్యని టార్గెట్ చేస్తూ అమరావతిలో టీడీపీ ఇన్సైడ్ ట్రేడింగ్ చేయలేదా అంటూ అడిగి కడిగేశారు. అది వైసీపీ చేస్తూ వచ్చిన ఆరోపణే. ఇక ఒక చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇక ఏపీలో చస్తే టీడీపీ అధికారంలోకి రాదు అని కూడా గట్టిగా స్టేట్ మెంట్ ఇచ్చారు.

భారీ నష్టమే….

ఇపుడు చిరంజీవి, బాలయ్యల మధ్యన సినిమా రంగంలో సాగుతున్న మాటల యుధ్ధం వెనక బాలయ్య పావు అయితే వెనక నుంచి ఆడిస్తున్నది టీడీపీ అన్నది మెగా టీం గ్రహించేసింది. దాంతో బాలయ్యని పక్కన పెట్టి ఎల్లో మీడియాను, ఆ వెనక టీడీపీని కూడా ముందు నాగబాబు తగులుకుటే ఇపుడు సోషల్ మీడియాలో కూడా టీడీపీని జనసైనికులు గట్టిగా కౌంటర్లేస్తున్నారు. మరో వైపు విశాఖకు చెందిన జనసేన నాయకుడు బొలిసెట్టి సత్యనారాయణ సైతం టీడీపీ మీద విరుచుకుపడ్డారు. టీడీపీ చిరంజీవిని టార్గెట్ చేయండం సిగ్గు చేటు అంటున్నారు. సినిమా పెద్దలు గతంలో ఎవరినీ కలవలేదా. ఎన్టీయార్, ఏయన్నార్ సినీ సమస్యల మీద నాడు ముఖ్యమంత్రులను కలవలేదా అని కూడా గట్టిగానే నిలదీశారు.

చెడిపోయినట్లే…?

ఇక పవన్ ఒక్కరే ఇపుడు పెదవి విప్పాల్సిఉంటుందేమో. జనసైనికులు గత కొన్ని రోజులుగా చిరంజీవిని టార్గెట్ చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. బాలయ్య తెలుగుదేశం ఎమ్మెల్యే. పైగా ఆయన సొంత బావ బాబు టీడీపీ అధినేత. బాలయ్య సైతం టీడీపీని అధికారంలోకి తెస్తామని గర్జిస్తున్నారు. వారికి ఇటు జగన్ బధ్ధ విరోధి, అదే జగన్ ని చిరంజీవి కలిస్తే మంటగా ఉంటోంది. చిరంజీవి సినీ పెద్దరికం కూడా గిట్టడంలేదు. ఈ పరిణామాలన్నీ కూడా రాజకీయంగా మంటలు పెడుతున్నాయి. టీడీపీ జనసేన బంధాల మధ్యన బీటలు వార్చేలా చేస్తున్నారు. పవన్ మౌనంగా ఉన్నా కూడా జనసైనికులు మాత్రం టీడీపీని చీల్చిచెండాడుతున్నారు. ఈ పరిణామాలు ఇలాగే సాగితే మళ్ళీ భవిష్యత్తులో కూడా బాబుతో పవన్ ఎటువంటి అవగాహనకు రాలేని విధంగా అగాధం ఏర్పడిపోతుంది. మొత్తానికి ఈ పరిణామాలు మాత్రం జగన్ పట్ల జనసైనికులను సానుకూలం చేయడం విశేషం.

Tags:    

Similar News