సైలెంట్ గా ఉంటూ సగాన్ని సైలెంట్ చేశారే?

జగన్ ఎక్కువగా మాట్లాడరు. ఆయనకు సైలెన్స్ అంటే ఇష్టం. మరి విపక్ష టీడీపీకి అదే పనిగా ఉన్నదానికే, లేనిదానికీ సౌండ్ చేయడమే ఇష్టం. అందుకే అధికారంలో ఉన్నపుడల్ల [more]

Update: 2020-03-06 08:00 GMT

జగన్ ఎక్కువగా మాట్లాడరు. ఆయనకు సైలెన్స్ అంటే ఇష్టం. మరి విపక్ష టీడీపీకి అదే పనిగా ఉన్నదానికే, లేనిదానికీ సౌండ్ చేయడమే ఇష్టం. అందుకే అధికారంలో ఉన్నపుడల్ల పెద్ద నోళ్ళు పెట్టుకుని విరుచుపడేవారు నాయకులు. ఇపుడు ఆ పెద్ద నోళ్ళు ఒక్కోటిగా మూతపడుతున్నాయి. కాదు, సైలెన్స్ బాగా ఇష్టపడే జగనే అలా వారి నోళ్ళు ఒక్కోటిగా మూయించేస్తున్నాడు. జగన్ అధికారంలోకి వచ్చి పది నెలల కాలంలో కనీసం పది పెద్ద తలకాయలను సైలెంట్ మోడ్ లో ఉంచాడంటే రాజకీయ మొనగాడు కిందే లెక్క అంటున్నారు. వీరంగం వేస్తూ విరుచుకుపడే తమ్ముళ్ళు ఇపుడు ఎక్కడ ఉన్నారో కూడా అంతు చిక్కడంలేదు. అలాంటి వారిలో చంద్రబాబు కుడిభుజంగా ఉంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా తాజాగా చేరిపోయాడట.

ఆ ఇద్దరితో అలా…..

ముందుగా ఇద్దరు మాజీ మంత్రులతో వైసీపీ కధ మొదలెట్టింది. అమరావతి రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ విపక్షంలో ఉన్నపుడు చేసిన ఆరోపణలు అధికారంలోకి రావడంతోనే పదును పెట్టింది. దాంతో సీఐడీ విచారణ దశను దాటి ఈడీ విచారణ దాకా వ్యవహారం ముందుకు సాగుతోంది. దాంతో టీడీపీలో కీలకమైన ఇద్దరు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ కంప్లీట్ గా సైలెంట్ అయ్యారు. వీరిద్దరూ ఎక్కడ ఉన్నారో కూడా ఇపుడు తెలియడంలేదని తమ్ముళ్ళే సెటైర్లు వేస్తున్న పరిస్థితి.

జేసీకే బ్రేకులు….

ఇక రాజకీయంగా ఎవరూ తనకు లెక్కలేదని చెప్పుకునే మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి నోరు కూడా ఈ మధ్య మూతపడిపోయింది. జగన్ ని నానా మాటలు అని చెడుగుడు ఆడే ఈ రాయలసీమ పెద్దాయన ఇపుడు ఎందుకొచ్చిన తలనొప్పి అన్నట్లుగా ఉన్నాడు. ఆయన బస్సులకు తాళాలు పడ్డాయి. అలాగే ఆయన సిబ్బంది చేసిన ఫోర్జరీ కధ కూడా బయటకు రావడంతో బాగా ఇరుక్కుపోయారు. ఇపుడు జేసీ జగన్ మావాడే అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప ఏం చేయలేని సీన్ కనిపిస్తోంది. అలాగే చంద్రబాబు వెంట ఉంటూ మీడియాలో ప్రతీ రోజూ వైసీపీ నేతలను చెడుగుడు ఆడే ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సైతం సైలెంట్ అయ్యారు. ఆయన కుటుంబీకులకు చెందిన భూకబ్జా బాగోతం వెలుగు చూడడం, విజయవాడ నడిబొడ్డునే 200 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఆక్రమించారని కేసులు నమోదు చేశారని తెలుస్తోంది.

అచ్చెన్న అంతేనా…?

ఇక బాబు పక్కన ఉండే అచ్చెన్న కూడా ఇపుడు మౌనం దాలుస్తున్నారు. ఈ మధ్యనే ఈఎస్ ఐ కుంభకోణలో అచ్చెన్నాయుడు పేరు రావడం, విజిలెన్స్ విచారణలో వందల కోట్లు చేతులు మారాయని చెప్పడంతో అచ్చెన్న కాస్తా నెమ్మదించారట. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా బాగా తగ్గిపోయారు. మరో వైపు విజయవాడకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీద పోలవరం అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇదే విజయవాడకు చెందిన మాజీ మేయర్, టీడీపీ మహిళా నాయకురాలు అనూరాధ కుటుంబ సభ్యుల మీద ట్రస్ట్ భూములు ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. వీటి మీద కూడా వైసీపీ దూకుడు పెంచింది. మొత్తానికి చూసుకుంటే చురుకైన నేతలు, నోరున్న తమ్ముళ్ళ భరతం పట్టేందుకు మొదటి విడతలోనే జగన్ సర్కార్ దూసుకువచ్చింది. దాంతో తొలి ఏడాది కూడా రాకముందే సైకిల్ పార్టీలో సగం సైలెంట్ అయిందని అంటున్నారు. ముందు ముందు చూడాలి ఏం జరుగుతుందో మరి.

Tags:    

Similar News