ఏంటిది జ‌గ‌న్ ? ఆ అవుట్ డేటెడ్ లీడ‌ర్‌కు ఎమ్మెల్యే సీటా ?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీని ప‌టిష్టం చేసే విష‌యంలో త‌ప్పట‌డుగులు వేస్తున్నారా ? ముఖ్యంగా ప్రతిప‌క్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ పార్టీ త‌ర‌పున [more]

Update: 2021-03-01 13:30 GMT

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీని ప‌టిష్టం చేసే విష‌యంలో త‌ప్పట‌డుగులు వేస్తున్నారా ? ముఖ్యంగా ప్రతిప‌క్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ పార్టీ త‌ర‌పున బ‌ల‌మైన నాయ‌కుల‌ను ఎంపిక చేయ‌డంలో త‌డ‌బ‌డుతోన్న ప‌రిస్థితే ఉంది. ముఖ్యంగా అద్దంకి, ప‌రుచూరు, రాజ‌మ‌హేంద్రవ‌రం సిటీ, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలు, ఇచ్ఛాపురం, టెక్కలి లాంటి చోట్ల జ‌గ‌న్ నాయ‌క‌త్వాల‌ను ఇష్టానుసారం మార్చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన నేత‌ల‌ను ప‌క్కన పెట్టేసి కొత్త వారికి బాధ్యత‌లు ఇస్తోన్నా అవి స‌త్ఫలితాలు ఇవ్వడం లేదు. ఈక్ర‌మంలోనే ప్రతిప‌క్ష పార్టీ బ‌లంగా ఉన్న ఓ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ నాయ‌క‌త్వాన్ని మార్పు చేసి కొత్త నాయ‌క‌త్వాన్ని తెచ్చిపెట్టారు.

టీడీపీకి కంచుకోటగా…..

అయితే జ‌నాలు ఎప్పుడో మ‌ర్చిపోయిన ఈ అవుట్ డేటెడ్ లీడ‌ర్‌ను ఏరి కోరి తీసుకువ‌చ్చి పార్టీ ప‌గ్గాలు ఇవ్వడ‌మే ఇక్కడ ఆస‌క్తిక‌రం. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండిలో టీడీపీ పుట్టాక 2004లో మాత్రమే ఓడింది. ఆ త‌ర్వాత 2009, 2014, 2019 ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా గెలుస్తూ స‌త్తా చాటుతోంది. ఉండి అంటేనే టీడీపీకి కంచుకోట‌గా మారిపోయింది. వైసీపీ ఇక్కడ రెండు సార్లు పోటీ చేసినా రెండు సార్లు చిత్తుగానే ఓడింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ నుంచి పోటీ చేసిన సీవీఎల్‌. న‌ర‌సింహారాజు వ‌ల్ల పార్టీకి ఒరిగేదేమి లేద‌ని ఆయ‌న్ను త‌ప్పించేసింది.

జ‌నాలు మ‌ర‌చిన గోక‌రాజుకు పార్టీ ప‌గ్గాలా ?

మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు సోద‌రుడు, మాజీ టీటీడీ బోర్డు మెంబ‌ర్, 1999లో ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన గోక‌రాజు రామం ( రాము)కు ఇప్పుడు ఉండి పార్టీ క‌న్వీన‌ర్ ప‌ద‌వి ఇచ్చారు. అప్పుడెప్పుడో వైఎస్ జ‌మానాలో ఉండిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాక ఆయ‌న ఏమైపోయారో తెలియ‌దు. త‌ర్వాత ఉండిని మాజీ ఎమ్మెల్యే స‌ర్రాజు త‌న కోట‌గా మార్చుకుని మూడు సార్లు పోటీ చేశారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు స‌ర్రాజు స్వయంగా త‌ప్పుకుని సీవీఎల్‌కు సీటు ఇప్పించారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఉండి వైసీపీ మూడు చెక్కలైంది. స‌ర్రాజు, సీవీఎల్‌, ఎంపీ ర‌ఘురామ వ‌ర్గానికి తోడు…. గోక‌రాజు గంగ‌రాజు త‌న‌యుడు రంగ‌రాజుకు న‌ర‌సాపురం పార్లమెంట‌రీ పార్టీ ప‌గ్గాలు ఇవ్వడంతో ఉండి వైసీపీలో ఎవ‌రు ఏ వ‌ర్గమో తెలియ‌కుండా పోయింది.

ఇప్పటికే ఉన్న గ్రూపుల‌కు తోడు మ‌రో కొత్త గ్రూపా ?

గోక‌రాజు ఫ్యామిలీ వైసీపీలో చేరింది. పార్టీలో చేరిన వెంట‌నే గోక‌రాజు రంగ‌రాజుకు న‌రసాపురం పార్లమెంట‌రీ పార్టీ ప‌గ్గాలు క‌ట్ట‌బెట్టారు. ర‌ఘురామ అస‌మ్మతి గ‌ళంతో ఆయ‌న‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం ఎంపీ సీటు ఇస్తార‌న్న ప్రచారం కూడా జ‌రిగింది. ఇంత‌లోనే అదే కుటుంబానికి చెందిన రామ‌రాజుకు వైసీపీ వ‌ర్గాలే షాక్ అయ్యేలా ఉండి పార్టీ ప‌గ్గాలు ఇవ్వడంతో ఎవ్వరి నోటా మాట రాని ప‌రిస్థితి. జనాలు మ‌ర్చిపోయి.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటోన్న రంగ‌రాజుకు ఏదో నామ్ కే వాస్తేగా ఈ ప‌ద‌వి ఇచ్చార‌న్న విమ‌ర్శలు వ‌స్తున్నాయి. మ‌రి జ‌గ‌న్ నిర్ణయం ఉండి వైసీపీ రాజ‌కీయాన్ని ఏ తీరాల‌కు చేరుస్తుందో ? చూడాలి.

Tags:    

Similar News