కీల‌క స‌మ‌యంలో జ‌గ‌న్ కు దెబ్బేస్తున్న `ప‌థ‌కం`

ప్రస్తుతం మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్లకు ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. అధికార పార్టీకి చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన గ్రామ పంచాయ‌తీల్లో గెలుపు గుర్రం ఎక్కామ‌ని సంతోషంగా ఉన్నప్పటికీ [more]

Update: 2021-03-12 08:00 GMT

ప్రస్తుతం మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్లకు ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. అధికార పార్టీకి చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన గ్రామ పంచాయ‌తీల్లో గెలుపు గుర్రం ఎక్కామ‌ని సంతోషంగా ఉన్నప్పటికీ వైసీపీపై న‌గ‌రాలు… న‌గ‌ర పంచాయ‌తీల్లో తీవ్ర వ్యతిరేక‌త క‌నిపిస్తోంది. జ‌గ‌న్ నిర్ణయాల ప్రభావం న‌గ‌రాలు ప‌ట్టణాల్లోనే ఎక్కువ‌గా ఉంద‌నే వాద‌న కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం సాగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా 'ఇంటింటికీ రేష‌న్ పంపిణీ' మ‌రిన్ని సెగ‌లు పుట్టిస్తోంది. వైసీపీ నేత‌లు, సీఎం జ‌గ‌న్ మాట‌ల్లో చెప్పాలంటే.. ఈ ప‌థ‌కం దేశంలోనే ఇప్పటి వ‌ర‌కు ఏ రాష్ట్రం కూడా అమ‌లు చేయ‌లేదు.

అప్పు చేసి మరీ….

సుమారు 9270 వాహ‌నాల‌ను కొనుగోలు చేసి.. యువ‌త‌కు అప్పగించారు. ఒక్కో వాహ‌నం ద్వారా నెల‌కు 1800 మంది ల‌బ్ధిదారుల‌కు 1వ తారీకు నుంచి 15వ తారీకులోపు రేష‌న్ స‌రుకుల‌ను ఇంటి ముందుకే తీసుకువెళ్లాల‌ని నిర్దేశించారు. ఇది పైకి చెప్పడానికి, ప్రచారం చేసుకునేందుకు చాలా బాగానే ఉంది. ముఖ్యంగా ఈ ప‌థ‌కం నుంచి జ‌గ‌న్ చాలా నే ఆశించారు. ఓటు బ్యాంకు విష‌యంలో సానుభూతి త‌న‌కు పెరుగుతుంద‌ని భావించారు. ఈ క్రమంలోనే అప్పు చేసి మ‌రీ వాహ‌నాలు కొన్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ కార్యక్రమంపై సెగ‌లు పొగ‌లు క‌క్కుతున్నారు జ‌నాలు. నెల ముగిసినా.. త‌మ‌కు రేషన్ అంద‌లేద‌ని.. ప్రజ‌లు ఆందోళ‌న చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో మాత్రం…

అంతేకాదు.. ఈ ఆవేద‌న‌, ఆందోళ‌న కూడా.. కేవ‌లం న‌గ‌రాలు, ప‌ట్టణాల‌లోనే క‌నిపిస్తుండ‌డం ఇప్పుడు జ‌గ‌న్ స‌హాపార్టీకి ఇబ్బందిగా మారింది. నెల ముగిసిన‌ప్పటికీ.. ఫిబ్ర‌వ‌రి తాలూకు రేష‌న్ ప్రజ‌ల‌కు చేర‌లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ట్టణాల్లోను న‌గ‌రాల్లోనూ ల‌క్షల సంఖ్యలో ల‌బ్ధిదారులు ఈ ప‌థ‌కం అమ‌లు కోసం ఎదురు చూస్తున్నారు. పైగా రేష‌న్ వాహనాలను ఇంటికి ముంగిటికే తీసుకువ‌స్తామ‌ని చెప్పిన ప్రభుత్వం ఆ దిశ‌గా ఏర్పాట్లు చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది. వాహ‌నాల‌ను ఎక్కడో ఓ చోట ఆపి రేష‌న్ ఇస్తున్నారు.

వాహనం వస్తుందో? రాదో?

దీంతో అంద‌రూ ల‌బ్ధిదారులు అక్కడికే క్యూ క‌డుతున్నారు. మ‌రి కొంద‌రికి ఏ టైంలో రేష‌న్ బండి వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఇక సామాన్య, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ప‌డుతోన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇది ప‌ట్టణ పేద‌ల్లో అస‌హ‌నానికి కార‌ణంగా మారింది. ప్రస్తుతం న‌గ‌రాల్లోను, ప‌ట్ణాల్లోనూ ప్రచారం చేస్తున్న వైసీపీ నాయ‌కుల‌ను ల‌బ్ధిదారులు ఈ ప్రశ్నలే సంధిస్తున్నారు. దీంతో న‌గ‌రాలు, ప‌ట్టణాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో ఈ ప్రభావం ఓటింగ్‌లో ఎక్కడ ప‌డుతుందో ? అన్న ఆందోళ‌న జగన్ ను వెంటాడుతోంది.

Tags:    

Similar News