ఆ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ సర్కస్?

రాజమండ్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో వైసీపీ సర్కస్ ఫీట్లు చేస్తుంది. ఈ రెండు చోట్లా జగన్ వేవ్ లో కూడా భారీగానే ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు ఓటమి [more]

Update: 2021-02-04 12:30 GMT

రాజమండ్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో వైసీపీ సర్కస్ ఫీట్లు చేస్తుంది. ఈ రెండు చోట్లా జగన్ వేవ్ లో కూడా భారీగానే ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. దాంతో జగన్ ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్య ప్రకాష్ రావు ను కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పించి ఏపిఐఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రమణ్యానికి పగ్గాలు అప్పగించారు జగన్. రూరల్ లో ఆకుల వీర్రాజునే ఎన్నికల తరువాత కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ రెండు చోట్లా వీరిద్దరిపై అధినేత పెట్టుకున్నంత స్థాయిలో పార్టీ బలోపేతం కావడం లేదన్న నివేదికలతో అధిష్టానం మరోసారి ప్రయోగాలకు సిద్ధమౌతున్నట్లు పార్టీ వర్గాల్లో గట్టిగానే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంపై శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజులు మౌనం దాలుస్తున్నారు. సుబ్రహ్మణ్యం అయితే పదవి ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఇప్పటికే తన వ్యాపారాలు అటకెక్కాయని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడం విశేషం.

అర్బన్ లో ఆకుల … ?

కాంగ్రెస్, ఆ తరువాత బిజెపి నుంచి ఎమ్యెల్యే అది అయ్యాక జనసేన నుంచి ఎంపి గా పోటీ చేసి ఓడిపోయిన ఆకుల సత్యనారాయణ ను రాజమండ్రి అర్బన్ కి అధిష్టానం ఎంపిక చేస్తుందంటున్నారు. ఇప్పటికే ఈ పోస్ట్ కోసం ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ద్వారా ఆకుల గట్టి లాబీయింగ్ నే నడుపుతున్నారని అంటున్నారు. ఇక రూరల్ లో అయితే పోటీ తీవ్రంగానే ఉంది. అక్కడ ఎంపి భరత్ రామ్ గ్రూప్ లోనే ఇద్దరు నేతలు కో ఆర్డినేటర్ కోసం వేచి చూస్తున్నారని చెబుతున్నారు. వైసీపీ కష్టకాలం నుంచి ఉన్న ఆకుల వీర్రాజు ను కో ఆర్డినేటర్ నుంచి తప్పించినా ఆయనకు నామినేటెడ్ పదవిని జగన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. రూరల్ నియోజకవర్గంలో బలమైన బంధు జనం యంత్రాంగం ఉన్న వీర్రాజు కినుక వహించకుండా వ్యవహారం నడపకపోతే అసలుకే ఎసరు వస్తుందంటున్నారు. మరోపక్క అర్బన్ లో సిటీ ప్రెసిడెంట్ నందెపు శ్రీనివాస్ ను కూడా మార్చే ఆలోచన అధిష్టానం చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది.

ఇద్దరు దిగ్గజాలే …

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గట్టి పట్టున్న నేత. టిడిపి ఆవిర్భావం నుంచి ఉన్న ఆయన రూరల్ లోనే కాదు అర్బన్ లోను చక్రం తిప్పగల సత్తా ఉన్న నాయకుడు. ప్రస్తుతం చంద్రబాబు పాలిట్ బ్యూరో పదవిని కూడా గోరంట్లకు ఇవ్వడంతో ఆయన మంచి దూకుడు మీదే ఉన్నారు. జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో యువకులతో పోటీ పడేవిధంగానే ఉద్యమాలు చేస్తున్నారు. ఇక అర్బన్ లో ఇప్పటికి ఆదిరెడ్డి భవాని కుటుంబానికి తిరుగులేదనే చెప్పాలి. భవాని మామ మాజీ ఎమ్యెల్సీ అప్పారావు భర్త శ్రీనివాస్ లకు అన్ని డివిజన్లలో బలమైన క్యాడర్ ఉంది. ఈ ఇద్దరు లీడర్లను సమర్ధంగా ఎదుర్కొని ఫ్యాన్ ను స్పీడ్ గా తిప్పే నాయకుల కోసం వైసీపీ కిందా మీదా పడుతూ చేస్తున్న ప్రయత్నాలు వైవి సుబ్బారెడ్డి కి సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల లోగా గ్రూప్ ల కుంపటిగా మారిన వైసీపీ శిబిరాన్ని ఒకే గాటికిందకు తెచ్చి పార్టీ జండా ఎగురవేసేందుకు జగన్ తీసుకునే చర్యలు ఎలా ఉండబోతాయన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొంది.

Tags:    

Similar News