జగన్ ని బాబు సేవ్ చేస్తున్నారా… ?

రాజకీయాల్లో చాలా సంఘటన‌లు పరస్పర ప్రేరితాలు. ఒక ఘటన మరో చోట ప్రభావం చూపుతుంది. దేనికీ సంబంధం లేదు అని అనుకుంటారు కానీ కచ్చితంగా ఇంటర్ లింక్ [more]

Update: 2021-07-09 05:00 GMT

రాజకీయాల్లో చాలా సంఘటన‌లు పరస్పర ప్రేరితాలు. ఒక ఘటన మరో చోట ప్రభావం చూపుతుంది. దేనికీ సంబంధం లేదు అని అనుకుంటారు కానీ కచ్చితంగా ఇంటర్ లింక్ ఉంటుంది. ఏపీలో చంద్రబాబు, జగన్ బద్ధ శత్రువులు అన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఒకరి ముఖాన్ని కూడా మరొకరు చూసుకోరు. కనీసం ఎదురుపడాలని కూడా అనుకోరు. మొత్తం భారతదేశం అంతా వెతికి చూసినా ఇలాంటి దారుణమైన రాజకీయం ఎక్కడా ఉంటుందని ఎవరూ అనుకోరు. దీని వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతున్నా ఎవరి స్వార్ధం వారిది. ఎవరి రాజకీయం వారిది. ఇలా వీరిద్దరూ ఉండబట్టే కేంద్రంలోని బీజేపీకి కూడా ఏపీ అసలు ఖాతరు లేదు అన్న మాట ఉంది. ఇవన్నీ పక్కన పెడితే అటు జగన్ ఇటు చంద్రబాబు ఈ ఇద్దరు బీజేపీ నోటి దగ్గరే ఉన్నారు. వీరిలో ఎవరిని మింగాలనుకున్నా ఈక్వల్ బ్యాలన్స్ ఉండదు. గాడి తప్పుతుంది. అందుకే బీజేపీ అలా వీరిని వారి మానాన ఉంచుతోంది అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.

జగన్ బేఖాతర్….

ఇక్కడ చంద్రబాబు కంటే అధికారంలో ఉన్న జగన్ తోనే బీజేపీకి ఎక్కువ అవసరాలు ఉన్నాయి. జగన్ మీద ఉన్న సీబీఐ కేసుల మూలంగా ఆయన బీజీపీకి లొంగి ఉండాల్సి వస్తోంది. అలా జగన్ ని దగ్గర చేసుకుని సౌత్ లో రాజకీయాన్ని రక్తి కట్టించాలని బీజేపీ చూస్తోంది. కానీ జగన్ కొన్ని విషయంలో ఎడ్డెమంటే తెడ్డెమంటున్నారు. ఎంత జగన్ ఒదిగినా అవి కేవలం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రమే. తన సొంత రాజకీయాల వద్దకు వచ్చేసరికి బీజేపీని అసలు టచ్ చేయనీయడంలేదు. ఏపీకి నిధులు కోత పెట్టినా, హోదా ఇవ్వకపోయినా, విభజన హామీలు గాలికి పోయినా జగన్ ఓర్చుకుంటున్నారు కానీ తన ఓటు బ్యాంక్ ని డిస్టర్బ్ చేస్తానంటే మాత్రం అసలు ఊరుకోరు. ఆ సంగతి ఆలస్యంగా బీజేపీ పెద్దలకు అర్ధమైందిట.

టచ్ మీ నాట్…

జగన్ విషయంలో ఏదో ఒకటి చేయాలన్న కసి అయితే బీజేపీ పెద్దలకు ఉంది. ఎందుకంటే రాజకీయంగా జగన్ కలసి రాకపోతే ఏపీలో బీజేపీ ఇంకా అడుక్కు పోతుంది. బీజేపీ వ్యవహారం చూస్తే ఈ ఒక్క రోజుతో పబ్బం గడుపుకునేది కాదు. అందువల్ల బలమైన జగన్ ని ఏపీలో ముందుంచి అక్కడ తమ పార్టీ విస్తరణకు రాజకీయ సాయన్ని కోరుతోంది. ఇక్కడ తమ ప్రభుత్వంలో జగన్ ఎంపీలు చేరితే ఏపీలో కూడా బీజేపీకి ఎమ్మెల్సీలు, మంత్రులు జగన్ ఇవ్వాలన్నది ఒక షరతు, ఎత్తుగడ, అలా 2024 నాటికి కూడా పొత్తులు ఉండాలన్నది కూడా వ్యూహంగా ఉంది. కానీ జగన్ కేవలం రాష్ట్రం, కేంద్రం వరకే స్నేహం అంటున్నారు. రాజకీయంగా టచ్ మీ నాట్ అనేస్తున్నారు. ఇదే కమలనాధులకు మండిపోయేలా చేస్తోందిట.

చక్ర బంధంలోనే…?

దాంతో జగన్ మీద కఠిన చర్యలకు దిగిపోదామంటే కూడా బీజేపీ వల్ల కావడంలేదుట. ఏపీలో జగన్ ని ఏమైనా చేస్తే తక్షణ రాజకీయ లాభం అందుకోవడానికి చంద్రబాబు రెడీగా ఉన్నారుట. బాబుకి మేలు చేసే పని చేయడానికి బీజేపీ పెద్దలు అసలు ఇష్టపడరని చెబుతారు. జగన్ ని ఏం చేయాలన్నా కూడా చంద్రబాబు విషయంలో ఒక క్లారిటీ బీజేపీకి ఉండాలి. అది రాకపోవడం వల్లనే జగన్ సేఫ్ జోన్ లో ఉన్నారని అంటున్నారు. జగన్ ని వదిలేసుకుని చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేస్తే ఆయన 2024 నాటికి హ్యాండ్ ఇస్తారన్న భయం, అనుమానాలు బీజేపీ పెద్దలకు ఉన్నాయట. ఇప్పటికైతే బాబు బీజేపీ స్నేహమే కోరుకుంటున్నారుట. దాన్ని నమ్మి జగన్ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఏపీలో జగనే కాదు, తరువాత ఢిల్లీలో బాబు చక్రం తిప్పితే తామూ నష్టపోతామనే బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారని టాక్. దాంతో ప్రస్తుతానికి జగన్ కి ఏపీకి ఏమీ మేలు చేయకుండా కీడూ తలపెట్ట‌కుండా తటస్థంగా ఉండాలని ఆలోచిస్తున్నారుట. దాని వల్ల జగన్ కి రాజకీయంగా వ్యక్తిగతంగా మేలు జరిగినా కూడా ఏపీ మాత్రం ఈ చెలగాటంలో ఇంకా దారుణంగా నష్టపోవడం ఖాయమనే అంటున్నారు.

Tags:    

Similar News